SGSTV NEWS
Andhra PradeshCrime

Andhra: రాత్రికి రాత్రే శవాన్ని పూడ్చిపెట్టారు.. తెల్లారే భోజనాలు పెట్టారు.. ట్విస్ట్ ఏంటంటే..

విజయనగరం జిల్లాలోని పూసపాటిరేగ మండలం కోనాడలో బొడ్డు భూలోక అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. బొడ్డు భూలోక మృతి ఇప్పుడు జిల్లాలో కలకలం రేపింది. మృతుడు భూలోక, భూలోకమ్మ దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉనారు. భూలోక భార్య భూలోకమ్మ గత రెండు సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. భూలోకమ్మ మరణంతో ముగ్గురు పిల్లల ఆలనాపాలనా చూడటం భూలోకకి కష్టతరంగా మారింది. దీంతో ముగ్గురు పిల్లలు ప్రభుత్వ హాస్టల్స్‌లో ఉండి చదువుకుంటున్నారు. ఈ క్రమంలోనే వేసవి సెలవులు కావడంతో ముగ్గురు పిల్లలు తండ్రి వద్దకు వచ్చి ఉంటున్నారు. అయితే భూలోక మద్యానికి బానిసై నిత్యం మద్యమత్తులో ఉంటున్నాడు.. మద్యం తాగి పిల్లలను కూడా దుర్భషలాడుతుంటాడు. అలా శనివారం రాత్రి కూడా మద్యం మత్తులో ఇంటికి వచ్చిన భూలోక తనతో తెచ్చిన చేపలను పెద్దకూతురు అనూషకు ఇచ్చి వండమని చెప్పాడు. కూరకు కావలసిన సరుకులు కొనడానికి వంద రూపాయలు ఇచ్చి షాప్ కి వెళ్లి తీసుకురమ్మని చెప్పాడు. అలా షాప్ కి వెళ్లి వచ్చిన అనూష తండ్రికి డబ్బు లెక్కసరిగా చెప్పలేకపోవడంతో ఆమెను దుర్భాషలాడటం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే అటుగా వచ్చిన అనూష మేనమామ సూరిబాబు చూసి ఎందుకు ఎప్పుడు పిల్లలను తిడతావని భూలోకతో గొడవపడి అక్కడ నుండి వెళ్ళిపోయాడు.


అయితే తనతో గొడవపడ్డ సూరిబాబు పై పగతో రగిలిపోయిన భూలోక మరోసారి మద్యం తాగి సూరిబాబు వద్దకు వెళ్లి కర్రతో దాడి చేసి తలపగలకొట్టాడు. దీంతో సూరిబాబు ఆసుపత్రి పాలయ్యాడు. ఇదే విషమాన్ని తెలుసుకున్న సూరిబాబు బంధువులు బొడ్డు చిన భూలోక, బొడ్డు అశోక్, బొడ్డు అప్పలస్వామిలు భూలోక వద్దకు వెళ్లి అతని పై దాడి చేశారు. దీంతో మనస్తాపానికి గురైన భూలోక రాత్రి పది గంటల సమయంలో ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. ఆ సమయంలో ప్రక్కనే ఉన్న భూలోక బంధువులు మందలించి ఆత్మహత్య చేసుకుంటున్న భూలోకను కాపాడారు. అనంతరం భూలోక వద్దకు వచ్చి భూలోక తండ్రి కొంతసేపు మాట్లాడి అనంతరం అర్ధరాత్రి రెండు గంటల వరకు మద్యం తాగి పడుకున్నారు.

ఆ మరుసటి రోజు తెల్లవారుజామున నూకరాజు అనే కాంట్రాక్టర్ వచ్చి భూలోకను తనతో పాటు పనికి తీసుకెళ్ళటానికి వచ్చి పిలిచాడు. అయితే భూలోక పలకకపోవడంతో ఇంట్లోకి వెళ్లి చూడటంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని కనిపించాడు. దీంతో నూకరాజు వెంటనే భూలోక కుటుంబసభ్యులకు చెప్పడంతో వారంతా వచ్చి భూలోక మృతదేహాన్ని క్రిందకి దించి ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు నిర్ధారణకు వచ్చారు. అయితే భూలోక కుటుంబసభ్యుల మూఢనమ్మకం గ్రామస్తుల అలజడికి దారితీసింది. అర్ధరాత్రి చనిపోయిన వ్యక్తిని రాత్రికి రాత్రే అంత్యక్రియలు చేయాలని, అలా కాకుండా తెల్లవారి అంత్యక్రియలు చేస్తే అరిష్టమని భావించారు. దీంతో భూలోక తండ్రి భూలోక మృతదేహాన్ని రాత్రికి రాత్రే అంత్యక్రియలు చేసి తెల్లవారిన తరువాత చావు భోజనాలు కూడా పెట్టారు.


అంతవరకు బాగానే ఉన్నా ఆ తరువాత రోజు ఉదయం భూలోక తండ్రి అప్పన్న భూలోక మృతి పై అనుమానాలు ఉన్నాయని, భూలోకది హత్య కావచ్చని, అందుకు కారణమైన వారి పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు మేరకు గ్రామానికి చేరుకున్న పోలీసులు పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికితీసి అనంతరం పోస్ట్ మార్టం చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు పలు కోణాల్లో విచారించారు.

భూలోకకు అప్పు ఇచ్చిన కాంట్రాక్టర్ నూకరాజు తన డబ్బులు తనకు ఇవ్వమని హెచ్చరించడంతో చేసేదిలేక నూకరాజు, భూలోక తండ్రి కలిసి కొత్త ఎత్తు వేశారు.. భూలోక పై దాడి చేసిన సూరిబాబు, అతని బంధువులు పై కేసు పెడితే రాజీ పడటానికి కొంత డబ్బు ఇస్తారని, ఆ డబ్బుతో నూకరాజు అప్పు తీర్చవచ్చని ప్లాన్ చేసి సూరిబాబు, చిన భూలోక, అశోక్ ల పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు గుర్తించారు. చివరికి భూలోక ఆత్మహత్య చేసుకుని మృతిచెందినట్లు పోలీసులు నిర్ధారించారు. దీంతో భూలోక బంధువులు ఊపిరి పీల్చుకున్నారు.

Also read

Related posts

Share this