మద్యం మత్తులో పాఠశాలకు వచ్చిన కర్నూలు జిల్లా ముద్దటమాగి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల HM మద్యం మత్తులో విద్యార్ధులను చితక బాదాడు. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు సదరు హెచ్‌ఎమ్‌పై ఫిర్యాదు చేయడంతో డీఈవో సస్పెండ్ చేశారు. అంతేకాకుండా స్కూల్‌కు తాళం వేసి మూసివేశారు..
హొళగుంద, జనవరి 28: పాఠశాలకు వచ్చే విద్యార్ధులకు విద్యా బుద్ధులు నేర్పి క్రమశిక్షణ అలవర్చవల్సిన ఓ బాధ్యత కలిగిన ప్రభుత్వ టీచర్ రోడ్ సైడ్ పోకిరీలా చిల్లర వేషాలు వేశాడు. పాఠశాలకు తాగి రావడమే కాకుండా తనతోపాటు మద్యం బాటిల్స్ కూడా తీసుకొచ్చాడు. టాయిలెట్స్‌లోకి వెళ్లి బాటిల్ ఫుల్‌గా లేపేసి ఊగిపోతూ బయటికి వచ్చిన సదరు ఉపాధ్యాయుడు.. విద్యార్ధులను చితకబాదాడు. ఉపాధ్యాయ వృత్తికే కలంకం తెచ్చేలా ఉన్న ఇతగాడి ప్రవర్తనను చూసిన గ్రామస్థులు పాఠశాలకు తాళాలు వేసి, జిల్లా విద్యాధికారికి ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా హొళగుంద మండలం ముద్దటమాగి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
కర్నూలు జిల్లా హొళగుంద మండలం ముద్దటమాగి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జయరాజ్ అనే వ్యక్తి హెచ్‌ఎంగా విధులు నిర్వర్తిస్తున్నారు. మద్యం సేవించే అలవాటు ఉన్న జయరాజ్ సోమవారం పాఠశాలకు మద్యం మత్తులో వచ్చాడు. అంతేకాకుండా తనవెంట తెచ్చుకున్న మద్యం బాటిల్ తీసుకుని పాఠశాల టాయిలెట్‌లోకి వెళ్లి తాగసాగాడు. మద్యం బాటిల్ తీసుకుని వెళుతుండటాన్ని విద్యార్థులు గమనించి బాత్రూం దగ్గరకు వెళ్లి చూశారు. దీంతో ఆగ్రహించిన హెచ్‌ఎం జయరామ్.. కోపంతో ఊగిపోతూ ప్లాస్టిక్ పైప్‌తో విద్యార్థులను ఇష్టారీతిగా కొట్టాడు.
దీంతో కొందరు విద్యార్థులు ఈ విషయాన్ని గ్రామంలోని తమ తల్లిదండ్రులకు చెప్పారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని హెచ్‌ఎం తీరును తప్పుబట్టారు. మద్యం మత్తులో ఊగుతుండడాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఈవో 2 జగన్నాథం అక్కడికి చేరుకోవడంతో గ్రామస్తులు హెచ్‌ఎంపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా వెంటనే పాఠశాలకు తాళాలు వేశారు. ఈ నేపథ్యంలో సదరు హెచ్‌ఎంను జిల్లా విద్యాశాఖాధికారి శామ్యూల్‌పాల్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Also Read
- నేటి జాతకములు 4 ఫిబ్రవరి, 2025
- Andhra News: జర భద్రం.. ఒక్క ఫోన్ కాల్‌తో రిటైర్డ్ టీచర్ నుంచి రూ.36 లక్షలు కొట్టేశారు.. చివరకు
- వివాహేతర సంబంధాన్ని బయటపెట్టాడనే కోపంతో..
- పుట్టిన గంటకే భిడ్డకు దూరమైన తల్లి
- Vishnuja: జాబ్ లేదు.. అందం అసలే లేదు!