SGSTV NEWS online
Andhra PradeshCrime

అనంతపురంలో జరిగింది ఇది.. తెలుసుకోకుంటే మీకే చాలా నష్టం..



అనంతపురంలో నిలువు దోపిడీకి పాల్పడుతున్న ఓ ముఠా అపరిచిత వ్యక్తులతో కూడిన కొత్త మోసాలను వెలుగులోకి తెచ్చింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న తక్కిళ్లపాటి ఆదిలక్ష్మి అనే మహిళను బస్టాండ్ సమీపంలో ఇద్దరు వ్యక్తులు అడ్డుకున్నారు. అందులో ఒక వ్యక్తి అడ్రస్ అడగగా, మరో వ్యక్తి 500 రూపాయల నోటు ఇచ్చి ఆమెను పట్టుకోమని కోరాడు.

అపరిచితుల పట్ల ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా వారు ఇచ్చే ఏ వస్తువులను ముట్టుకోవద్దని తాజా ఘటనలు హెచ్చరిస్తున్నాయి. ఒకప్పుడు తినే పదార్థాల్లో మత్తు మందు కలిపి మోసాలకు పాల్పడిన కేటుగాళ్లు, ఇప్పుడు తమ పంథాను మార్చుకున్నారు. కరెన్సీ నోట్లను ఉపయోగించి మహిళలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ తరహా మోసాలు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. అనంతపురంలో రామచంద్ర నగర్‌కు చెందిన తక్కిళ్లపాటి ఆదిలక్ష్మి అనే మహిళ ఈ మోసానికి బలయ్యారు. పనిమీద నగరంలో తిరుగుతున్న ఆమెను దొంగల ముఠా గమనించింది. బస్టాండు సమీపంలో ఆమెను ఇద్దరు వ్యక్తులు అడ్డుకున్నారు. వారిలో ఒకరు హిందీలో అడ్రస్ అడగ్గా, ఆమెకు తెలియదని బదులిచ్చింది. ఇంతలో మరో వ్యక్తి వచ్చి 500 రూపాయల నోటు తీసి ఆమెకిచ్చాడు. ఆమె ఆ నోటును పట్టుకుని తిరిగి వారికే ఇచ్చేసింది. కొద్ది దూరం నడిచిన తర్వాత, ఆమె ముక్కు దగ్గర చేయి పెట్టుకోగానే స్పృహతప్పి పడిపోయింది. మోసగాళ్లు, ఆమెకు సపర్యలు చేస్తున్నట్లు నటించి, ఆమె ఒంటిపై ఉన్న బంగారు గొలుసు, చెవి కమ్మలు, ఉంగరాన్ని దోచుకుని పారిపోయారు. మత్తు దిగిన తర్వాత చూసుకుంటే తన నగలు లేవని ఆదిలక్ష్మి గుర్తించారు. బాధితురాలి కుటుంబ సభ్యులు ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

తమ తల్లి ప్రాణాలతో బయటపడటం సంతోషంగా ఉందని, అయితే పోయిన బంగారాన్ని పోలీసులు రికవరీ చేసి ఇస్తారని నమ్ముతున్నామని బాధితురాలి కుమార్తె తెలిపారు. నార్పలలో కూడా ఇలాంటి ఘటనే జరిగిందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వారు కోరారు. ఆదిలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. సీసీ ఫుటేజ్‌లలో ఇద్దరు, ముగ్గురు యువకులు ఆమెను సమీపించి, మాట్లాడి, ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తీసుకెళ్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుందని పోలీసులు వెల్లడించారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని హామీ ఇచ్చారు. అనంతపురంలో మరోచోట కూడా ఇలాంటి ఘటనే జరగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అపరిచితులు ఇచ్చే వస్తువులను ముట్టుకోవడం, తాగడం, తినడం వంటి వాటికి దూరంగా ఉండాలని అధికారులు పదేపదే హెచ్చరిస్తున్నారు.

Also read

Related posts