November 21, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

అంబులెన్సు : కాపాడాల్సింది పోయి ప్రాణాలు తీసిన అంబులెన్స్.. ఇద్దరు దుర్మరణం!

అత్యవసర సమయంలో ఆయువు పోసేందుకు ఉపయోగపడే అంబులెన్స్ మృత్యు శకటంగా మారింది. ఇద్దరు యువకుల ప్రాణాలతోడేసింది. విశాఖపట్నం సూర్యాభాగ్ కల్యాణి ప్రెస్ జంక్షన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టూ వీలర్, 108 అంబులెన్స్ బలంగా ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం లింగాలవలస గ్రామానికి చెందిన రామకృష్ణ, విజయవాడకు చెందిన చందు స్నేహితులు. ఇద్దరూ సోమవారం తెల్లవారుజామున బైక్‌పై సూర్యాభాగ్ నుంచి జోన్ 4 మున్సిపల్ ఆఫీస్ వైపు స్ప్లెండర్ బైక్ పై వెళ్తున్నారు. ఇదే సమయంలో లీలా మహల్ పెట్రోల్ బంకు వైపు నుంచి జగదాంబ జంక్షన్ వైపు అంబులెన్స్ వెళ్తోంది. జంక్షన్ క్రాస్ చేస్తున్న సమయంలో బైకును బలంగా అంబులెన్స్ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో చందు, రామకృష్ణ తీవ్రంగా గాయపడ్డారు.

అదే వాహనంలో తరలించినా..
తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ.. అదే అంబులెన్స్‌లో హుటాహుటీన కేజీహెచ్ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాల కోల్పోయారు చందు, రామకృష్ణ. 108 డ్రైవర్ ఈశ్వరరావును అదుపులోకి తీసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన ప్రమాద దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

పాపం ఆ పేద కుటుంబాలకు పోలీసులు ఆర్థిక సాయం
చందు, రామకృష్ణ ఇద్దరూ పేద కుటుంబాలకు చెందిన వాళ్లే. రామకృష్ణకు తల్లిదండ్రులు ఇద్దరూ లేరు. చిన్నప్పుడే చనిపోవడంతో ఆర్టీసీ కాంప్లెక్స్‌లో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. చంటి తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. తల్లి విజయవాడలోనే ఉంటుంది. విశాఖ వచ్చేందుకు ఆమెకు రవాణా ఖర్చులు కూడా లేవు. దీంతో పోలీసులే ఆర్థిక సాయం చేశారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో ఆయా కుటుంబాల్లో తీరని విషాదం అలుముకుంది. మృతదేహాలను చూసి కుటుంబ సభ్యుల రోదిస్తున్న తీరు అందరినీ కలచివేసింది. ఇద్దరి మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తిచేసి బంధువులకు అప్పగించారు పోలీసులు.

Also read

Related posts

Share via