పంచభూతాలతో పాటు సూర్యుడు, చంద్రుడు, జీవాత్మ రూపాల్లో జగత్తంతా పరమేశ్వరుడు – ఆయన అష్టమూర్తి తత్వం గురించి, అష్టమూర్తులుగా శివుడు ఏయే ప్రదేశాల్లో వెలసి ఉన్నాడో తెలుసా?
శివ సహస్రనామాల్లో ‘అష్టమూర్తి’ అనే నామం కూడా ఉంది. అష్టమూర్తి అంటే 8 రకాల స్వరూపాలు ఒకే మూర్తిగా కలిగినవాడని అర్థం. స్కంద పురాణం ప్రకారం పరమేశ్వరుడు అష్ట మూర్తిగా విరాజిల్లుతున్నాడు. సర్వేశ్వరుడైన పరమశివుడు ఈ జగత్తును ఎనిమిది రూపాలలో ఆవరించి ఉన్నాడని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా పరమేశ్వరుని అష్టమూర్తి తత్వం గురించి, అష్టమూర్తులుగా శివుడు ఏయే ప్రదేశాల్లో వెలసి ఉన్నాడో ఈ కథనంలో తెలుసుకుందాం.
శివుని అష్టమూర్తులు
పృథ్వీ, ఆకాశం, జలం, అగ్ని, వాయువు అనే పంచభూతాలతో పాటు సూర్యుడు, చంద్రుడు, మానవుడు అనే మూడు కలిపి మొత్తం అష్టమూర్తి తత్వంతో పరమేశ్వరుడు ఈ సృష్టి మొత్తంలో నిబిడీకృతమై ఉన్నాడు.
అష్టమూర్తులు – పురాణ నామాలు
శివపురాణం ప్రకారం పరమశివుడు ఈ జగత్తును ఎనిమిది రూపాలలో ఆవరించి ఉన్నాడు. ఈ ఎనిమిది రూపాల పురాణ నామాలు, అవి వేటిని సూచిస్తాయో చూద్దాం.
👉 భవుడు (భవ): ఈ నామం శివుని జల తత్వాన్ని సూచిస్తుంది. సమస్త జీవకోటికి పుట్టుకను, జీవనాన్ని ఇచ్చే రూపం.
👉 శర్వుడు (శర్వ): ఈ నామం భూమి తత్వాన్ని సూచిస్తుంది. జగత్తును ధరించి, రక్షించే శక్తి ఈ రూపానిది.
👉 రుద్రుడు (రుద్ర): ఈ నామం అగ్ని తత్త్వాన్ని సూచిస్తుంది. సంహార క్రియ ద్వారా జగత్తును శుద్ధి చేసే రూపం.
👉 ఉగ్రుడు (ఉగ్ర): ఈ నామం వాయు తత్వాన్ని సూచిస్తుంది. వాయువు సమస్త జీవుల శ్వాసలో ఉండి చలనాన్ని ఇచ్చేవాడు.
👉 భీముడు (భీమ): ఈ నామం ఆకాశ తత్వాన్ని సూచిస్తుంది. సర్వ వ్యాపకమైన శూన్యంలో శివుడు భీమునిగా కొలువై ఉంటాడు.
👉 పశుపతి: ఈ నామం జీవుని (ఆత్మ) సూచిస్తుంది. జీవులన్నింటికీ ప్రభువుగా, అంతరాత్మగా ఉండే రూపం.
👉 ఈశానుడు (ఈశాన): ఈ నామం సూర్యుని సూచిస్తుంది. వెలుగును, జ్ఞానాన్ని ప్రసాదించే తేజోరూపం.
👉 మహాదేవుడు (మహాదేవ): ఈ నామం చంద్రుని సూచిస్తుంది. చల్లదనాన్ని, మనఃశాంతిని ఇచ్చే ఓషధిపతి రూపం.
పురాణాల ప్రకారం, శివ మహిమ స్తోత్రంలో కూడా ఈ ఎనిమిది నామాల ప్రస్తావన స్పష్టంగా ఉంది. పరమేశ్వరుడు ఈ అష్టమూర్తి తత్వాలతో ఎనిమిది ప్రదేశాలలో వెలసి ఉన్నాడు. ఆ క్షేత్ర వివరాలు చూద్దాం.
అష్టమూర్తి తత్వానికి ప్రతీకలుగా నిలిచే ప్రముఖ శివ క్షేత్రాల వివరాలు చూద్దాం. వీటిలో ఎక్కువ భాగం దక్షిణ భారతదేశంలోనే వెలసి ఉండడం విశేషం. పంచభూత క్షేత్రాలు సృష్టిలోని ఐదు మూలకాలు సూచించే ఈ క్షేత్రాలు అత్యంత ప్రసిద్ధమైనవి.
పృథ్వీ లింగం
తమిళనాడులోని కాంచీపురంలో వెలసిన ఏకాంబరేశ్వర స్వామి ఆలయం పంచభూతాలలో పృథ్వీ తత్వానికి చెందిన క్షేత్రం. ఇక్కడ శివుడు పృథ్వీ లింగంగా కొలువై ఉన్నాడు.
ఆకాశలింగం
తమిళనాడులోని చిదంబరంలో వెలసిన నటరాజస్వామి ఆలయం పంచభూతాలలో ఆకాశ తత్వానికి చెందిన క్షేత్రం. ఇక్కడ శివుడు ఆకాశలింగంగా కొలువై ఉన్నాడు. విచిత్రమేమిటంటే ఇక్కడ ఎలాంటి శివ స్వరూపం ఉండదు. కేవలం ఒక గోడకు చిన్న పుష్పమాల తగిలించి ఉంటుంది. అర్చకులు ఒక కిటికీలోంచి ఈ ప్రదేశాన్ని చూపించి నమస్కరించుకోమంటారు. శూన్యమైన ఆకాశానికి ప్రతిబింబంగా ఈ దర్శనం నిలుస్తుంది. బహుశా అందుకేనేమో అంతుచిక్కని విషయాన్ని చిదంబర రహస్యమని అంటారు.
జల లింగం
తమిళనాడు తిరుచిరాపల్లికి సమీపంలో వెలసిన జంబుకేశ్వర క్షేత్రం పంచభూతాలలో జలతత్వానికి చెందిన క్షేత్రం. ఇక్కడ పరమేశ్వరుడు జంబుకేశ్వరుడుగా, జలలింగంగా కొలువై ఉన్నాడు.
అగ్ని లింగం
తమిళనాడులోని అరుణాచల క్షేత్రం పంచభూతాలలో అగ్నితత్వానికి చెందిన క్షేత్రం. పరమ పవిత్రమైన అరుణాచల క్షేత్రంలో శివుడు అరుణాచలేశ్వరుడుగా, అగ్నిలింగంగా భాసిల్లుతున్నాడు.
వాయులింగం
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాళహస్తి క్షేత్రం పంచభూతాలలో వాయు తత్వానికికి చెందిన క్షేత్రం. ఈ క్షేత్రంలో వెలసిన శ్రీకాళహస్తీశ్వరుడు వాయులింగంగా పూజలందుకుంటున్నాడు.
పంచభూత క్షేత్రాల తరువాత మిగిలిన మూడు తత్వాలైన సూర్యుడు, చంద్రుడు, ఆత్మలింగ స్థానాలుగా పురాణాలు పేర్కొన్న పవిత్ర క్షేత్రాల ఎక్కడున్నాయో చూద్దాం.
సూర్య లింగం
ఒడిషాలోని కోణార్క సూర్య దేవాలయం సూర్య లింగంగా భాసిల్లుతోంది.
చంద్ర లింగం
బంగాల్లోని బీర్భూమ్ జిల్లా, హేతంపూర్లో ఉన్న చంద్రనాథ్ శివాలయం అష్టమూర్తి తత్వంలోని ‘చంద్ర లింగానికి’ ప్రతీకగా వెలసి ఉంది. ఆలయం లోపల తెలుపు రంగులో ఉండే శివలింగం ప్రతిష్టించబడి ఉంటుంది.
యజమాన లింగం (ఆత్మలింగం)
నేపాల్లోని పశుపతినాథ్ ఆలయం అష్టమూర్తి తత్వంలో ఆత్మలింగం గా, యజమాన లింగంగా విరాజిల్లుతోంది.
పురాణాల ప్రకారం ఒక వ్యక్తి తన జీవితకాలంలో ఈ అష్టమూర్తులకు సంబంధించిన ఆలయాలను దర్శించడం వలన మోక్షాన్ని పొందుతారని తెలుస్తోంది.
ఓం నమః శివాయ!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం
పరమేశ్వరుని అష్టమూర్తి తత్వం
Also read
- ఒకే రోజు గంటల వ్యవధిలో శవాలుగా మరిన వృద్ధ దంపతులు.. మిన్నంటిన రోధనలు
- జీడిమామిడి తోటలో ఏం జరిగింది..? శవాలుగా తల్లీకూతురు.. ఉలిక్కిపడ్డ ఏలూరు..
- పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలి….. గ్రీష్మ కుమార్,సి.పి.ఐ.యం.యల్. (న్యూ డెమోక్రసీ)
- శివుని అష్టమూర్తి తత్వం అంటే ఏంటి? పరమేశ్వరుడు ఎక్కడెక్కడ వెలిశాడు?
- స్మశానంకు వెళ్లిన సమయంలో చేయకూడని తప్పులివే.. ఇలా మాత్రం అస్సలు చేయొద్దు!





