SGSTV NEWS online
CrimeTelangana

భార్య స్నేహితురాలితో వివాహేతర సంబంధం – ప్రియురాలితోనే పిలిపించి దారుణ హత్య


కుటుంబ సభ్యులు హెచ్చరించినా పట్టించుకోని ఇరువురు – ప్రియురాలితోనే ఫోన్ చేయించి రప్పించి హత్య – బాధిత కుటుంబం ఫిర్యాదుతో నిందితులను పట్టుకున్న పోలీసులు

Extramarital affair in Sangareddy : వివాహేతర సంబంధాలు కుటుంబాల్లో చిచ్చురేపుతున్నాయి. హత్యలు, దాడులతో ఇరు కుటుంబాలు నష్టపోతున్నాయి. చేసిన తప్పును సరిదిద్దుకోవాలని పదే పదే హెచ్చరించినా పెడచెవిన పెట్టడమే దీనికి కారణం. కొన్ని కేసుల్లో తప్పు చేసిన వారు శిక్షింపబడుతుండగా, మరికొన్నిచోట్ల అడ్డు తొలగించుకునే నెపంతో అమాయకులైన భాగస్వాముల ఉసురు తీస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో వివాహేతర సంబంధం కారణంగా ఓ నిండు ప్రాణం బలవ్వగా, మరో కుటుంబం అనాథగా మారింది.

విచక్షణా రహితంగా కత్తులతో దాడి : సంగారెడ్డి జిల్లా నర్సాపూర్‌ చెరువు వద్ద యువకుడి హత్య తీవ్ర కలకలం రేపింది. గొంతు కోయడంతో పాటు శరీరంపై విచక్షణా రహితంగా కత్తిపోట్లతో మృతి చెందిన యువకుడు ఫారూక్‌ అన్సారీగా గుర్తించిన పోలీసులు, నిందితులను 24 గంటల వ్యవధిలోనే పట్టుకున్నారు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని తేల్చారు.

భార్య పురిటికి వెళ్లిన సమయంలో : ఉత్తర్ప్రదేశ్‌లోని గోవర్ధన్‌కు చెందిన 22 ఏళ్ల ఫారూక్‌ అన్సారీ ఉపాధి నిమిత్తం సంగారెడ్డి జిల్లా దోమడుకు వచ్చి ప్లంబర్ పని చేస్తున్నాడు. అక్కడే సల్మా బేగం అనే యువతితో పరిచయం ఏర్పడటంతో ఆరేళ్ల క్రితం ఆమెను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం నర్సాపూర్‌కు వచ్చి స్థిరపడ్డారు. అయితే భార్య మూడోసారి పురిటికి వెళ్లిన సమయంలో ఆమె స్నేహితురాలైన అప్షా బేగంతో అన్సారీ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అప్షా బేగంకు అప్పటికే వివాహం జరిగింది. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో పాటు అప్షా బేగం కుటంబంలోనూ కలహాలు చెలరేగాయి.

భార్యతో ఫోన్ చేయించి : ఈ క్రమంలో అప్షా కుటుంబ సభ్యులు పలుమార్లు వచ్చి సల్మా బేగం, ఆమె భర్త అన్సారీని హెచ్చరించారు. అయినప్పటికీ ఇరువురిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో అప్షాబేగం భర్త షబ్బీర్ కోపంతో రగిలిపోయాడు. మాట్లాడుకుందామని కబురుపెట్టినా అన్సారీ రాకపోవడంతో షబ్బీర్ ఓ పథకం వేశాడు. భార్యతో ఫోన్‌ చేయించి అతను చెరువు వద్దకు వచ్చేలా చేశాడు.

“అప్షా బేగం భర్త షబ్బీర్ ఆమెను బెదిరించి, అన్సారీని చెరువు వద్దకు వచ్చేటట్టు ట్రాప్ చేశారు. దీంతో ఆమె అన్సారీని పిలిచింది. అతను రాగానే హత్య చేశారు. పదునైన కత్తితో గొంతు కోసి చంపి అక్కడే వదిలేశారు. అనంతరం నిందితులు వెంటనే బీదర్ పారిపోవాలనుకున్నారు. కానీ మా పోలీసు బృందం వారిని పట్టుకుంది” -నరేంద్ర గౌడ్, తూప్రాన్ డీఎస్పీ

హత్య చేసి పరార్ : అప్పటికే అక్కడ మాటు వేసిన సల్మాబేగం తల్లి రెహానా బేగంతో పాటు చిన్నమ్మ షబానా, అప్షాబేగం భర్త షబ్బీర్, మామ షబ్బీర్‌, అత్త రేష్మా బేగంతో పాటు స్నేహితుడు అంబదాసు ఒక్కసారిగా అతన్ని పట్టుకున్నారు. పథకం ప్రకారం షబ్బీర్, పాషా, అంబదాసు, రేష్మాబేగంలు అన్సారీని పట్టుకోగా, షబ్బీర్ కత్తితో విచక్షణారహితంగా అన్సారీ కడుపులో పొడిచాడు. అనంతరం గొంతుకోసి దారుణంగా హత్య చేసి పారిపోయారు. ఆ తర్వాత విషయాన్ని రెహానాబేగం, షబీనా బేగం సల్మాబేగానికి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పారు. దీంతో ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చింది.

రెండు కుటుంబాల్లో విషాదమే : వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని తేల్చారు. భర్తను కోల్పోయి భార్య, ముగ్గురు బిడ్డలు అనాథలవ్వగా, హత్యలో పాల్గొన్న మరో నలుగురు జైలు పాలయ్యారు.

Also Read

Related posts