July 1, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

మాజీ ఎమ్మెల్యే ఇంట్లోకి ఆగంతకుడు.. స్ప్రే చల్లి కత్తితో బెదిరింపు.. తీరా చూస్తే!

విశాఖపట్నంలో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత తైనాల విజయ్ కుమార్ ఇంట్లో దోపిడీ కేసు తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ప్రత్యేక బృందాలుగా ఏర్పడ్డ పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. దోపిడీ చేసిన సమయంలో తెలుగులోనే నిందితుడు మాట్లాడినట్టు గుర్తించారు. సిసి ఫుటేజ్ ఆధారంగా ప్రత్యేక బృందాలుగా నిందితుడు కోసం గాలిస్తున్నారు.

విశాఖలో దొంగలు రెచ్చిపోతున్నారు. శివార్లలో వరుస ఘటనలపై పోలీసులు దర్యాప్తు చేస్తుండగానే, సిటీ నడిబొడ్డున మాజీ ఎమ్మెల్యే ఇంట్లో దోపిడీ చేశాడు దుండగుడు. వైసీపీ నాయకుడు తైనాల విజయ్ కుమార్ ఇంట్లోకి వెళ్లి అతని భార్యను బెదిరించి భయపెట్టి బంగారాన్ని ఎత్తుకెళ్లాడు. టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే ఈ ఘటన జరగడం కలకలం సృష్టిస్తోంది.

డాబా గార్డెన్స్ లలిత కాలనీలో మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకుడు తైనాల విజయకుమార్ నివసిస్తున్నారు. ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎస్.కోటలో ఉన్నారు. ఇంట్లో అతని భార్య లక్ష్మీరాజ్యం ఒంటరిగా ఉన్నారు. సుమారు సాయంత్రం 7.30 నుంచి 7.52 గంటల మధ్య లక్ష్మీరాజ్యం వంటగదిలో ఉన్నారు. ఈ సమయంలో ఒక ఆగంతకుడు వెనకనుంచి ఇంట్లోకి చొరబడ్డాడు. ఆమెపై స్ప్రే జల్లి, కత్తి పెట్టి బెదిరించి మెడలో ఉన్న పుస్టెల తాడును లాక్కెళ్లిపోయాడు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న కబోర్డ్ ఓపెన్ చేయమని, ఆమెను బాత్రూంలో పెట్టి బంధించాడు. అరిస్తే చంపేస్తానని బెదిరించాడు. ఆ తర్వాత బెడ్ రూమ్ లోనే ఉన్న లాకర్లో బంగారాన్ని మూట కట్టుకొని వెళ్లిపోయాడు.

ఘటన జరిగిన సమయంలో తైనాల విజయ్ కుమార్ ఇంట్లో భార్య లక్ష్మీరాజ్యం ఒక్కరే ఉన్నారు. పెంపుడు కుక్క కూడా ఇటీవలే మరణించింది. దీంతో అదను చూసిన దొంగ.. ఇంటి వెనుక వైపు నుంచి చొరబడ్డాడని కుటుంబసభ్యులు తెలిపారు. కిచెన్‌లో ఉన్న లక్ష్మీరాజ్యంపై స్ప్రే చల్లడంతో అరిచే సరికి ముఖాన్ని అదిమి పెట్టాడు. వెంటనే మెడపై కత్తి పెట్టి బెదిరించాడు. ముఖానికి మాస్క్ కూడా ఉంది. ఆమెను బెదిరించి భయపెట్టి బంధించి.. ఇంట్లో ఉన్న దాదాపు 30 తులాల బంగారం, నగదును ఎత్తుకెళ్లాడు దండగుడు.

ఈ ఘటనతో ఇంకా షాక్ లోనే ఉన్నారు తైనాల విజయ్ కుమార్ భార్య లక్ష్మీరాజ్యం. దొంగ చేతిలో ఆమె గాయపడ్డారు. సొత్తు పోయినా అదృష్టవశాత్తు ప్రాణాలు దక్కాయని అంటున్నారు తైనాల విజయ్ కుమార్. ఇంటి వాడిలా దర్జాగా వచ్చి.. సొత్తు దోచుకుని వెళ్ళిపోయాడని అంటున్నారు. ఇంట్లోకి ఒక్కడే చొరబడ్డాడని.. బయట మరొకరు వేచి ఉన్నట్టు అనిపిస్తుందని లక్ష్మీరాజ్యం పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఈ విషయం తెలుసుకున్న వైసీపీ, తైనాల అభిమానులు ఆయన ఇంటికి చేరుకుని పరామర్శించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్రైమ్ డీసీపీ వెంకటరత్నం పర్యవేక్షిస్తున్నారు. ప్రత్యేక బృందాలుగా నిందితుల కోసం గాలిస్తున్నారు.

Also read

Related posts

Share via