SGSTV NEWS online
CrimeTelangana

ఆ పసిపాపల నవ్వులు ఒక్కసారిగా మాయం.. చీకటిగా మారిన ఓ తల్లి జీవితం..!



ఈ ఘటన కేవలం ఒక కుటుంబ విషాదం మాత్రమే కాదు.. సమాజానికి అద్దం పట్టే సంఘటన. ఆడపిల్ల పుట్టడాన్ని ఇంకా కొందరు భారంగా భావించే మనస్తత్వం ఎంత ప్రమాదకరమో ఇది స్పష్టం చేస్తోంది. విద్య పెరిగినా, కాలం మారినా.. ఆలోచనలో మార్పు రాకపోతే ఇలాంటి దారుణాలు ఆగవు. పసిపాపల నవ్వులు ఒక్కసారిగా మాయమవ్వడం.. ఒక తల్లి జీవితమే చీకటిలో మునిగిపోవడం.. ఈ సంఘటన మనలో ప్రతి ఒక్కరినీ బాధ కలిగిస్తుంది.

ఆడపిల్లలే పుట్టారని ద్వేషం.. దారుణానికి ఒడిగట్టేలా చేసింది.. కరీంనగర్ మండలం జూబ్లీ నగర్‌లో చోటుచేసుకున్న హృదయవిదారక ఘటన ప్రతి మనసును కలచివేసింది. పసిపాపల నవ్వులతో కళకళలాడాల్సిన ఒక ఇల్లు.. ఒక్కసారిగా విషాదానికి నిలయంగా మారింది. కన్న తండ్రే తన ఇద్దరు చిన్నారుల ప్రాణాలు తీసిన ఈ దారుణం సమాజాన్ని కుదిపేస్తోంది.

శ్రీశైలం, మౌనిక దంపతులకు గీతాంశీ, గీతాన్విక అనే ఇద్దరు ఆరేళ్ల లోపు చిన్నారులు. అయితే ఆడపిల్లలే పుట్టారని తండ్రి మొదటి నుంచే అసహనం వ్యక్తం చేస్తూ వచ్చాడు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. మౌనిక గర్భవతిగా ఉన్నప్పటి నుంచే నీకు అన్నదమ్ములు లేరు. మీది ఆడపిల్లల సంతానం నీకు కూడా ఆడపిల్లలే పుడతారు.. అంటూ ఆమెను వేధించేవాడు. ఆడపిల్లలను ఎప్పటికైనా చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మనసులోని మాటలే క్రమంగా ద్వేషంగా మారి.. చివరికి క్రూర నిర్ణయానికి దారి తీసింది.

కన్న తండ్రి శుక్రవారం (ఏప్రిల్ 03) మధ్యాహ్నం ఇంటి వద్ద ఆడుకుంటున్న పిల్లలను బైక్‌పై తల్లి తెలియకుండా వ్యవసాయ పొలం వద్దకు తీసుకుని వెళ్లాడు. అక్కడ అమాయక చిన్నారులకు గడ్డి మందు తాగించి, అనంతరం బావిలోకి తోసేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు ప్రమాదంలా చూపించే ప్రయత్నం చేశాడు. ఇది ఆవేశంలో జరిగిన పని కాదనే అనుమానం వ్యక్తమవుతోంది. ముందుగానే పథకం ప్రకారం చేసిన హత్యగా భావిస్తున్నారు.

పిల్లలు కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన తల్లి మౌనిక.. వెంటనే పొలం వద్దకు చేరుకుంది. భర్త శ్రీశైలంను పిల్లలు ఎక్కడ అని అడిగితే ఏమీ తెలియనట్టు నాటకమాడాడు. అనుమానంతో చుట్టుపక్కల వెతకగా అక్కడ బావిలో చిన్నారి మృతదేహం కనిపించడంతో ఆమె ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ క్షణం ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. తన కళ్ల ముందే పిల్లలను కోల్పోయిన తల్లి ఆవేదన… అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది.

ఈ విషయం గ్రామంలో వ్యాపించడంతో స్థానికులు ఘటన స్థలానికి చేరుకుని ఆగ్రహంతో ఊగిపోయారు. పిల్లలను చంపిన అనుమానంతో తండ్రిపై దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. బావిలో నుంచి ఇద్దరు చిన్నారుల మృతదేహాలను వెలికి తీశారు. తల్లి మౌనిక ఫిర్యాదు మేరకు పోలీసులు శ్రీశైలంను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. చిన్నారుల మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటన కేవలం ఒక కుటుంబ విషాదం మాత్రమే కాదు.. సమాజానికి అద్దం పట్టే సంఘటన. ఆడపిల్ల పుట్టడాన్ని ఇంకా కొందరు భారంగా భావించే మనస్తత్వం ఎంత ప్రమాదకరమో ఇది స్పష్టం చేస్తోంది. విద్య పెరిగినా, కాలం మారినా.. ఆలోచనలో మార్పు రాకపోతే ఇలాంటి దారుణాలు ఆగవు. పసిపాపల నవ్వులు ఒక్కసారిగా మాయమవ్వడం.. ఒక తల్లి జీవితమే చీకటిలో మునిగిపోవడం.. ఈ సంఘటన మనలో ప్రతి ఒక్కరినీ బాధ కలిగిస్తుంది.

Also read

Related posts