SGSTV NEWS online
Andhra PradeshCrime

స్కూల్ బస్సు బోల్తా.. రెప్పపాటులో చిన్నారులకు తప్పిన పెను ప్రమాదం..!


ఎన్టీఆర్ జిల్లాలో శుక్రవారం (అక్టోబర్ 30) ఉదయం స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. జి.కొండూరు మండలం పినపాక రోడ్డులో విద్యార్థులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. ఈ ఘటనతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో కలకలం రేగింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 16 మంది విద్యార్థులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.


అప్రమత్తమైన గ్రామస్తులు.. పిల్లలకు రక్షణ!

బస్సు బోల్తా పడటాన్ని గమనించిన స్థానిక గ్రామస్తులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా బస్సులో చిక్కుకున్న విద్యార్థులను బయటకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. మిగిలిన విద్యార్థులంతా సురక్షితంగా బయటపడటంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది.


ఆసుపత్రికి క్షతగాత్రుల తరలింపు

గాయపడిన డ్రైవర్, ఇద్దరు విద్యార్థులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థులు చెవుటూరు, ఆత్కూరు గ్రామాలకు చెందినవారని తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరించారు.

16 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్న స్కూల్ బస్సు బోల్తా పడటంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే విద్యార్థులంతా ప్రాణాలతో బయటపడటంతో కుటుంబ సభ్యులు, పాఠశాల యాజమాన్యం ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

Also read

Related posts