February 23, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

Andhra News: బ్యాంకులో తనఖా పెట్టిన బంగారం విడిపించుకునేందుకు వచ్చిన ఖాతాదారుడు.. కట్ చేస్తే



నాగలాపురం బ్యాంకులోఖాతాదారులు తమ అవసరాల కోసం నగలు కుదవపెట్టి, రుణం తీసుకున్నారు. అయితే తాజాగా బ్యాంకులో తాకట్టు పెట్టిన నగలు విడిపించుకునేందుకు ఓ ఖాతాదారుడు వచ్చారు. ఆ నగలపై అదనంగా రుణం ఉన్న విషయం తెలియడంతో పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో తీగ లాగితే డొంక కదిలింది.

తిరుపతి జిల్లాలో ఒక బ్యాంకులో బంగారు ఖాతాలకు కష్టోడియన్‌గా ఉండాల్సిన ఉద్యోగి.. ఆ గోల్డ్‌ను కాజేసాడు. ఏకంగా 67 ఖాతాలకు సంబంధించిన బంగారాన్ని వాడుకున్నాడు.  నాగలాపురం యూనియన్ బ్యాంక్ లో ఈ ఘటన జరిగింది. డిప్యూటీ మేనేజర్ సూర్య తేజ చేతివాటం బయటపడింది. బ్యాంకులోని గోల్డ్ లోన్ ఖాతాలపై కన్నేసి సొంత అవసరాలు తీర్చుకున్న సూర్య తేజ వ్యవహారంపై కేసు నమోదు అయ్యింది. ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారుపై కన్నేసిన సూర్యతేజ.. మాయగాడి అవతారం ఎత్తాడు. 2024 మే నుంచి 2025 ఫిబ్రవరి 10వ తేదీ వరకు బ్యాంకులో బంగారు నగలపై రుణాలు పొందినవారి బంగారు నగలను తీసి బయట వ్యక్తులకు ఇచ్చి తిరిగి అదే బ్యాంక్‌లో తనఖా పెట్టించాడు.

స్నేహితులు, తెలిసిన ఇతరుల పేరుతో అదే బ్యాంక్‌లో డిపాజిట్ చేసి గోల్డ్ లోన్స్ పొందిన సూర్యతేజ దాదాపు 67 ఖాతాలకు చెందిన గోల్డ్‌ను వాడుకున్నాడు. బ్యాంక్ లాకర్‌లోని 37 బ్యాగుల్లోని నగలను మొదటగా తీసుకుని అదే బ్యాంకులో తాకట్టు పెట్టిన సూర్య తేజ రూ 1.31 కోట్లు రుణం పొందాడు. మరో 30 బ్యాగుల్లో ఉన్న నగలను తీసుకెళ్లి నాన్ ఫైనాన్షియల్ ప్రైవేటు కంపెనీలలో తాకట్టు పెట్టాడు. అక్కడ రూ 1.04 కోట్ల సొమ్మును పొందాడు. ఇలా మొత్తం రూ 2.35 కోట్ల మేర ఖాతాదారుల బంగారు నగలను తాకట్టు పెట్టి కాజేసిన బ్యాంక్ డిప్యూటీ హెడ్ సూర్య తేజ నిర్వాకంపై అనుమానం వచ్చిన బ్యాంకు ఉన్నతాధికారులు.. తనిఖీ చేయగా ఈ యవ్వారం బయటపడింది. ఈ ఈమేరకు డీజిఎం బ్రహ్మయ్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు వ్యవహారం బయటకు వచ్చింది.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సూర్య తేజ బండారాన్ని బయటపెట్టారు. గోల్డ్ లోన్స్‌కు కస్టోడియన్‌గా ఉన్న సూర్య తేజ నేరానికి పాల్పడినట్లు గుర్తించారు. ఇంటి దొంగగా మారిన సూర్యతేజను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

Also read

Related posts

Share via