ఐ.పోలవరం: ఆక్వా రైతును ఆయన వద్దపనిచేసే కూలీలే దారుణంగా హత్య చేసి చెరువులో పడేసిన ఘటన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం మురమళ్లలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మురమళ్లకు చెందిన దాట్ల కృష్ణంరాజు (65) మురమళ్ల-కేశనకుర్రు ఆర్అండ్ బీ రహదారి పక్కన ఉన్న చెరువుల్లో రొయ్యల సాగు చేస్తున్నారు. ఆయా చెరువుల్లో పనిచేసేందుకు అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరుకు చెందిన సిద్దు, ప్రసాద్ లను నియమించుకున్నారు. వారిద్దరూ తమకు పరిచయం ఉన్న మరో మహిళతో కలిసి చెరువు వద్దే నివాసం ఉంటున్నారు. బుధవారం మధ్యాహ్నం రైతు కృష్ణంరాజుకు, కూలీల మధ్య వివాదం జరిగింది. సాయంత్రం ఆరు గంటలకే ఇంటికి వచ్చే కృష్ణంరాజు రాత్రి 8 గంటలైనా రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. చెరువు వద్ద కూలీలు లేకపోవడం.. రైతు ద్విచక్ర వాహనం, పాదరక్షలు అక్కడే ఉండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అర్ధరాత్రి సమయంలో కృష్ణంరాజు మృతదేహాన్ని చెరువులో గుర్తించారు. గొడవ నేపథ్యంలో గంజాయి మత్తులో ఉన్న కూలీలు సిద్ధు, ప్రసాద్ లు ఇనుప రాడ్డుతో కృష్ణంరాజు తలపై బలంగా కొట్టి హత్య చేసి, మృతదేహం పైకి తేలకుండా సర్వేరాళ్లు కట్టేసి చెరువులో పడేసి పరారయ్యారని పోలీసులు భావిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కాకినాడలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
Also read
- బ్రహ్మపుత్ర నదిలో పడి జమ్మలమడుగు యువతి మృతి
- కళ్లల్లో కారం చల్లి… కత్తులతో నరికి… RMP డాక్టర్ హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్..!
- Video: రీల్స్‌తో వివాదం.. రాజీనామా చేసిన ప్రభుత్వ టీచర్! కన్నీళ్లు పెట్టుకుంటూ..
- ఇంకా దొరకని రాము.. నీతు.. గుండెల్ని పిండేస్తున్న ఘటన..
- Massive Scam: 70 మందికి టోకరా పెట్టిన రిటైర్డ్ టీచర్.. ఏకంగా ఏడు కోట్లు స్వాహా





