SGSTV NEWS online
CrimeNational

హైదరాబాద్ నుంచి తమిళనాడు కూనూరు అడవుల్లోకి వెళ్లి ఇదేం పని..!



రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో డ్రోన్‌ల ప్రయోగం పూర్తిగా నిషేధమని అధికారులు తెలిపారు. అడవి జంతువుల జీవన విధానానికి, వాటి కదలికలకు, అలాగే పక్షులు గూళ్లు కట్టుకునే పరిసరాలకు డ్రోన్ శబ్దం తీవ్ర అంతరాయం కలిగిస్తుందని అటవీ శాఖ పేర్కొంది. పర్యాటకులు ఫోటోలు, వీడియోలు తీయడానికి డ్రోన్‌లు వినియోగించడం అలవాటైపోయింది.


తమిళనాడులోని నీలగిరి జిల్లా కూనూరు అటవీ ప్రాంతంలో నిషేధితమైన ప్రదేశంలో డ్రోన్ ఎగరేసిన యువకుడిని అటవీ శాఖ అధికారులు శుక్రవారం (నవంబర్ 28) అదుపులోకి తీసుకున్నారు. అధికారుల వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన శివ ప్రవీణ్ (24) అనే యువకుడు సాయంత్రం సుమారు 5.30 గంటల సమయంలో కూనూరు ఫారెస్ట్‌ రేంజ్‌కు చెందిన గవర్నమెంట్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో డ్రోన్‌ ఎగరేశాడు. గస్తీ విధుల్లో ఉన్న అటవీ సిబ్బంది అతన్ని అక్కడే పట్టుకుని విచారణకు తరలించారు.


రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో డ్రోన్‌ల ప్రయోగం పూర్తిగా నిషేధమని అధికారులు తెలిపారు. అడవి జంతువుల జీవన విధానానికి, వాటి కదలికలకు, అలాగే పక్షులు గూళ్లు కట్టుకునే పరిసరాలకు డ్రోన్ శబ్దం తీవ్ర అంతరాయం కలిగిస్తుందని అటవీ శాఖ పేర్కొంది. పర్యాటకులు ఫోటోలు, వీడియోలు తీయడానికి డ్రోన్‌లు వినియోగించడం అలవాటైపోయింది. అనుమతి లేకుండా రిజర్వ్ ఫారెస్ట్‌లోకి ప్రవేశించి వీటిని వినియోగించడం వలన అనేకసార్లు జంతువులు బెదిరిపోయే ఘటనలు నమోదయ్యాయి.

ఈ నేపథ్యంలోనే అడవిలోకి వెళ్తున్నాం అంటే.. వాటి నివాస ప్రాంతాలకు వెళ్తున్నామని అందరూ గుర్తుంచుకోవాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. వాటి మనుగడకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించకూడదని హెచ్చరించారు. విచారణ అనంతరం జిల్లా అటవీ అధికారి ఆదేశాల మేరకు శివ ప్రవీణ్‌కు రూ.10,000 జరిమానా విధించామని అధికారులు వెల్లడించారు. డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నామని, తదుపరి విచారణ నిమిత్తం కొనసాగిస్తున్నామని తెలిపారు.

ఈ ఘటనపై మరిన్ని వివరాలు సేకరిస్తున్నట్లు అటవీ శాఖ పేర్కొంది. అటవీ ప్రాంతాల్లో నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని, జంతువుల సంరక్షణలో భాగంగా డ్రోన్‌ల వినియోగంపై పూర్తిస్థాయి నిషేధం కొనసాగుతుందని అధికారులు హెచ్చరించారు

Also Read

Related posts