SGSTV NEWS online
Andhra PradeshCrime

పగలు డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న కుర్రాడు.. రాత్రయితే అంతా కచోరీ వ్యవహారం!




పైకి చూస్తే చేతిలో పార్శిళ్లతో అమాయకంగా కనిపించే డెలివరీ బాయ్.. కానీ కట్ చేస్తే రాత్రి వేళల్లో ఇళ్ల తాళాలు పగలగొట్టి బంగారం దోచుకునే గజదొంగ! పగటిపూట ఇళ్లను రెక్కీ చేస్తూ, రాత్రిళ్లు చోరీలకు పాల్పడుతున్న ఒక కిలాడీ డెలివరీ బాయ్‌ను జిల్లా పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఈ ముఠాతో సంబంధం ఉన్న ఒక బంగారు వ్యాపారిని కూడా పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం రొంపిల్లి గ్రామానికి చెందిన పువ్వల మణికంఠ ఒక ప్రముఖ ప్రైవేట్ ఆన్‌లైన్ డెలివరీ సంస్థలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. విధుల్లో భాగంగా అతడు బొబ్బిలి, బాడంగి, సీతానగరం మండలాల్లోని వివిధ గ్రామాలకు తిరుగుతూ కస్టమర్లకు వస్తువులను డెలివరీ చేసేవాడు. ఈ క్రమంలోనే అతడి కన్ను గ్రామాల్లోని ఇళ్లపై పడింది.

గ్రామస్థులు ఉదయం పూట వ్యవసాయ పనులకు, ఉపాధి హామీ పనులకు లేదా ఉద్యోగాలకు వెళ్లే సమయాలను అతడు నిశితంగా గమనించేవాడు. ఏయే ఇళ్లకు తాళాలు వేసి ఉంటున్నాయి, ఎవరెవరు ఏ సమయంలో ఇళ్లలో ఉండటం లేదు అనే విషయాలపై పక్కాగా స్కెచ్ వేసుకునేవాడు. 2023 నుంచి ఈ దారుణాలకు తెరలేపిన మణికంఠ.. తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తూ వరుస చోరీలకు పాల్పడటం మొదలుపెట్టాడు.


ఇటీవల మెట్టవలస బస్టాప్ వద్ద మణికంఠ అనుమానాస్పదంగా సంచరిస్తుండటాన్ని పోలీసులు గమనించారు. అతడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు దొంగతనాల గుట్టు రద్దయింది. తాను దొంగిలించిన బంగారు ఆభరణాలను సాలూరుకు చెందిన బంగారు వ్యాపారి బాలేశ్వరరావుకు విక్రయిస్తున్నట్లు మణికంఠ అంగీకరించాడు. ఈ దొంగతనాల ద్వారా వచ్చిన డబ్బును మణికంఠ విలాసాలకు, జల్సాలకు, చెడు వ్యసనాలకు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నట్లు విచారణలో తేలింది.

పోలీసులు వీరిద్దరినీ అరెస్టు చేసి, వారి వద్ద నుంచి సుమారు 20 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన నేపథ్యంలో జిల్లా పోలీసులు ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు. గ్రామాల్లో లేదా కాలనీల్లో కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తే వెంటనే అప్రమత్తం కావాలన్నారు. ఇళ్లను ఖాళీగా వదిలి వెళ్లే సమయంలో తగిన భద్రతా చర్యలు నమ్మకస్థులకు చెప్పడం లేదా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఆన్‌లైన్ ఆర్డర్ల కోసం వచ్చే డెలివరీ బాయ్స్ ప్రవర్తనలో ఏమాత్రం తేడా ఉన్నా, అనుమానం వచ్చినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు

Also read

Related posts