విశాఖపట్నంలో 2022లో సంచలనం రేపిన పైడిరాజు హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా పరారైన భార్య జ్యోతి, ఆమె ప్రియుడు రాజును భీమిలి పోలీసులు అండమాన్ నికోబార్ దీవుల్లో అరెస్టు చేశారు. పేర్లు మార్చుకుని, నకిలీ ఆధార్ కార్డులతో స్వరాజ్ ద్వీపంలో ఉంటున్న నిందితులను టెక్నికల్ ఆధారాలు, హ్యూమన్ ఇంటెలిజెన్స్ సాయంతో గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.
భర్తను హత్య చేసి.. మృతదేహాన్ని కాల్చి.. బూడిదను సముద్రంలో కలిపేసిన కేసు..! అప్పట్లో విశాఖలో సంచలనం రేపిన పైడిరాజు హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. భర్త హత్య కేసులో నిందితురాలిగా ఉన్న భార్య జ్యోతి.. తన ప్రియుడు రాజుతో కలిసి అండమాన్ నికోబార్ దీవుల్లో తలదాచుకుంది. పేర్లు మార్చుకుంది.. నకిలీ ఆధార్ కార్డులతో కొత్త జీవితం ప్రారంభించింది. కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్న ఇద్దరినీ భీమిలి పోలీసులు అండమాన్‌లో అరెస్టు చేశారు. ఇంతకీ.. నాలుగేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న నిందితులను పోలీసులు ఎలా పట్టుకున్నారు..?
విశాఖపట్నం భీమిలి ప్రాంతంలో 2022 డిసెంబర్లో దారుణ హత్యకు గురైన పైడిరాజు కేసు మరోసారి తెరపైకి వచ్చింది. భర్తకు మత్తుమందు ఇచ్చి.. హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని కాల్చి.. బూడిదను సముద్రంలో పడేశారు భార్య, ఆమె ప్రియుడు. ఈ కేసులో పైడిరాజు భార్య జ్యోతి, ఆమె ప్రియుడు రాజు సహా ముగ్గురిని భీమిలి పోలీసులు అరెస్టు చేశారు. కొంతకాలం రిమాండ్‌లో ఉన్న నిందితులు.. ఆ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చారు. బెయిల్ వచ్చిందే ఆలస్యం అన్నట్టుగా జ్యోతి, ప్రియుడు రాజు మరింత రెచ్చిపోయారు. కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. దీంతో.. నిందితులపై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అయితే.. పోలీసుల దర్యాప్తులో నిందితులు పరారైనట్టు తేలడం షాకిచ్చింది.
పైడిరాజు మర్డర్ కేసు నిందితుల పరారీ వ్యవహారం విశాఖ పోలీసులకు మరోసారి సవాల్ విసిరింది. ఈ కేసును చాలెంజ్‌గా తీసుకుని దర్యాప్తు చేయడంతో కీలక సమాచారం లభించింది. టెక్నికల్ ఆధారాలతో జ్యోతి, ఆమె ప్రియుడు రాజు అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నట్టు గుర్తించి అక్కడికి వెళ్లి అరెస్ట్ చేశారు. పోర్ట్ బ్లెయిర్ కోర్టులో హాజరుపరిచి.. ట్రాన్సిట్ రిమాండ్‌పై విశాఖకు తీసుకొచ్చారు. ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బెయిల్ బయటకు వచ్చిన జ్యోతి, రాజు విశాఖ నుంచి చెన్నై వెళ్లారు. అక్కడి నుంచి బోటులో అండమాన్ నికోబార్ దీవులకు జంప్ అయినట్టు విశాఖ పోలీసులు ఆధారాలు సేకరించారు. అండమాన్ దీవుల్లోని స్వరాజ్ ద్వీపంలో పేర్లు మార్చుకుని నకిలీ ఆధార్ కార్డులతో మకాం వేసినట్టు తేల్చారు. అయితే.. నిందితులు ఫోన్లు వాడకుండా తెలివిగా వ్యవహరించినప్పటికీ.. హ్యూమన్ ఇంటెలిజెన్స్‌తో దొరికిపోయారని విశాఖ డీసీపీ మణికంఠ వెల్లడించారు.
మొత్తంగా.. కొన్నేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న నిందితులు ఎట్టకేలకు విశాఖ పోలీసులకు చిక్కారు. నేరం చేసిన తర్వాత ఎంత దూరం వెళ్లినా.. ఎన్ని పేర్లు మార్చుకున్నా.. చట్టం నుంచి తప్పించుకోవడం అంత ఈజీ కాదని ఈ కేసుతో మరోసారి రుజువు అయింది.
Also read
- నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం వెలిగించాలా? సరైన పద్ధతి ఇదే!
- Durga Puja: దుర్గాదేవి బొట్టు కింద చిన్న సాలీడు.. దాని వెనుక ఉన్న రహస్యం తెలుసా?
- సైన్స్ కు సైతం అంతుచిక్కని పవర్ ఫుల్ శక్తిపీఠాలు.. !!
- Astrology: శుక్ర మూఢమిలోనూ వీరికి శుభాలు! అదృష్టం పట్టే రాశులివే..!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?





