డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. అల్లారుముద్దుగా పెంచుకున్న తన పెంపుడు చిలుక కనిపించకుండా పోవడంతో ఓ యజమాని తీవ్ర ఆవేదనకు గురవుతున్నాడు. మూడేళ్లుగా కంటికి రెప్పలా కాపాడుకున్న చిలుక ఆచూకీ కోసం కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలానికి చెందిన యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. కాట్రేనికోనలో వస్త్ర దుకాణం నిర్వహిస్తున్న కొత్తపాలెం గ్రామానికి చెందిన బండారు దొరబాబుకు పక్షులంటే ఎంతో అభిమానం. ఈ క్రమంలోనే మూడేళ్ల క్రితం హైదరాబాద్లో రూ.80 వేల వెచ్చించి ఓ ప్రత్యేకమైన మాట్లాడే చిలుకను కొనుగోలు చేశారు. దానికి ‘చార్లి’ అని పేరు పెట్టి కుటుంబ సభ్యుడిలా ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నారు. మనుషుల మాటలను స్పష్టంగా అనుకరిస్తూ పలకరించే ఆ చిలుక దొరబాబుకు ప్రాణప్రదంగా మారింది.
ఇటీవల సంక్రాంతి పండుగ రోజున చిలుక పంజరాన్ని శుభ్రం చేస్తున్న సమయంలో ‘చార్లి’ బయటకు వచ్చి ఒక్కసారిగా ఎగిరిపోయింది. తనతో బాగా అలవాటు పడిన చిలుక కావడంతో సాయంత్రానికి తిరిగి వస్తుందని దొరబాబు భావించాడు. కానీ అది తిరిగి రాలేదు. రోజులు గడిచినా, ఎన్ని చోట్ల వెతికినా చిలుక ఆచూకీ లభించకపోవడంతో దొరబాబు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. చిలుక కనిపించకుండా పోయిన విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఊరంతా వెతికిన దొరబాబుకు, సమీప ఇంటివారే చిలుకను బంధించారని స్థానికుల ద్వారా సమాచారం అందింది. చిలుకను తిరిగి ఇవ్వాలని, అవసరమైతే డబ్బులు కూడా ఇస్తామని దొరబాబు వారిని వేడుకున్నట్లు తెలిపారు. అయితే వారు చిలుక కొంతసేపటికి ఎగిరిపోయిందని చెబుతూ మాటలు తప్పిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
తన అపురూపమైన చిలుకను సమీపంలోని వారే బంధించారని నమ్ముతున్న దొరబాబు, చిలుకను తిరిగి అప్పగించాలంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్లో రూ.80 వేల విలువతో కొనుగోలు చేసిన మాట్లాడే చిలుక ‘చార్లి’ తిరిగి దొరబాబుకు చేరుతుందా? లేక ఈ ఘటన మరో మలుపు తిరుగుతుందా? అన్నది ఇప్పుడు స్థానికంగా ఆసక్తికరంగా మారింది.
Also read
- Garuda Purana: మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? గరుడ పురాణం ప్రకారం స్వర్గం, నరకం, వైకుంఠం రహస్యాలు
- సూర్యాస్తమయం తర్వాత ఈ 6 వస్తువులు కొనొద్దు.. లక్ష్మీదేవి అనుగ్రహానికి దూరమవుతారా? వాస్తు ఏం చెబుతోంది?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ఎంతకు తెగించార్రా.. మఫ్టీ పోలీసుల పేరుతో రైతుల నిలువుదోపిడీ.. కట్ చేస్తే..
- అర్థరాత్రి ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్ధాలు.. అనుమానం వచ్చి ఉదయం వెళ్లి చూడగా.. వామ్మో





