అనంతపురం జిల్లా ఉరవకొండలో ఓ విచిత్రమైన ఫిర్యాదు పోలీసులను నవ్వుల్లో ముంచెత్తింది. నిత్యం తీవ్రమైన కేసులతో సతమతమయ్యే పోలీసులకు ఈసారి కజ్జికాయల పంచాయితీ తలనొప్పిగా మారింది. గవిమఠం చంద్రమౌళీశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా సంప్రదాయం ప్రకారం బంధువులను ఇంటికి ఆహ్వానించి మర్యాదలు చేసే ఆచారం ఉంది. అలానే ఓ ఇంటికి ముగ్గురు అల్లుళ్లు వచ్చారు. అయితే పెద్దల్లుడు, రెండో అల్లుడికి ప్రత్యేకంగా కజ్జికాయలు పెట్టగా.. తనకు మాత్రం అదే స్థాయి మర్యాద చేయలేదని చిన్నళ్లుడు అలకపూనాడు. దీంతో అతను తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అత్తతో వాగ్వాదానికి దిగాడు. ఇంట్లో వాళ్లు ఎంత సర్దిచెప్పినా వినకపోవడంతో అత్త డయల్ 100కు కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న స్థానిక కానిస్టేబుల్ రాజగోపాల్ అక్కడికి చేరుకుని పరిస్థితిని వివరంగా తెలుసుకున్నారు. చిన్నల్లుడు తన ఆవేదనను వెల్లడిస్తూ “పెద్దల్లుళ్లకు కజ్జికాయలు పెట్టారు.. నాకు మాత్రం పెట్టలేదు. ఇదేం న్యాయం సార్..?” అని ప్రశ్నించాడు.
దీనిపై జోక్యం చేసుకున్న కానిస్టేబుల్ రాజగోపాల్ కుటుంబ సభ్యులకు హితవు పలుకుతూ ముగ్గురు అల్లుళ్లను సమానంగా చూడాలని సూచించారు. అంతేకాకుండా ఇంట్లో ఉన్న కజ్జికాయలను ముగ్గురికీ సమానంగా పంచి సమస్యను పరిష్కరించారు. అనంతరం అక్కడే ఓ సెల్ఫీ తీసుకుని ఉన్నతాధికారుల వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేస్తూ “చిన్నల్లుడికి కజ్జికాయలు పెట్టలేదట.. సమానంగా పంచి సమస్యను సర్దిచేశాను” అని రిపోర్ట్ పంపారు. ఆ పోస్టును చూసిన అధికారులు, సిబ్బంది నవ్వు ఆపుకోలేకపోయారు. “కనీసం నువ్వన్నా ఒక కజ్జికాయ తిన్నావా?” అంటూ సహచరులు కానిస్టేబుల్‌ను సరదాగా ఆటపట్టించారు. మొత్తానికి చిన్నల్లుడి మర్యాదల వివాదం.. పోలీసుల జోక్యంతో సర్దుకుపోయి నవ్వులు పూయించిన సంఘటనగా నిలిచింది.
Also read
- భార్య ఫోన్ ఎక్కువగా మాట్లాడుతుందనీ.. కత్తితో పొడిచి హతమార్చిన భర్త!
- Vizag: రాధా గాయత్రి మృతి కేసులో సంచలనం.. కీలక అప్ డేట్
- పద్దతిగా భర్తను గుడికి తీసుకెళ్లింది.. బాయ్ ఫ్రెండ్‌తో కలిపి లేపేసింది.. ఏపీలో సంచలనం
- Garuda Purana: మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? గరుడ పురాణం ప్రకారం స్వర్గం, నరకం, వైకుంఠం రహస్యాలు
- సూర్యాస్తమయం తర్వాత ఈ 6 వస్తువులు కొనొద్దు.. లక్ష్మీదేవి అనుగ్రహానికి దూరమవుతారా? వాస్తు ఏం చెబుతోంది?





