July 3, 2024
SGSTV NEWS
Andhra PradeshPolitical

AP Politics: జనసైనికుడు అవుతాడనుకున్న ముద్రగడ వైసీపీ నేతగా మారడానికి రీజన్…?

ముద్రగడ ఎపిసోడ్‌కి ఎండ్‌ కార్డ్‌ పడింది. ఫుల్‌ క్లారిటీతో అధికార వైసీపీకి జై కొట్టారు ముద్రగడ. ముహూర్తం కూడా ఫిక్స్‌ చేసుకున్నారు. జనసైనికుడు అవుతాడనుకున్న ఆయన సడెన్‌గా వైసీపీ కండువా కప్పుకోవడానికి కారణాలేంటి…? ముద్రగడ ఎందుకు యూటర్న్‌ తీసుకున్నారు…? పవన్‌ మీద కోపమా…? జగన్‌ మీద ప్రేమనా…? అసలు ముద్రగడ నిజంగానే వైసీపీ చెరుకుగడ అవుతారా…?

ఆ గట్టునుంటావా… ఈ గట్టుకొస్తావా.. అంటూ ఇన్నాళ్లూ సాగిన ముద్రగడ ఎపిసోడ్‌కు ఫుల్‌ స్టాప్‌ పడింది. నెలలకొద్దీ అటా.. ఇటా అంటూ కన్‌ఫ్యూజ్‌ అయిన కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఫుల్‌ క్లారిటీకొచ్చేశారు. వైసీపీలో చేరేందుకు నేను సిద్ధం అంటూ ప్రకటించేశారు. ఈనెల 14న కొడుకుతో పాటు వెళ్లి సీఎం జగన్‌తో చేతులు కలిపి, వైసీపీ కండువా కప్పుకోనున్నారాయన. భారీ అనుచరదళంతో తాడేపల్లికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఎన్నికల వేళ హాట్‌ టాపిక్‌గా మారారు ముద్రగడ. జనసేనలో చేరేందుకు దాదాపుగా రంగం సిద్ధమైంది. కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటికి తాడేపల్లిగూడెం జనసేన ఇన్‌చార్జ్‌ బొలిశెట్టి శ్రీనివాస్‌, ఇతర నాయకులు కూడా వెళ్లి చర్చించారు. ముద్రగడ లాంటి పెద్దమనిషి ఇంటికి వెళ్లి స్వయంగా పవన్‌ కల్యాణే వచ్చి పార్టీ కండువా కప్పుతారని బొలిశెట్టి వెల్లడించారు. అయితే రోజులు, వారాలు గడిచినా ముద్రగడ ఇంటి వైపు చూడలేదు జనసేనాని. రెండుసార్లు ఇంటికి వస్తానని చెప్పి అవమానించారని జనసేనానిపై ముద్రగడ ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా. పరోక్షంగా పవన్‌పై విమర్శలూ గుప్పించారు.

ఇక ఒంటరిగా పోటీ చేస్తూ అన్ని శక్తులను కూడగట్టుకుంటున్న వైసీపీ… ముద్రగడ కోసం పావులు కదిపింది. ఎంపీ మిథున్‌రెడ్డి ముద్రగడ దగ్గరకి వెళ్లి ఆయనతో చర్చించారు. ఎన్నికల తర్వాత వారి కుటుంబానికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో ముద్రగడ యూటర్న్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. కలుస్తానని హ్యాండిచ్చిన పవన్‌ కంటే… గెలిచాక చూసుకుంటానన్న జగన్‌తో ముద్రగడ షేక్‌హ్యాండ్‌ ఇచ్చేందుకు రెడీ అయినట్లు సమాచారం.

ఇక ముద్రగడ చేరికను అదనపు బలంగా భావిస్తోంది వైసీపీ. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు పద్మనాభం చేరిక ఉపయోగపడుతుందన్న ఆలోచనతో ఉంది. అలాగే పవన్‌కల్యాణ్‌కు కాపు ఓట్లు దూరమయ్యే అవకాశం ఉందన్న యోచనతో ముద్రగడతో మంతనాలు జరిపి వెల్‌కమ్‌ చెప్పిందీ వైసీపీ.

మొత్తంగా… ముద్రగడ వైసీపీలోకి ఎంటరవ్వడంతో… ప్రతిపక్ష కూటమికి కోనసీమ ప్రాంతంలో కొంత ఎదురుదెబ్బ తగిలినట్టే అంటున్నారు విశ్లేషకులు. మరి ముద్రగడ ఎవరికి చెరుకుగడ అని తెలియాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే…

Also read

Related posts

Share via