SGSTV NEWS
Andhra PradeshCrime

Vijayawada Murder Case: విజయవాడలో దారుణం.. ఇంటి ఓనర్ని చంపి పరారైన పని మనిషి!

విజయవాడ, జులై 11: విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో పని మనిషిగా పని చేస్తున్న ఓ మహిళ అదే ఇంటి యజమానిని చంపి.. ఇంట్లోని విలువైన నగలు, నగదు, బంగారం మూటగట్టి పరారైంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

విజయవాడలోని మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ కాలనీలో బొద్దులూరి వెంకట రామారావు(70) తన తల్లి సరస్వతితో కలిసి నివాసం ఉంటున్నాడు. రామారావు రిటైర్డ్ R & B ఇంజనీర్. వృద్ధురాలైన తల్లిని చూసుకునేందుకు మూడు రోజుల క్రితం అనూష అనే ఓ పని మనిషిని పెట్టుకున్నారు. అయితే ఆమె ఫుల్ టైం వర్కర్‌గా ఉండేందుకు వారితో పాటు అదే ఇంట్లో నివాసం ఉంటోంది. ఏం జరిగిందో తెలియదుగానీ శుక్రవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో రామారావు గదిలో లైట్లు వెలగడంతో తల్లి సరస్వతి గమనించింది. వెంటనే వచ్చి చూడగా మంచంపై కుమారుడు అపస్మారక స్థితిలో పడి కనిపించాడు. రామారావుపై, అతడు పడిఉన్న మంచంపై కారం చల్లి ఉంది.

అదే గదిలో ఉన్న బీరువా పగులగొట్టి ఉంది. బట్టలు, వస్తువులు అన్నీ గదంతా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మరోవైపు ఇంటి పనిమనిషి అనుషా కూడా కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చిన సరస్వతి పక్క ఫ్లాట్ వాళ్లను పిలిచి సమాచారం అందించింది. వారు పోలీసులకు సమాచారం అందించడంతో మాచవరం పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. అప్పటికే రామారావు మృతి చెందినట్లు గమనించారు. రామారావు నిద్రలో ఉండగా దిండుతో ఊపిరాడకుండా చేసి, కారం చల్లినట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే మృతదేమాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేర్ టేకర్ అనూషా హత్య చేసినట్లు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న పని మనిషి అనూషను తెల్లవారుజామున 6 గంటల సమయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యలో అనూషతోపాటు మరెవరి ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

Also read

Related posts

Share this