December 3, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

అలాంటి పనులకు అడ్డాగా మారిన ఆధ్యాత్మిక నగరం.. స్థానికుల్లో ఆందోళన..

టెంపుల్ సిటీలో క్రైమ్ రేట్ పెరిగిపోవడంతో జనంలో ఆందోళన నెలకొంది. వరుస హత్యలు, దాడులతో ఆధ్యాత్మికతకు మచ్చగా మారుతోంది. ఈ మధ్య కాలంలో వరుసగా జరుగుతున్న ఘటనలు ఇందుకు అద్దం పడుతోంది. గంజాయి మత్తులోనే యువత నేరాలకు పాల్పడుతున్నట్లు స్పష్టం అవుతోంది.
అలాంటి పనులకు అడ్డాగా మారిన ఆధ్యాత్మిక నగరం.. స్థానికుల్లో ఆందోళన..

టెంపుల్ సిటీలో క్రైమ్ రేట్ పెరిగిపోవడంతో జనంలో ఆందోళన నెలకొంది. వరుస హత్యలు, దాడులతో ఆధ్యాత్మికతకు మచ్చగా మారుతోంది. ఈ మధ్య కాలంలో వరుసగా జరుగుతున్న ఘటనలు ఇందుకు అద్దం పడుతోంది. గంజాయి మత్తులోనే యువత నేరాలకు పాల్పడుతున్నట్లు స్పష్టం అవుతోంది. 4రోజుల క్రితం తిరుపతిలోని సుందరయ్య నగర్‎లో మైనర్ బాలిక ప్రేమ వ్యవహారంలో జరిగిన ప్రేమోన్మాద దాడి టెంపుల్ సిటీని ఉలిక్కిపడేలా చేసింది. ఈ క్రమంలోనే డ్రగ్ కల్చర్ కొనసాగుతుందన్న విషయం వెలుగులోకి వచ్చింది. సుందరయ్య నగర్‎లో ఒక మైనర్ బాలికపై జరిగిన దాడి గంజాయి మత్తులోనే జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే ఇప్పుడు టెంపుల్ సిటీలో చర్చగా మారింది. పదో తరగతి చదువుతున్న మైనర్ బాలికను సుందరయ్య నగర్‎కు చెందిన బాలు అనే యువకుడు ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేశాడు. అదే క్రమంలో జరిగిన దాడిపై బాలిక తల్లి సుందరి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఉపాధి కోసం కువైట్‎కు వెళ్లిన సుందరి మైనర్ కూతురు, కొడుకును సుందరయ్య నగర్‎లోని తల్లి ముత్యాలమ్మ సంరక్షణలో పెట్టి చదివిస్తోంది. గత కొద్దికాలంగా సుందరయ్య నగర్‎కి చెందిన బాలు అనే యువకుడు మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధిస్తున్నట్లు తెలుసుకుని.. సుందరి కుటుంబ సభ్యులు వారించే ప్రయత్నం చేశారు. కూతురు ప్రేమ విషయం తెలుసుకొని కువైట్ నుంచి తిరిగి వచ్చిన తల్లి సుందరి.. బాలు అనే యువకుడి నిర్వాకంపై నిలదీసింది. సుందరి కొడుక్కి, బాలు అనే యువకుడికి మధ్య ఈ వ్యవహారంపై ఘర్షణ కూడా జరిగింది. మైనర్ బాలిక ప్రేమ వ్యవహారం రెండు రోజుల క్రితం కత్తులతో దాడికి దారి తీసింది. మైనర్ బాలిక అన్నకు.. బాలు బ్యాచ్ తో జరిగిన గొడవ కత్తిపొట్లకు దారితీసింది.మైనర్ బాలిక తల్లి సుందరి, మేనమామ సురేష్‏‎, బాలు తమ్ముడు లోకేష్ కత్తిపోటుకు గురయ్యారు. ఇలా రెండు కుటుంబాల్లో ముగ్గురు గాయపడ్డారు.

ఈ గొడవపై ఇరు వర్గాల ఫిర్యాదులతో తిరుపతి ఈస్ట్ పిఎస్ లో కేసులు కూడా నమోదు అయ్యాయి. అయితే మైనర్ బాలిక ప్రేమ వ్యవహారం, జరిగిన దాడులు గంజాయి మత్తు కారణమండ విమర్శలు ఉన్నాయి. గంజాయి, డ్రగ్స్ ముఠానే తన కూతురిని ట్రాప్ చేసేందుకు కారణమని తల్లి సుందరి అరోపిస్తోంది. అయితే అన్న బాలు బ్యాచ్ ఆగడాలను కూడా కొందరు వెలుగులోకి తెచ్చారు. మైనర్ బాలిక అన్న బాలుకు గంజాయి, డ్రగ్స్ అలవాటున్నట్లు ఆ బ్యాచ్ పై ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి వరుస ఘటనలు తిరుపతిలో భయాన్ని కలిగిస్తున్నాయి. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో డ్రగ్ కల్చర్ పెరిగిందని, గంజాయి మత్తుకు యువత బానిసవుతోందని కొందరు మహిళలు ఆరోపిస్తున్నారు. గంజాయిపై ఉక్కు పాదం మోపాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తుంది. టెంపుల్ సిటీలో ఇలాంటి కల్చర్ వెంటనే నిరోధించాలంటున్నారు స్థానికులు.

ఇక పోలీసు యంత్రాంగం గంజాయి అమ్మకం, వినియోగాన్ని కట్టడి చేయలేకపోతోంది. విచ్చలవిడిగా అందుబాటులో ఉన్న గంజాయిపై ఉక్కు పాదం మోపలేకపోతోంది. తక్కువ ధరకు ఈజీగా దొరుకు తుండడంతో మైనర్ల జీవితం కూడా గంజాయితో ముడి పడిపోతుంది. అరకు టు చెన్నై, వేలూరు, బెంగళూరు వయా రేణిగుంట, తిరుపతి మీదుగా జరుగుతున్న గంజాయి సప్లై ఇలాంటి ఘటనలకు కారణం అవుతోంది. దీంతో మైనర్లు, స్టూడెంట్లు డ్రగ్ కల్చర్‎ను స్వాగతిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇలా గంజాయికి బానిసలు అవుతున్న యువతపై నిఘా పెట్టిన తిరుపతి జిల్లా పోలీసు యంత్రాంగం కట్టడి చేసేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేసింది. అయితే ప్రజల సహకారం ఉంటే తప్ప నిర్మూలించలేమని చేతులెత్తేస్తున్న పరిస్థితి నెలకొంది. గంజాయి అమ్మకం, వాడకంపై సమాచారమిచ్చి సహకరించాలని స్థానికులను కోరుతోంది పోలీసు యంత్రాంగం


Also read

Related posts

Share via