April 16, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

సీఎం జగన్‎పై రాయి దాడి కేసులో కొత్త ట్విస్ట్.. అనుమానితుడిని వదిలేసిన పోలీసులు.. అసలు కారణం ఇదే..

సీఎం జగన్‎పై రాయి దాడి కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. నిందితుడుగా అనుమానిస్తూ విచారణకు తీసుకెళ్లిన దుర్గారావును వదిలి పెట్టారు పోలీసులు. ఈ కేసుకు ఆయనకు ఎలాంటి సంబంధం లేదని తెలిసి అర్ధరాత్రి ఇంటి వద్ద విడిచి పెట్టారు. మేమంతా సిద్దం బస్సుయాత్ర విజయవాడలో సాగుతున్న సమయంలో సీఎం జగన్ పై రాళ్ల దాడికి పాల్పడ్డారు కొందరు ఆగంతకులు. దీనిపై వెంటనే స్పందించిన ఉన్నతాధికారులు 20 ప్రత్యేక పోలీసు బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేపట్టాయి. సెల్ ఫోన్ లొకేషన్, కాల్ డేటా, ఘటనా స్థలంలో సేకరించిన మూడు రాళ్లపై ఉన్న వేలిముద్రలు అధారంగా దర్యాప్తు చేపట్టాయి. ఇందులో ఏ1గా సతీష్ అనే యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రస్తుతం సతీష్‌ నెల్లూరు సెంట్రల్ జైలులో జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నారు.

అయితే సతీష్ రిమాండ్ రిపోర్ట్‎లో A2 ప్రోద్బలం తోనే దాడి చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. దీంతో ఏ2 ఎవరన్న కోణంలో విచారణ వేగవంతం చేశారు. అందులో భాగంగానే అనుమానితుడుగా ఉన్న దుర్గారావును విచారణకు తీసుకెళ్లారు. అయితే విచారణ తరువాత అతనికి ఈ ఘటనకు ఎలాంటి సంబంధం లేదని భావించిన పోలీసులు శనివారం అర్థరాత్రి ఆయనను తన ఇంటివద్ద వదిలేసి వెళ్లిపోయారు. దీనిపై పోలీసులు స్పందిస్తూ కేవలం విచారణ నిమిత్తం దుర్గారావును తీసుకెళ్లామని ఎలాంటి సంబంధం లేదని తెలిసి వదిలిపెట్టామని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఏ2 ఎవరా అన్న దానిపై ప్రస్తుతం ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే విచారణ ముమ్మరం చేశామని త్వరలోనే ఈ హత్యకు ఉసిగొల్పిన వారిని పట్టుకుంటామంటున్నారు పోలీసులు

Also read

Related posts

Share via