SGSTV NEWS
Andhra PradeshCrime

Vizag: ఆ కాంక్రీట్ కుప్ప నుంచి దుర్వాసన.. ఏంటా అని కదిలించి చూడగా..

విజయనగరం జిల్లా నంద బలకా గ్రామానికి చెందిన సూరన్న దొర, విశాఖలోని ముదపాక జగనన్న కాలనీలో హౌసింగ్ నిర్మాణ పనులకు వెళ్లి, కాంక్రీట్ రాళ్ల కుప్ప కింద మరణించాడు. అనుమానిత స్థితుల్లో జరిగిన ఈ ఘటనపై ఫిర్యాదు చేసిన సూరన్న భార్య గంగమ్మ, మరణానికి గల కారణాలపై దర్యాప్తు చేయాలని కోరింది. పోలీసులు ప్రాథమికంగా కాంక్రీట్ లోడు ప్రమాదవశాత్తు పడటమే కారణమని అనుమానిస్తున్నప్పటికీ ఇతర కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

విజయనగరం జిల్లా తెర్లాం మండలం నంద బలకా గ్రామానికి చెందిన పక్కి సూరన్న దొర.. పొట్టకూటి కోసం విశాఖ వచ్చాడు. తన సొంత ఊరివారితో కలిసి.. విశాఖ జిల్లా పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని ముదపాక జగనన్న కాలనీలో జరుగుతున్న హౌసింగ్ నిర్మాణ పనుల కోసం వచ్చాడు. అయితే ఈనెల నాలుగో తేదీ రాత్రి నుంచి సూరన్న దొర కనిపించకుండా పోయాడు. మరుసటి రోజు అక్కడ పనిచేస్తున్న మేస్త్రి… సూరన్న దొర భార్యకు ఫోన్ చేసి.. అతను కనిపించడం లేదన్న సమాచారం ఇచ్చాడు. సూరన్న దొర ఆధార్ కార్డు, ఫోటో తీసుకువచ్చి పెందుర్తి పోలీస్ లో ఫిర్యాదు చేయాలని సూచించ్చాడు.

అంతలోనే షాక్…!

అయితే.. ఇంకా సూరన్న దొర ఆచూకీ కోసం సహచరులు గాలిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో.. అక్కడే ఉన్న కాంక్రీట్ కుప్ప నుంచి దుర్వాసన రావడాన్ని స్థానికులు గుర్తించారు. దీంతో అంతా కలిసి కాంక్రీట్‌ను తొలగించే ప్రయత్నం చేశారు. కాంక్రీట్ రాళ్ల కుప్ప లోపల మృతదేహం కనిపించింది. మృతదేహం ఉబ్బిపోయి ఉంది. అది సూరన్నదేనని అనుమానించారు. దీంతో విషయాన్ని అక్కడున్న మేస్త్రి.. మళ్ళీ సూరన్న భార్య గంగమ్మకు ఫోన్ చేశాడు. “మీ భర్త కాంక్రీట్ రాళ్ల పోగు కింద పడి ఉన్నాడు” అంటూ అత్యవసరంగా రావాలని చెప్పాడు. వెంటనే ఆమె తన గ్రామస్తులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించింది. కాంక్రీట్ రాళ్ల పోగు కింద నలిగి ఉన్న మృతదేహం తన భర్తదేనని గుర్తించింది. తన భర్త మృతికి గల కారణాలపై దర్యాప్తు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది మృతుడి భార్య గంగమ్మ.


గంగమ్మ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. అయితే.. అనుమానిత స్థితుల్లో మృతుడు కాంక్రీట్ రాళ్లపై పడుకొని నిద్రిస్తూ ఉండగా.. అర్ధరాత్రి సమయంలో లోడు తీసుకు వచ్చిన లారీ…మృతుడిని గమనించకపోవడంతో ఆ లోడును అతని పైకి అన్లోడ్ చేసి ఉంటారని.. ఆ సందర్భంలో ఘటన జరిగి ఉండవచ్చునన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాంక్రీట్ రాళ్లు ఒక్కసారే పెద్ద మొత్తంలో పడడం వల్లే ప్రాణాలు కోల్పోయినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన పోలీసులు.. సూరి మరణానికి మరేదైనా ఇతర కారణాలు కూడా ఉండవచ్చని కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు

Also read

Related posts

Share this