Assam Woman Died : స్వస్థలానికి వెళ్లేందుకు రైలెక్కిన అసోం యువతి శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస-పొందూరు రైల్వేస్టేషన్ల మధ్య బొడ్డేపల్లి పేట వద్ద శవమై కనిపించిన ఘటన కలకలం రేపింది.
ఓ నృత్య ప్రదర్శన కోసం అసోం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన యువతి రైలు పట్టాల వద్ద శవమై తేలింది. అర్ధరాత్రి రైలులో ప్రయాణిస్తున్న సమయంలో ‘నా చుట్టూ చాలా మంది మగవాళ్లు ఉన్నారు. కొందరు మద్యం తాగుతున్నారు, భయంగా ఉంది’ అని యువతి కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడింది. యువతికి తల్లిదండ్రులు ధైర్యం చెప్పి, కొద్ది సేపటికి తిరిగి ఫోన్ చేయగా ఎటువంటి స్పందన లేదు. అంతలోనే ఉదయం రైలు పట్టాలపై యువతి శవమై కనిపించింది. అసలు ఆ రాత్రి ట్రైన్లో ఏం జరిగింది? ఆమెను ఎవరైనా వేధించారా? హత్య చేసి రైలు పైనుంచి తోసేశారా? లేదా జారి పడి మృతి చెందిందా? అనే కోణంలో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ.. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు.
స్వస్థలానికి వెళ్లేందుకు రైలెక్కిన అసోం యువతి శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస-పొందూరు రైల్వేస్టేషన్ల మధ్య బొడ్డేపల్లి పేట వద్ద శవమై కనిపించిన ఘటన కలకలం రేపింది. అసోం రాష్ట్రం గువాహటిలోని బోండా ప్రాంతానికి చెందిన హిమశ్రీ బోరో(20) విశాఖలో నృత్య పోటీల్లో పాల్గొనేందుకు వచ్చింది. స్నేహితులంతా అక్కడే ఉండిపోగా ఆమె మాత్రం మరుసటి రోజు పరీక్ష ఉందని ఈ నెల 6న విశాఖ నుంచి బయల్దేరింది.
అర్ధరాత్రి 2.30 గంటలకు ఫోన్ : అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో కన్యాకుమారి-దిబ్రూగఢ్ వివేక్ ఎక్స్‌ప్రెస్ ఎక్కింది. కోచ్ నంబరు ఎస్-2లో ప్రయాణిస్తున్న ఆమె 1 గంట సమయంలో కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడింది. కొందరు మద్యం తాగుతున్నారని, భయంగా ఉందని చెప్పింది. రాత్రి 2.30 గంటల తరువాత కుటుంబ సభ్యులు ఆమెకు ఫోన్ చేయగా సంకేతాలు అందలేదు. దీంతో భయాందోళనకు గురైన తల్లిదండ్రులు, వెంటనే రైల్వే హెల్ప్‌లైన్ 139తో పాటు గౌహతి రైల్వే పోలీసులకు (GRP) కంప్లైంట్ చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వివేక్ ఎక్స్‌ప్రెస్‌లోని S2 కోచ్‌లో ఆమె బ్యాగ్‌ను గుర్తించారు కానీ ఆ యువతి ఆచూకీ దొరకలేదు. రైలు వెళ్లిన మార్గంలో గాలింపు చర్యలు చేపట్టగా ఆమదాలవలస-పొందూరు రైల్వేస్టేషన్ల మధ్య బొడ్డేపల్లి పేట వద్ద 7వ తేదీ ఉదయం జీఆర్పీ పోలీసులు ఆమె మృతదేహాన్ని పట్టాల వద్ద కనుగొన్నారు.
చరవాణిలో మూడు నిమిషాల వీడియో : ఆమదాలవలస జీఆర్పీ సిబ్బంది రైలు నుంచి జారి పడి మృతి చెందినట్లు కేసు నమోదు చేసి మృతదేహాన్ని శ్రీకాకుళం సర్వజనాసుపత్రికి తరలించి భద్రపరిచారు. ఆమె రెండు బ్యాగ్‌లు కోచ్‌లోనే భద్రంగా ఉన్నట్లు గుర్తించారు. చరవాణిలో మద్యం తాగుతున్న వ్యక్తులను చిత్రీకరించిన మూడు నిమిషాల వీడియో ఆధారాలు పోలీసులకు లభించినట్లు తెలుస్తోంది. మృతదేహం వద్ద లభించిన ఆధార్‌కార్డు వివరాల ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు.
మరోవైపు ఆమె చదువుతున్న కళాశాలలో విద్యార్థులు నిరసన చేసినట్లు తెలిసింది. మృతురాలి కుటుంబ సభ్యులు గురువారం శ్రీకాకుళం చేరుకుని మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డిని కలిసి పరిస్థితి వివరించారు. వారి అభ్యర్థన మేరకు ఎస్పీ ఘటనా స్థలాన్ని సందర్శించారు. సభ్యుల నుంచి ఫిర్యాదును స్వీకరించి విచారణ చేపట్టే బాధ్యత సీఐకి అప్పగించారు. జారి పడి మృతి చెందిందా? ఎవరైనా తోసేశారా? రైల్లో ఏం జరిగింది? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చంద్రబాబుకు అసోం సీఎం లేఖ : యువతి మృతిపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. “హిమశ్రీ బోడో విషాదకర మరణం మాకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ దుఃఖ సమయంలో ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఈ రోజు లేఖ రాశాను. అక్కడి చట్టాల అమలు, సంస్థలతో సమన్వయం చేసుకోవడానికి అస్సాంకు చెందిన ఒక సీనియర్ పోలీసు అధికారిని ఆంధ్రప్రదేశ్‌కు పంపాను” అని హిమంత బిస్వా లేఖలో పేర్కొన్నారు.
Also read
- Parivartan Yoga: పరివర్తన యోగం.. అదృష్టాలు పట్టబోయే రాశులివే..!
- మహాలయ అమావాస్య నాడు పితృదేవతలను ఎందుకు పూజించాలి? గోత్రం తెలియకపోతే ఏం చేయాలి?
- ఊరి బయట గుడి దగ్గర ఏదో అలికిడి.. స్థానికుల సమాచారంతో రంగంలోకి ఖాకీలు..!
- Hyderabad: సర్కార్ బడిలో క్లాసులు జరుగుతుండగా నిర్మాణ పనులు.. విద్యార్థిని తలపై పడిన ఇనుప రాడ్!
- తీరని శోకం.. బట్టలు ఉతుకుతూ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం!





