SGSTV NEWS online
CrimeNational

Delhi Blast: కారు ఓనర్ పుల్వామా నివాసి.. ఢిల్లీ పేలుడు కేసులో సంచలన విషయాలు..



కారు పేలుడు వెనుక కథేంటి ? పేలుడు పదార్థాలున్న కారులో ప్రయాణం ప్రమాదమని తెలీదా ? అంతా తెలిసే ఉన్మాదానికి ఒడిగట్టారా ? ఇంతకీ కారులోని వ్యక్తులు ప్రయాణికులా ? ఆత్మాహుతి దళమా ? అన్నది మిస్టరీగా మారింది. ఈ క్రమంలో కారు ఓనర్ పుల్వామా నివాసిగా పోలీసులు గుర్తించారు.


ఢిల్లీ కారు పేలుడు యావత్‌ దేశాన్ని వణికించింది. అంతటి దారుణానికి ఒడిగట్టిన ఉన్మాదుల ప్లాన్‌ మరోలా ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలంలోని పరిణామాలను పరిశీలిస్తే అనేక అనుమానాలు కలుగుతున్నాయి. బాంబుపెట్టిన కారులో ప్రయాణికులు ఎందుకున్నారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కారులో బాంబు ఉందనే విషయం వారికి తెలుసా ? లేదా ? కారులో మరెవరన్నా బాంబును అమర్చి ఉంటారా ? అన్నది మిస్టరీగా మారింది. కారులో ఉన్నవారు పేలుడు పదార్థాలు తీసుకెళ్తున్నారా ? బాంబు అనుకున్న సమయంకంటే ముందే పేలిందా ? పేలుళ్ల కుట్రదారుల అసలు టార్గెట్‌ వేరే ఉందా ? కారులో ఉన్నవారికి దిగిపోయే అవకాశం దొరకలేదా ? అన్నది తేలాల్సి ఉంది.

పేలుడుకు ముందు ఎర్రకోట సమీపంలోని పార్కింగ్ స్థలంలో కారును మూడు గంటల పాటు నిలిపి ఉంచారు. కారు మధ్యాహ్నం 3 గంటల 19 నిమిషాలకు పార్కింగ్ స్థలంలోకి ప్రవేశించింది. సాయంత్రం 6 గంటల 48 నిమిషాలకు పార్కింగ్ స్థలం నుంచి బయల్దేరింది. ఆ తర్వాత కొద్దిసేపటికే పేలుడు సంభవించింది. భారీ పేలుడుతో ఘటనా స్థలంలో భీతావహ వాతావరణం నెలకొంది. ఈ ప్రమాదంలో 9 మంది మరణించారు. మరికొంత మందికి తీవ్రగాయాలయ్యాయి. పేలుడు ధాటికి చుట్టుపక్కల ఉన్న పలు కార్లు, బైక్‌లు ధ్వంసమయ్యాయి. కారులో ఉంచిన పేలుడు పదార్థాలను దూరం నుంచి ఎవరైనా రిమోట్‌ కంట్రోల్‌ సాయంతో పేల్చి ఉంటారా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీలోని టూరిస్ట్ స్పాట్లకు, మార్కెట్లకు ప్రతి సోమవారం సెలవు రోజు. సోమవారం మినహా మిగతా ఆరు రోజుల్లో చాందినీ చౌక్ ప్రాంతం అత్యంత రద్దీగా ఉంటుంది. సోమవారం సెలవు కావడంతో ప్రమాద తీవ్రత తక్కువగా ఉందని స్థానికులు చెబుతున్నారు.

కారు ఓనర్ పుల్వామా నివాసి..
సోమవారం సాయంత్రం ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 సమీపంలో పేలిన హ్యుందాయ్ i20 కారు జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా నివాసి తారిక్‌కు సల్మాన్ కు చెందినదని పోలీసులు గుర్తించారు. చివరికి విక్రయించిన ఈ కారు, సెప్టెంబర్ 20, 2025న ఫరీదాబాద్‌లో రాంగ్ పార్కింగ్ చేసినందుకు గతంలో చలాన్ విధించినట్లు పేర్కొంటున్నారు.. వాహనం రిజిస్ట్రేషన్ (RC) ఇప్పటికీ సల్మాన్ పేరు మీద ఉందని.. దీన్ని అధికారికంగా బదిలీ చేయలేదని తెలిపారు. అయితే.. i20 కారు అనేకసార్లు చేతులు మారిందని, దర్యాప్తు అధికారులు యాజమాన్య గొలుసును పరిశీలిస్తున్నారని వర్గాలు తెలిపాయి. వాహనం కొనుగోలు – అమ్మకంలో మోసపూరిత పత్రాలు ఉన్నట్లు సమాచారం.. అసలు యజమాని గుర్తింపు అస్పష్టంగానే ఉంది. పుల్వామా లింక్ దర్యాప్తుకు కొత్త కోణాన్ని జోడించింది.

ఇంతలో, ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, NSG, NIA, FSL బృందాలు వాహన శిథిలాలు, CCTV ఫుటేజ్, ఇతర ఫోరెన్సిక్ ఆధారాలను పరిశీలిస్తున్నాయి. పేలుడులో మేకులు, బాల్ బేరింగ్లు లేదా వైర్లు వంటి ష్రాప్నెల్ పదార్థాలు లేవని ముందస్తు పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇది సాధారణ IED కాకపోవచ్చునని సూచిస్తుంది. ఖచ్చితమైన కారణాన్ని గుర్తించడానికి నిపుణులు నైట్రేట్లు లేదా TNT వంటి పేలుడు పదార్థాల జాడలను పరీక్షిస్తున్నారు.

Also read

Related posts