April 19, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

Vizag: తలకు 40 కుట్లు.. ఒళ్లంతా గాయాలు.. ఇదేనరా ప్రేమంటే..



ప్రేమంటూ వెంటపడ్డాడు. ఇష్టం లేదన్నా విన్పించుకోలేదు. కాదన్నా కనికరించలేదు. దగ్గరకు రానీయకపోవడంతో పగతో రగిలిపోయిన ఉన్మాది బరితెగించాడు. యువతిపై దాడికి తెగబడ్డాడు. ఈ ఘటన ప్రస్తుతం విశాఖపట్నంలో సంచలనంగా మారింది.


ఉన్మాదులు రెచ్చిపోతున్నారు. ప్రేమిస్తే సరి.. లేదంటే ఉరే అన్నట్టుగా చెలరేగిపోతున్నారు. మెదక్‌ సంఘటన మరిచిపోకముందే.. గురువారం విశాఖ జిల్లాలో అదే సీన్‌ చోటు చేసుకుంది. తన ప్రేమను అంగీకరించలేదన్న కోపంతో యువతిపై దాడికి దిగాడో సైకో. యువతి ఇంటికెళ్లి మరీ రాడ్డుతో ఎటాక్‌ చేశాడు. విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం బీసీ రోడ్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది.


కొన్నాళ్లుగా నీరజ్‌ అనే వ్యక్తి యువతి వెంట పడుతున్నాడు. ప్రేమిస్తున్నానంటూ వేధిస్తున్నాడు. సదరు యువతి ఇష్టం లేదని చెప్పినా పట్టించుకోలేదు. చివరకు విషయాన్ని ఇంట్లో చెప్పింది యువతి. యువతి కుటుంబసభ్యులు ఓంశాంతి ఆశ్రమానికి తరచుగా వెళ్తుంటారు. అక్కడే యువతికి పరిచమయ్యాడు నీరజ్‌. అప్పట్నుంచీ ప్రేమించాలంటూ బలవంతం చేశాడు. అంగీకరించకపోవడంతో యువతిని బ్లాక్‌మెయిల్‌ చేశాడు. యువతి ఫొటోల్ని మార్ఫింగ్‌ చేసి అమ్మాయి కుటుంబసభ్యులకు పంపాడు. మార్ఫింగ్‌ న్యూడ్‌ ఫొటోలు, బూతు వీడియోలు పంపడంతో యువతి తీవ్రంగా కలత చెందింది. ఈ ఘటనపై సైబర్‌ క్రైమ్‌కు ఫిర్యాదు చేశారు యువతి తరఫు బంధువులు. ఎంతకూ అమ్మాయి లొంగకపోవడంతో చంపాలని డిసైడయ్యాడు నీరజ్‌. రాడ్డు తీసుకొని స్వయంగా ఇంటికెళ్లిన నీరజ్‌ యువతి తలపై మోదాడు. వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. నీరజ్‌ దాడిలో అమ్మాయికి తీవ్రగాలయ్యాయి. నీరజ్‌ను కఠినంగా శిక్షించాలని యువతి తండ్రి కోరుతున్నారు.

అమ్మాయి రెండు చేతులు ఫ్రాక్చర్‌ అయ్యాయని చెబుతున్నారు వైద్యులు. శరీరంపై తీవ్ర గాయాలయ్యాయని, మరో 24 గంటలు గడిస్తే కాని ఏమీ చెప్పలేమంటున్నారు. నీరజ్‌ లాంటి సైకోలు ఊరికొకరు తయారయ్యారు. ఇలాంటి ఉన్మాదులపై ఉక్కుపాదం మోపితేనే ఈ తరహా ఘటనలకు ఫుల్‌స్టాప్‌ పెట్టొచ్చు.

Also read

Related posts

Share via