November 21, 2024
SGSTV NEWS
Crime

8 నెలలు మోసగించారు.. రూ.7 కోట్లు కొట్టేశారు

తనకొక స్వామీజీ తెలుసని.. విదేశాల్లో ఉన్న శిష్యులు ఆయనకు విరాళాలు పంపిస్తారని.. పన్నుల కోసం ముందుగా పెట్టుబడి పెడితే 30శాతం వాటా పొందవచ్చని నమ్మించి ఓ ఘరానా ముఠా ఏకంగా రూ.7.18కోట్లు కాజేసింది.

280 లావాదేవీల ద్వారా ఓ వ్యాపారికి బురిడీ విదేశీ విరాళాలు తెప్పిస్తామంటూ ఘరానా మోసం

హైదరాబాద్: తనకొక స్వామీజీ తెలుసని.. విదేశాల్లో ఉన్న శిష్యులు ఆయనకు విరాళాలు పంపిస్తారని.. పన్నుల కోసం ముందుగా పెట్టుబడి పెడితే 30శాతం వాటా పొందవచ్చని నమ్మించి ఓ ఘరానా ముఠా ఏకంగా రూ.7.18కోట్లు కాజేసింది. ఓ వ్యాపారిని 8 నెలలపాటు మోసగించడం ద్వారా ఆ సొమ్ము కొట్టేశారు. వివరాలివీ.. హైదరాబాద్ కొండాపూర్లో నివసించే వ్యాపారి(42) నల్గొండ జిల్లా దేవరకొండ మండలంలో హార్డ్వేర్ స్టోర్ నిర్వహిస్తున్నారు. అదే ప్రాంతానికి చెందిన ఘంటా యాదయ్య అలియాస్ గిరితో 2019లో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి స్థిరాస్తి వ్యాపారం నిర్వహించారు. 2023 ఆగస్టులో గిరి కొత్త ప్రతిపాదనను వ్యాపారి ముందుంచాడు. నల్గొండ జిల్లా హాలియా మండలం అనుముల గ్రామానికి చెందిన స్వామీజీ కేతావత్ దేవ్సింగ్ నాయక్ రాథోడ్ తనకు తెలుసని.. 40 దేశాల్లో స్థిరపడిన అతడి శిష్యులు రూ.కోట్లలో విరాళాలు పంపిస్తుంటారని చెప్పాడు.. ముందస్తుగా చెల్లించాల్సిన పన్నులను కడితే 30శాతం వాటా దక్కుతుందని సూచించాడు. రూ.19.5కోట్లు విడుదలకు సిద్ధంగా ఉన్నట్లుగా ఆర్బీఐ పత్రాలు అంటూ కొన్ని నకిలీ కాగితాలు చూపించి నమ్మించాడు.

గత ఏడాది ఒకసారి యూకే నుంచి విదేశీ ప్రతినిధి ఆగస్టీన్ హైదరాబాద్ రాడిసనూ హోటల్కు వస్తున్నారని వెళ్లి కలుద్దామని గిరి చెప్పాడు. తర్వాత.. ఆగస్టీన్ ను హైదరాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ వర్గాలు ఆపినట్లు తెలిపాడు. రాథోడ్కు ఇచ్చేందుకు తెస్తున్న రూ.15కోట్ల విలువైన అమెరికా డాలర్లను కస్టమ్స్ అధికారులు అతడి బ్యాగ్లో గుర్తించి స్వాధీనం చేసుకున్నారని నమ్మించాడు. గత ఏడాది సెప్టెంబరు 16న ఆగస్టీన్ వ్యాపారికి ఫోన్ చేశాడు. లాయర్ అంటూ మోర్గానన్ను పరిచయం చేశాడు. డాలర్లను విడిపించేందుకు సొమ్ము బదిలీ చేయాలని అతడు బ్యాంక్ ఖాతా నంబర్లను ఇచ్చాడు. ఆగస్టీన్.. తన మేనేజర్ అంటూ జార్జిని వ్యాపారికి పరిచయం చేశాడు. తర్వాత నుంచి జార్జి ఫోన్లు చేస్తూ సొమ్ము ఎంత తొందరగా చెల్లిస్తే అంత త్వరగా డాలర్లను విడుదల చేసుకోవచ్చని వ్యాపారిని నమ్మించాడు. గత నెలలో రాథోడ్ ఫోన్ చేసి దిల్లీకి రావాలని వ్యాపారికి సూచించాడు. ఆ సమయంలో అతడి పీఏగా పరిచయం అయిన కిరణ్.. పలుమార్లు వ్యాపారితో మాట్లాడాడు. మరోవైపు స్టాండర్డ్ ఛార్టర్డ్ బ్యాంకు మేనేజర్ నంటూ మోర్ అనే వ్యక్తి వ్యాపారితో మాట్లాడాడు. రాథోడ్కు రూ.2కోట్లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని చెప్పి ఐదు విడతలుగా రూ.3-4లక్షల చొప్పున పన్నుల కింద జమ చేయించుకున్నాడు. రోజులు గడుస్తున్నా విరాళాలు అందకపోవడంతో గిరిని వెంటపెట్టుకొని వ్యాపారి ఈ నెల 13న దిల్లీ వెళ్లి రాథోడ్ను కలిశారు. విరాళాల గురించి ప్రశ్నించగా మరో రూ.7 లక్షల పన్ను చెల్లించాల్సి ఉందని చెప్పాడు. ‘నేను త్వరలో నేషనల్ జ్యూట్బోర్డు ఛైర్మన్ గా నామినేట్ అవుతున్నా. సునీల్ కుమార్ అనే వ్యక్తి ఇందుకు సహకరిస్తున్నారు. నేను పదవి పొందిన తర్వాత విరాళాల విడుదల సులభమవుతుంది’ అని చెప్పాడు.

సునీల్ కుమార్ బ్యాంకు ఖాతాకు డబ్బు బదిలీ చేయాలని వ్యాపారికి సూచించాడు. ఈమేరకు వ్యాపారి 14 విడతల్లో రూ.40లక్షలను సునీల్ కు మార్కు పంపారు. అలా గత ఏడాది ఆగస్టు 16 నుంచి ఈనెల 3 వరకు 280 లావాదేవీల ద్వారా మొత్తం రూ.7,18,11,016 గిరి, రాథోడ్ ముఠా చెప్పిన వారికి వ్యాపారి బదిలీ చేశారు. అయినా ముఠా నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఆయన సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులను ఆశ్రయించారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ఆరంభించారు.

Also read



Related posts

Share via