SGSTV NEWS
Andhra PradeshCrime

ఆఫర్ లెటర్ పట్టుకుని రాష్ట్ర సచివాలయానికి వెళ్లిన యువకులు.. అసలు విషయం తెలిసి షాక్!

రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ లక్షల రూపాయలు కాజేసిన ఘరానా మోసం విజయనగరం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఉద్యోగాల పేరిట ఆశ చూపిస్తూ ఫోన్ స్టేటస్ పెట్టి యువతను మోసం చేసిన ఓ ముఠాను విజయనగరం వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్.కోట మండలం ధర్మవరం గ్రామానికి చెందిన వినోద్ అనే బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టగా ఈ మోసం వెనుక ఉన్న అసలు గుట్టురట్టు అయ్యింది.

హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, జంగారెడ్డిగూడెం, విజయనగరం జిల్లాల నుంచి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న పలువురు నిరుద్యోగ యువకుల నుంచి ఈ ముఠా ఒక్కొక్కరి వద్ద 5 నుంచి 8 లక్షల రూపాయల వరకు వసూలు చేసింది. బాధితులకు నకిలీ కంపెనీ అపాయింట్‌మెంట్ లెటర్లు, ఐడీ కార్డులు ఇచ్చి మోసం చేశారు. ఈ ముఠాలోని కీలక వ్యక్తి సుజిత్ నిరుద్యోగ యువతను అమరావతిలోని సచివాలయం వద్దకు తీసుకెళ్లి, అక్కడ తనకు అందరితో పరిచయాలున్నాయని నమ్మించాడు. అక్కడ వారం రోజుల పాటు వారిని ఉంచి, భోజనాలు పెట్టించి, నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లు ఇచ్చి ఉద్యోగాలు ఖాయమని బాధితులను నమ్మించాడు.

అయితే అపాయింట్‌మెంట్ లెటర్లలో ఉన్న అడ్రస్‌ను సంప్రదించగా, అవి నకిలీవని తేలడంతో బాధితులు మోసపోయినట్లు గుర్తించారు. దీంతో వారు విజయనగరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, వన్ టౌన్ సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలోనే ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. పక్కా ఫ్లాన్‌తో ఈ కేసులో విజయనగరం జిల్లాకు చెందిన మహేష్, జంగారెడ్డిగూడెంకు చెందిన రుబీ, ఏలూరుకు చెందిన జాన్, యాకుబ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు విజయనగరం ప్రదీప్ నగర్‌కు చెందిన సుజిత్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీస్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఈ ముఠా నిరుద్యోగుల వద్ద దాదాపు 50 లక్షల రూపాయలను వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

Also read

Related posts

Share this