పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలో గురువుపై శిష్యుడు చేసిన ఘాతుకం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. క్రమశిక్షణ నేర్పినందుకే కక్ష పెంచుకున్న ఓ పూర్వ విద్యార్థి, కన్న తండ్రిలాంటి గురువుపై ప్రాణాంతక దాడికి ఒడిగట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పాలకొల్లు మండలం లంకలకోడేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కుక్కల వెంకట రాజసురేష్ ఉపాధ్యాయుడిగా (PET) విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం (ఏప్రిల్ 21) రాత్రి ఆయన ప్రభుత్వ ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమంలో పాల్గొని, పని ముగించుకుని తన నివాసానికి బయలుదేరారు. భోగ్గేశ్వరం మురుగు కాలువ వంతెన వద్దకు చేరుకోగానే, అక్కడ అప్పటికే మాటు వేసి ఉన్న ఓ పూర్వ విద్యార్థి అకస్మాత్తుగా సురేష్‌పై దాడికి దిగాడు.
నిందితుడు తన వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్డుతో ఉపాధ్యాయుడి తలపై బలంగా బాదాడు. తీవ్ర రక్తస్రావంతో సురేష్ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే స్పందించి నిందితుడిని అడ్డుకుని, రాడ్డును లాక్కున్నారు. అయినప్పటికీ కసి తీరని ఆ విద్యార్థి, రోడ్డు పక్కన ఉన్న కంకర రాళ్లను తీసుకుని గాయపడిన ఉపాధ్యాయుడిపై విసిరి కొట్టాడు. స్థానికులు అతడిని గట్టిగా పట్టుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. తీవ్రంగా గాయపడిన ఉపాధ్యాయుడిని మొదట పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి, ఆపై పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం నర్సాపురంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నిందితుడు ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. రెండేళ్ల క్రితం లంకలకోడేరు పాఠశాలలో పదో తరగతి చదువుతున్న సమయంలో, అతడి అసభ్య ప్రవర్తనను రాజసురేష్ మందలించారు. విద్యార్థిని సరైన దారిలో పెట్టాలని గురువు చేసిన హెచ్చరికను ఆ కుర్రాడు అవమానంగా భావించాడు. అప్పటి నుండి గురువుపై కక్ష పెంచుకుని, సమయం కోసం వేచి చూసి ఈ దారుణానికి పాల్పడ్డాడు. కాగా, విద్యాబుద్ధులు నేర్పే గురువును దైవంతో సమానంగా చూసే మన సంస్కృతిలో, కేవలం మందలించారనే సాకుతో దాడికి పాల్పడటం విద్యా వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. విద్యార్థుల్లో పెరుగుతున్న అసహనం, విచక్షణారహిత ప్రవర్తనపై ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Also read
- మరణానంతరం ఆత్మ 13 రోజులు కుటుంబంతోనే ఉంటుందా? గరుడ పురాణం చెప్పే నిజం ఏమిటి?
- Weekly Horoscope: ఆ రాశుల వారికి ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యలకు చెక్..!
- లక్షకు రూ.30 వేల వడ్డీ.. రూ.25 కోట్లు వసూల్.. ఈ కిలాడి జంట చేసిన పని తెలిస్తే నోరెళ్లబెడతారు..
- ఐపీఎల్ క్రేజ్‌ను క్యాష్ చేసుకున్న కిలాడీలు.. అసలు వీరు వాడిన టెక్నిక్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
- హైవేపై రోడ్డు ప్రమాదం.. ఆ పక్కనే కనిపించిన సూసైడ్ నోట్.. ఓపెన్ చేయగా..





