SGSTV NEWS
Andhra PradeshCrime

Fire Accident at Orphanage: కొంపముంచిన మస్కిటో కాయిల్‌.. అనాథ పిల్లలు నిద్రిస్తుండగా షాకింగ్ ఘటన!



కృష్ణా జిల్లాలోని గన్నవరంలో ఉన్న ఒక ప్రైవేట్ అనాథ శరణాలయంలో మంగళవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు బాలురు గాయపడ్డారు. మరో ఇద్దరు ఆసుపత్రి పాలయ్యారు. తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో పిల్లలు నిద్రిస్తున్న రూరల్ ఎడ్యుకేషన్ అండ్ కంపాషనేట్ హెల్ప్స్ (రీచ్)లో అగ్ని ప్రమాదం సంభవించింది..

గన్నవరం, ఫిబ్రవరి 19: దోమల నివారణ కోసం వెలిగించిన మస్కిటో కాయిల్‌ ఊహించని ప్రమాదాన్ని సృష్టించింది. మస్కిటో కాయిల్ నిప్పు పరుపులకు అంటుకొని అనాథాశ్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కృష్ణా జిల్లా గన్నవరం శివారులోని రీచ్‌ విద్యా సంస్థల ప్రాంగణంలోని లిటిల్‌ లైట్స్‌ హోమ్‌లో సోమవారం అర్ధరాత్రి ఈ షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో అనాథ ఆశ్రమంలోని నలుగురు బాలురు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఇద్దరికి పొగ కారణంగా ఊపిరాడక ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. పోలీసులు, అగ్నిమాపక అధికారులు తెలిపిన వివరాల మేరకు..

స్థానికంగా ఉన్న రెండు అంతస్థుల అనాథ ఆశ్రమం భవనంలో 3 నుంచి 10వ తరగతి వరకు మొత్తం 140 మంది విద్యార్థులు ఉంటున్నారు. 70 మంది విద్యార్థులున్న ఓ గదిలో తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో దోమల నివారణకు వెలిగించిన మస్కిటో కాయిల్‌ను ఓ విద్యార్థి తన పరుపు వద్ద ఉంచాడు. సీలింగ్‌ ఫ్యాన్‌ గాలికి అది వేగంగా కాలడంతో నిప్పురవ్వలు పరుపుపై పడ్డాయి. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. క్షణాల వ్యవధిలో పక్కనే ఆనుకొని ఉన్న పరుపులకు మంటలు ఎగబాకాయి. దీనికి తోడు ఫ్యాన్‌ గాలికి పొగ గదంతా వ్యాపించింది.

దీంతో విద్యార్థులు భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశారు. అప్రమత్తమైన నిర్వాహకులు, స్థానికులు అగ్నిమాపకశాఖ అధికారులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేర్చుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. లోపల గదిలో చిక్కుకున్న 28 మందిని బయటకు తీసుకువచ్చారు. ఈ ఘటనలో అఖిల్, ఉదయ్‌కిరణ్, సిద్ధార్థ, అఖిలేష్, తేజేశ్వర్, వినయ్‌ అనే నలుగురు విద్యార్ధులు స్వల్ప గాయాలయ్యాయి. వారిని విజయవాడ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించి, పిల్లలందరి ఆరోగ్యం నిలకడగా ఉండటంతో డిశ్చార్జ్ చేసి పంపించేశారు.


సంఘటనా స్థలాన్ని సందర్శించిన గన్నవరం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డిఎస్పీ) సిహెచ్. శ్రీనివాస్ మాట్లాడుతూ.. నలుగురు పిల్లలకు స్వల్ప కాలిన గాయాలు కాగా, ఇద్దరు ఊపిరాడక అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. దాదాపు డెబ్బై మంది విద్యార్థులున్న గదికి రాకపోకలకు ఒకటే ద్వారం కావడంతో ఎలా బయట పడాలో తెలియక లోపలే చిక్కుకుపోయారు. రాత్రి పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసులు మంటలను గమనించి గన్నవరం పోలీసులకు, అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారని తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు భవనంలో140 మంది పిల్లలు ఉన్నారని అనాథ శరణాలయ కరస్పాండెంట్ నెమలికంటి శైలజ తెలిపారు. స్థానికుల సహాయంతో పిల్లలందరినీ రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also read

Related posts

Share this