April 15, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

అక్రమ సంపాదనకు కేరాఫ్ అడ్రస్‌..ఆయన ఆస్తులు చూస్తే కళ్లు చెదరాల్సిందే!

 

ఆయన ఓ పంచాయతీ కార్యదర్శి. ఆయన ఆస్తుల విలువ చూస్తే బైర్లు కమ్మాల్సిందే. అలా ఉంది మరి మనోడి సంపాదన. ఇతని ఆస్తులు చూసి ఏసీబీ అధికారులే షాక్ అయ్యారు. గత ఫిబ్రవరి 28న చంద్రగిరి పంచాయతీ కార్యాలయంలో జరిగిన ఏసీబీ సోదాల్లో ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు మహేశ్వరయ్య అనే పంచాయతీ కార్యదర్శి. దీంతో మహేశ్వరయ్యపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.


లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా దొరకడంతో  తిరుపతి రూరల్ మండలం పేరూరు లోని మహేశ్వరయ్య నివాసం అయిన ఏకదంత ఎన్ క్లేవ్‌తో  పాటు అతని బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. మహేశ్వరయ్యకు భారీగా అక్రమాస్తులు ఉన్నట్టు గుర్తించారు. భూములకు సంబంధించిన పలు కీలక డాక్యుమెంట్స్‌తో పాటు తిరుపతిలోని ఇంటి స్థలాలు, రెండు ఫ్లాట్లు, 2 కార్లు, కేజీకి పైగా బంగారు నగలు, 2 కిలోల వెండితో పాటు రూ.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

మహేశ్వరయ్యకు బినామీ పేర్లతో కూడా ఆస్తులు ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. గంగవరంలో ఫామ్ హౌస్, బెంగళూరులో బినామీ పేర్లతో అపార్ట్‌మెంట్, బద్వేల్ లో అత్త పేరుతో వ్యవసాయ భూములు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటితో పాటు పలమనేరులోని సాయినగర్‌లో షాపింగ్ కాంప్లెక్స్, జీ ప్లస్ 2 బిల్డింగ్, గంగవరం మండలం కూర్నిపల్లి వద్ద ఉన్న ఓ ఫామ్ హౌస్, పక్కనే నాలుగున్నర ఎకరాల వ్యవసాయ భూమి కూడా ఉన్నట్టు అధికారులు గుర్తించారు.అయితే సోదాల్లో ఇప్పటి వరకు గుర్తించిన ఆస్తుల విలువ దాదాపు రూ. 30 కోట్లకు పైగానే ఉండొచ్చని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు.

Also read

Related posts

Share via