నాగుల చవితి రోజున భక్తులకు నిజంగానే నాగదేవత దర్శనమిచ్చినట్టు అనిపించే అద్భుతం శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. పలాస తాలూకా.. శాసనం కాలనీలో పుట్ట వద్ద భక్తులు పాలు, గుడ్లు సమర్పిస్తుండగా పుట్టలోనుంచి నాగుపాము బయటకు వచ్చి పాలను తాగింది. ఈ దృశ్యం చూసిన భక్తులు ఆనందంతో ఉప్పొంగిపోయారు.
నాగుల చవితి అంటే హిందువులకు ఓ పండగ దినం. ఆ పర్వదినం రోజున అంతా కుటుంబంతో సహా పుట్ట వద్దకు వెళ్లి నాగ దేవతకు పూజలు చేస్తారు. తెలిసో తెలియకో ఎప్పుడైన నాగు పాము విషయంలో ఏమైనా తప్పుగా ప్రవర్తించి ఉంటే మన్నించమని వేడుకుంటారు. అలాగే నాగ దేవత కటాక్షం ఉంటే ఆ కుటుంబంలో సంతాన సమృద్ధి కలుగుతుందని భావిస్తారు. అందుకే పుట్ట వద్ద నాగుల చవితి రోజున ముగ్గులు వేసి దీపం వెలిగించి, పాలు, గుడ్లు, చలివిడితో పాటు నువ్వులు ,బెల్లంతో ప్రత్యేకంగా చేసిన పదార్థాన్ని నైవేద్యంగా పెడతారు. వస్త్రాన్ని సమర్పిస్తారు. ఇంత చేసినా ఆ పుట్టలో పాము ఉందో లేదో తెలియని పరిస్థితి. పుట్టలో పాము లేకపోయినా అందులో పాము ఉందని భావించే పుట్ట వద్ద పూజలు చేస్తారు. ఇక నాగుల చవితి రోజున ఎవరికైనా పొలాలలో గాని, కాలువ గట్లుపై గాని, రోడ్డుపై గాని నాగుపాము కనిపిస్తే ఇక వారి ఆనందానికి అవధులు ఉండవు. నాగుల చవితి రోజున సాక్షాత్తు నాగ దేవతే తనపై కరుణించి దర్శన భాగ్యం కల్పించారని ఉబ్బితబ్బిబ్బవుతారు.
శనివారం సరిగ్గా నాగుల చవితి పర్వదినం రోజున శ్రీకాకుళం జిల్లాలో ఇలాంటి అద్భుతమే ఒకటి జరిగింది. జిల్లాలోని పలాస మున్సిపాల్టీ పరిధిలోని శాసనం కాలనీలో నాగులచవితి సందర్భంగా భక్తులకు నాగు పాము కనిపించింది. నాగులచవితి పర్వదినం సందర్భంగా శనివారం ఉదయం స్థానికంగా ఓ చెట్టు కింద ఉన్న పుట్ట వద్ద భక్తులు చాలా భక్తిశ్రద్ధలతో నాగేంద్ర స్వామికి పాలు, గుడ్లు వేసి పూజలు చేస్తుండగా కాసేపటికి అదే పుట్టలో నుంచి బుసలు కొడుతూ నాగు పాము బయటకు వచ్చింది. అది చూసిన భక్తులు సంబ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. మొదట బయటకు వద్దామా వద్దా అన్నట్టు పుట్టలో నుంచి తలను బయటకు పెట్టి అటు ఇటూ చూసిన పాము కాసేపు అంతా సైలెంట్‌గా ఉండేసరికి నెమ్మదిగా బయటకు వచ్చింది. పుట్ట వద్ద భక్తులు పెట్టిన పాలను సైతం తాగి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో అవాక్కయిన భక్తులు భక్తి భావంతో నాగుపాముకి దండంపెట్టి తామంతా అదృష్టవంతులమంటూ మొక్కుకున్నారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో ఇపుడు వైరల్ అవుతుంది. భక్తిశ్రద్ధలతో పుట్ట ప్రాంగణాన్ని శుభ్రం చేసి, పసుపు, కుంకుమ సమర్పించి, పుట్ట వద్ద గుడ్లు, పాలు వేసి పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు భక్తులు.
పాములు నిజంగా పాలను తాగుతాయా..?
వాస్తవానికి పాములు పాలు తాగవని నిపుణులు చెబుతున్నారు. పాలను జీర్ణం చేసుకునే శరీర నిర్మాణం, జీర్ణ వ్యవస్థ వాటికి ఉండదంటున్నారు. ఎక్కువగా దాహంతో ఉన్నప్పుడు లేదా చల్లని ద్రవాన్ని నోటికి దగ్గర పెట్టినప్పుడు పాము పాలను తాగుతున్నట్టు కనిపించవచ్చు. కానీ పాలు చల్లగా ఉండడం వల్ల నాలుకతో తాకుతాయి అని అంటున్నారు. ఆహారం విషయానికి వస్తే, పాములు మాంసాహారులు. అవి ఎలుకలు, బల్లి, గుడ్లు, చిన్న పక్షులు వంటివి తింటాయి. పాలను మాత్రం అసలు తాగవు, తాగితే ఆరోగ్యానికి హానికరం కూడా. నాగుల చవితి వంటి సందర్భాల్లో పాములు పాలు తాగుతున్నట్టు కనిపిస్తే, అది దాహం కారణం అయి ఉండవచ్చు. లేదా మన భ్రమ మాత్రమే. శాస్త్రీయంగా పాములు పాలను తాగవు అన్నది నిపుణుల వెర్షన్.
Also read
- Sabarimala Gold Case: శబరిమల గోల్డ్ కేసు దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. బళ్లారిలో పట్టుబడిన బంగారం..
- Telangana: ఇద్దరు బంగారు తల్లులతో నీ కడుపు పండితే.. ఎందుకమ్మా ఈ కఠిన నిర్ణయం
- Telangana: ఫోటో చూసి బుద్దిమంతుడు అనుకునేరు.. చేసేవి పోరంబోకు పనులు.. మ్యాటర్ తెలిస్తే
- Andhra: నాగులచవితి రోజున ఏపీలో అద్భుతం.. ఈ దృశ్యాలు చూస్తే పుణ్యం మీ సొంతం..
- Telangana: పగలు పద్దతిగా కస్టమర్ క్యారెక్టర్.. రాత్రి మంకీ క్యాప్ ధరించి.. అతడు ఏం చేశాడంటే.?





