SGSTV NEWS online
CrimeNational

తలపై బాది, మణికట్టు కోసి బీభత్సం! క్లూస్ వదలకుండా ప్లాన్డ్ మర్డర్! ఇంతకీ ఎవరి పని?





ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ దేబోస్మితా పాల్ హత్య కలకలం రేపుతోంది. మృతురాలి తలపై బరువైన వస్తువుతో దాడి చేసిన ఆనవాళ్లతో పాటు చేతి మణికట్టు కూడా కోసి ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. శివాజీ కాలేజీ ఇంగ్లీష్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న దేబోస్మితా పాల్ హత్య ప్రస్తుతం వార్తల్లో ప్రముఖంగా వినిపిస్తోంది. ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి వసుంధర ఎన్‌క్లేవ్‌లోని సత్యమ్ అపార్ట్‌మెంట్‌లో ప్రొఫెసర్ మృతదేహం లభ్యమైంది. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తు జరుగుతోంది.

న్యూ అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వసుంధర ఎన్‌క్లేవ్‌లో గల సత్యమ్ అపార్ట్‌మెంట్‌లో ఈ దారుణం జరిగింది. శివాజీ కాలేజీ ఇంగ్లీష్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న దేబోస్మితా పాల్ రెండు రోజులుగా కాలేజీకి రాకపోవడం, ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆమె వ్యక్తిగత డ్రైవర్‌కు అనుమానం వచ్చింది. అతడు వెంటనే ప్రొఫెసర్ సోదరి దేవరతి పాల్‌కు సమాచారం అందించాడు. సోదరి అపార్ట్‌మెంట్‌కు వచ్చి చూడగా బయట నుంచి తాళం వేసి ఉంది. లోపలికి వెళ్లి చూడగా డ్రాయింగ్ రూమ్‌లో దేబోస్మితా విగతజీవిగా పడి ఉంది. ఆమె తలపై బరువైన వస్తువుతో బలంగా బాదిన గాయాలతో పాటు, చేతి మణికట్టు కూడా కత్తితో కోసి ఉండడం తీవ్ర సంచలనం రేపింది. ఫ్లాట్ బయట పడి ఉన్న పాత న్యూస్ పేపర్ల ఆధారంగా ఈ హత్య గురువారాని కంటే ముందే జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

పశ్చిమ బెంగాల్‌కు చెందిన దేబోస్మితా.. భర్తతో విభేదాల కారణంగా ఢిల్లీలోని ఈ ఫ్లాట్‌లో ఒంటరిగా నివసిస్తున్నారు. ఆమె భర్త బెంగళూరులో ఉంటున్నారు. అయితే, ఈ హత్య కేసులో పోలీసుల ప్రాథమిక దర్యాప్తు సంచలన విషయాలను బయటపెట్టింది. ఇంట్లోకి బలవంతంగా చొరబడిన ఆనవాళ్లు లేవు, అలాగే నగదు కానీ, విలువైన వస్తువులు కానీ చోరీకి గురికాలేదు. ఇల్లు చాలా నీట్‌గా, సామగ్రి యథాతథంగా ఉంది. దీన్ని బట్టి హంతకుడు మృతురాలికి బాగా పరిచయమున్న వ్యక్తే అయి ఉంటాడని పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. ఆమె స్వయంగా తలుపు తీసి లోపలికి రానిచ్చిన తర్వాతే ఇద్దరి మధ్య గొడవ జరిగి ఈ హత్యకు దారితీసి ఉండవచ్చని భావిస్తున్నారు. హంతకుడు దారుణానికి ఒడిగట్టిన తర్వాత క్లూస్ దొరకకుండా బయట నుంచి తాళం వేసి పారిపోయాడు. ప్రస్తుతం పోలీసులు అపార్ట్‌మెంట్ సీసీటీవీ ఫుటేజీలను, దేబోస్మితా ఫోన్ కాల్ డేటాను, అలాగే ఇటీవల ఇంటికి వచ్చిన డెలివరీ బాయ్స్ వివరాలను జల్లెడ పడుతున్నారు.

Also read

Related posts