April 19, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

చౌక బియ్యం ముఠాల మధ్య ఘర్షణ  ఆధిపత్యం కోసం పరస్పరం కార్లతో ఢీ

ఎ.కొండూరు, : చౌకబియ్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్న వర్గాల మధ్య ఆధిపత్య పోరుకు తార్కాణం ఈ ఉదంతం. ఎన్టీఆర్ జిల్లా ఎ. కొండూరు మండలం గోపాలపురం వద్ద ఇరువర్గాల వారు పరస్పరం కార్లతో ఢీకొట్టుకోవడంతో స్థానికులు భయాందోళన చెందారు. తిరువూరు నియోజకవర్గంలో వైకాపా ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఓ వ్యక్తి రాజుపేటలోని రైస్ మిల్లు కేంద్రంగా కాకినాడ పోర్టుకు ప్రతినెలా పదుల సంఖ్యలో రేషన్బియ్యం లారీలను తరలించి రూ.కోట్లకు పడగలెత్తాడు. ప్రభుత్వం మారాక అతని వ్యాపారానికి అడ్డుకట్ట పడింది. ఆ దందాను మరో మాఫియా నిర్వాహకుడు చేజిక్కించుకున్నాడు. వీరి మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. ఆదివారం గోపాలపురం నుంచి చౌక బియ్యాన్ని అక్రమంగా తరలించేందుకు సిద్ధంకాగా, మరోవర్గం వారు యూటు ఛానళ్ల విలేకరులతో కలిసి అడ్డుకునేందుకు 
ప్రయత్నించారు. అప్పటికే సిద్ధంగా ఉన్న లారీకి కారు అడ్డుపెట్టడంతో ఆగ్రహించిన ప్రస్తుత మాఫియాలోని వ్యక్తులు ప్రత్యర్థులపై దాడికి పాల్పడ్డారు. లారీకి అడ్డుగా ఉన్న కారును మరో కారుతో ఢీకొట్టారు. దీంతో ఆ కారు రహదారి పక్కనున్న కాల్వలోకి పల్టీ కొట్టింది.

ఒకటి పట్టుకోబోతే, మరోటి దొరికింది

ఈ ఘర్షణ జరుగుతుండగానే బియ్యం లారీని అక్కడి నుంచి పంపించగా, ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల వద్ద అధికారుల తనిఖీలో దొరికింది. గోపాలపురానికి ఆలస్యంగా చేరుకున్న పోలీసులు, పౌర సరఫరాల శాఖ అధికారులకు మరో విచిత్ర అనుభవం ఎదురైంది. ఇక్కడి నుంచి బియ్యం తరలిస్తున్న లారీకి బదులు, గుంటూరు నుంచి ఛత్తీస్ గడక్కు చౌకబియ్యం తరలిస్తూ పోలిశెట్టిపాడు సమీపంలోని పెట్రోల్ బంకులో నిలిపి ఉన్న లారీ పట్టుబడింది. దీనిపై డిప్యూటీ తహసీల్దార్ శ్వేతను వివరణ కోరగా తాము ఘటనా స్థలానికి చేరుకోకముందే గొడవ జరిగిందని తెలిపారు.

Also read

Related posts

Share via