అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి కథ తెల్చే పనికి వేళయింది. కల్తీ నెయ్యి కేసు నిజాలు తేల్చే పనిలో ఉన్న సిట్ ఫైనల్ చార్జ్ షీట్ దాఖలు చేయబోతోంది. ఇప్పటికే 29 మంది నిందితులను కేసులో చేర్చి పలువురిని విచారించిన సిట్ 9 మందిని అరెస్టు చేసింది. మరికొద్ది మందిని నిందితులుగా చేర్చేందుకు మెమోలు దాఖలు చేసింది. అంతేకాకుండా.. గత ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్ గా, ఈఓలుగా పనిచేసిన వారిని విచారించింది. డెయిరీ యాజమాన్యాలను, నిందితులను జైలుకు పంపింది. ఇప్పుడు టిటిడి అధికారుల అరెస్టులకు సిద్ధం కావడం.. ఇన్వెస్టిగేషన్ స్పీడ్ అవ్వడంతో.. ఉద్యోగుల్లో భయాందోళనలకు కారణం అయ్యింది. నెక్స్ట్ ఎవరంటూ తీవ్ర చర్చ జరుగుతోంది.
రిమాండ్ రిపోర్టులో సంచలన నిజాలు..
దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి కేసు విచారణ తుది దశకు చేరుకుంది. NDDB కాఫ్ నివేదిక ఆధారంగా నెయ్యిలో కల్తీని గుర్తించిన టిటిడి శ్రీవారి భక్తులకు అత్యంత ప్రీతి పాత్రమైన లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారన్న అభియోగాలు, ఆరోపణల్లో నిజాలు నిగ్గు తేల్చే పనిలో ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తోంది. సీబీఐ నేతృత్వంలోని 5 మంది సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందం డిసెంబర్ 15 లోపు ఫైనల్ చార్జ్ షీట్ దాఖలు చేయాలని నిర్ణయించింది. సిట్‌లో సీబీఐ తరపున మురళి రాంబా కీలకంగా వ్యవహరిస్తుండగా సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సిట్ పని పూర్తి చేస్తోంది. క్షేత్రస్థాయిలో దర్యాప్తు పూర్తి చేసిన సిట్ అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ కేంద్రంగా ఏడాదిగా విచారణ చేస్తోంది.
ఇందులో భాగంగానే కల్తీ నెయ్యి కేసు దర్యాప్తు తుది దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే టీటీడీ ఉద్యోగుల్లో కల్తీ నెయ్యి కేసు భయం నెలకొంది. కేసులో A29 గా టీటీడీ ప్రోక్యూర్మెంట్ జిఎం గా పనిచేసిన సుబ్రహ్మణ్యం అరెస్ట్ కావడంతో ఫియర్ పిక్స్ కు చేరుకుంది. ఇప్పటికే నిందితులుగా ఉన్న ఉద్యోగులను కూడా అరెస్టు చేసే అవకాశం ఉందని బావిస్తున్న పరిస్థితి వెంటాడుతోంది. అంతేకాకుండా.. పలువురిని విచారించే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం..
సుబ్రహ్మణ్యం రిమాండ్ రిపోర్టులో కల్తీ నెయ్యి సరఫరాపై సంచలన విషయాలు బయటపడ్డాయి. కల్తీ నెయ్యిని స్వచ్ఛమైన ఆవు నెయ్యిగా టీటీడీకి సరఫరా జరిగేలా సహకరించింది సుబ్రహ్మణ్యమే నని సిట్ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. బోలే బాబా డయిరీ నుంచి రూ. లక్షల్లో లంచం, విలువైన కానుకలు సుబ్రహ్మణ్యం అందుకున్నట్లు సిట్ నిర్ధారణకొచ్చింది.
బోలే బాబా, వైష్ణవి డయిరీలను తనిఖీ చేయడానికి వెళ్లిన అధికారులు విలువైన వస్తువులు, నగదు పొందినట్లు రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేసింది. కేసులో A24 గా ఉన్న చిన్నఅప్పన్న కు సహకరించి నెయ్యి సప్లై చేసిన కంపెనీలతో సుబ్రహ్మణ్యంతో పాటు మరికొందరు లాలూచీ పడినట్లు సిట్ గుర్తించింది. మైసూర్ ల్యాబ్ రిపోర్టును దాచి బోలే బాబా డయిరీ కి రెండు దఫాల్లో దాదాపు 1.20 లక్షల కిలోల దాకా నెయ్యి సరఫరాకు ఆర్డర్ల ను ఇవ్వడంలో సుబ్రహ్మణ్యం కీలకపాత్ర పోషించినట్లు సిట్ తెలిపింది. నెయ్యి సరఫరాకు సాంకేతికంగా అర్హత పొందిన సంస్థలకు లబ్ది చేకూర్చేలా టెండర్ల ప్రక్రియను నిర్వహించేలా అప్పటి టిటిడి ప్రొక్యూర్మెంట్ జిఎం సుబ్రహ్మణ్యం ప్రయత్నించినట్లు సిట్ పేర్కొంది.
మరింత మంది పాత్రపై కోర్టులో మెమో..
మరోవైపు కల్తీ నెయ్యి కేసు దర్యాప్తును ముగించే దశలో ఉన్న సిట్ టిటిడి మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని హైదరాబాదులో, టీటీడీ మాజీ ఈఓ ధర్మారెడ్డిని తిరుపతిలో రెండు రోజులు పాటు విచారించింది. ఇలా కల్తీ నెయ్యి సరఫరా కేసులో అప్పటి పాలకమండలిని, అధికారులను, నెయ్యి సరఫరా చేసిన సంస్థల ప్రతినిధులను, సహకరించిన వారిని విచారించింది. అయితే టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో ఉద్యోగుల పాత్ర కూడా కీలకమని సిట్ విచారణలో తేరడంతో ఇప్పుడు కొందరు ఉద్యోగుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఈ నేపథ్యంలోనే A24 నుంచి A36 వరకు మరో 12 మంది నిందితులను కేసులో చేర్చేందుకు సిట్ సిద్ధమైంది. ఈ మేరకు నెల్లూరు కోర్టులో మెమో దాఖలు చేసింది.
నిందితుల్లో 7 మంది టిటిడి ఉద్యోగులు తోపాటు 5మంది డయిరీ లకు చెందిన వారుగా పేర్కొన్న సిట్ అధికారులు.. 2019 నుంచి టిటిడి ప్రొక్యూర్మెంట్ జనరల్ మేనేజర్ లుగా, వేర్ హౌసింగ్, గోశాల డయిరీ ఉద్యోగులు గా పనిచేసిన వారిని నిందితులుగా తేల్చింది. డెయిరీ శాంపిల్స్ సేకరించి నిపుణుల నివేదిక ఇవ్వాలని 2022 మే నెలలో అప్పటి టిటిడి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదేశించగా ఇదే అదునుగా అక్రమాలు జరిగినట్లు సిట్ భావిస్తోంది.. 2018 నుంచి 2024 వరకు నెయ్యి సరఫరా చేసిన డయిరీ ప్లాంట్ సందర్శించిన నిపుణులు కమిటీ నివేదికను, ల్యాబ్ రిపోర్టులను పక్కన పెట్టి ఇదే అవకాశంగా చేసుకుని కొందరు డయిరీ యాజమాన్యాల నుంచి ముడుపులు, కానుకలను పొందినట్లు సిట్ తేల్చింది. ఇలా కక్కుర్తి పడ్డ వారిలో నిపుణులు, టిటిడి ప్రొక్యూర్మెంట్ జీఏంలు, కొందరు ఉద్యోగులు ఉన్నట్లు సిట్ ఛార్జ్ షీట్ కూడా వేయబోతుండటం సంచలనంగా మారింది.
Also Read
- నెల్లూరులో రౌడీ షీటర్లకు వెరైటీ పనిష్మెంట్.. అలా ఉంటది ఖాకీల తో పెట్టుకుంటే
- Viral News: చెప్తే అర్థం చేసుకుంటారనుకుంది.. తల్లిదండ్రులు మోసాన్ని తట్టుకోలేకపోయింది.. చివరకు..
- Andhra Pradesh: ఛీ.. ఏం మనుషులురా.. కూతురిని కూడా వదలని తండ్రి.. నెలల పాటు దారుణంగా..
- Telangana: ప్రేమన్నాడు.. వల వేసి కోరిక తీర్చుకున్నాడు.. ఆపై వెలుగులోకి అసలు ట్విస్ట్
- Guntur: ఉలిక్కిపడ్డ గుంటూరు.! పట్టపగలు ముగ్గురు మైనర్లు చేసిన పని తెలిస్తే గుండె ఆగినంత పనవుతుంది





