November 21, 2024
SGSTV NEWS
Andhra Pradesh

Vijayawada Floods: గండం తప్పింది..! నిర్విరామ కృషితో ఆపరేషన్‌ బుడమేరు సక్సెస్‌.. విజయవాడకు ఆగిన వరద..

వరదతో విజయవాడను వణికించిన బుడమేరు గండ్ల పూడ్చివేత సూపర్ సక్సెస్‌ అయ్యింది. నిన్న రెండు గండ్లని పూడ్చిన అధికార యంత్రాంగం.. ఇవాళ మూడో గండికి చెక్‌ పెట్టింది. మూడు గండ్లు పూడ్చివేతతో విజయవాడ ఊపిరి పీల్చుకుంటోంది. గండ్లు పూడ్చే వరకు బుడమేరుపై మకాం వేసిన మంత్రి నిమ్మల రామానాయుడు, పనులను పర్యవేక్షించిన మంత్రి లోకేష్‌తోపాటు అధికార యంత్రాగాన్ని సీఎం చంద్రబాబు అభినందించారు.

నాలుగు రోజుల నిర్విరామ కృషితో ఆపరేషన్ బుడమేరు విజయవంతమైంది. ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం కృషి ఫలించింది. బుడమేరు మూడు గండ్ల పూడ్చివేత సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్‌ కావడంతో బెజవాడ కాస్త ప్రశాంతంగా సేదతీరుతోంది. ఎన్టీఆర్‌ జిల్లా కొండపల్లి శాంతినగర్‌ దగ్గర బుడమేరుకు పడ్డ మూడో గండి పూడింది. నాలుగురోజుల పాటు ఆర్మీ సిబ్బంది నిర్విరామంగా కృషి చేసి గండిని పూడ్చారు. ఇటీవల కురిసిన భారీ వరదలతో బుడమేరుకు మూడు గండ్లు పడ్డాయి. బుడమేరుకు గండ్లు పడడంతోనే విజయవాడలోని పలు కాలనీలను వరద ముంచెత్తింది. అయితే.. వాన తగ్గిన వెంటనే అలెర్ట్‌ అయిన ఏపీ ప్రభుత్వం.. విజయవాడ వరద విలయానికి కారణమైన బుడమేరు గండ్లపై ప్రత్యేక దృష్టి పెట్టింది. మూడు గండ్లు పడినట్లు గుర్తించి.. నాలుగు రోజుల పాటు శ్రమించి.. ఆ మూడింటినీ పూడ్చేలా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు.

రెండు గండ్లు వెంటనే పూడ్చగలిగినా.. మూడో గండి పూడ్చడం చాలెంజ్‌గా మారింది. 100 మీటర్ల వెడల్పుతో గండి పడటంతోపాటు.. పై నుంచి అంతకంతకు వరద పెరగడంతో పూడ్చడానికి నాలుగు రోజులు పట్టింది. మూడు గండ్లను పూడ్చివేయడంతో దిగువ ప్రాంతాలకు వరద ప్రవాహం తగ్గింది. ప్రధానంగా.. మూడో గండి పూడ్చివేతతో విజయవాడ సింగ్‌నగర్‌ వరద ప్రవాహానికి చెక్‌ పడింది. బుడమేరు మూడో గండిని పూడ్చేందుకు రంగంలోకి దిగిన ఆర్మీ అధికారులు.. వాటర్ బాస్కెట్ విధానం అనుసరించి సక్సెస్‌ అయ్యారు. దీనికోసం ఇనుప జాలీలతో కూడిన బుట్టలు ఉపయోగించారు. రెండు పొరల విధానంలో గండి పూడ్చే వ్యూహం అమలు చేశారు. బాస్కెట్‌లలో రాళ్లు నింపి గండికి అడ్డుకట్ట వేశారు. 4 మీటర్ల ఎత్తున కట్ట పోశారు. దాంతో.. బుడమేరు మూడో గండి దగ్గర వరద ప్రవాహం ఆగిపోయింది. మూడో గండి దగ్గర పూడ్చివేత పనులు ఒకవైపు ఏజెన్సీలు చేయగా.. మరోవైపు ఆర్మీ బృందం పూర్తి చేసింది. ఆర్మీ టీమ్‌లో చెన్నై, సికింద్రాబాద్‌కు చెందిన సుమారు 120 మంది జవాన్లు పాల్గొన్నారు. విజయవాడ వరద ముంపుకు కారణమైన బుడమేరు పరిసర ప్రాంతాలను మంత్రి నారా లోకేష్‌ పరిశీలించారు. గండ్లు పడిన ప్రాంతాల్లో పూడిక పనులను పర్యవేక్షించారు.

ఈ ఆపరేషన్‌ బుడమేరును దగ్గరుండి పూర్తి చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు. నిద్రాహారాలు మాని బుడమేరు గట్టుపైనే మకాం వేశారు. సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ ఆపరేషన్‌ సక్సెస్ చేశారు. ఆయనతోపాటు మాజీ మంత్రి దేవినేని ఉమా కూడా పనులను పర్యవేక్షించారు. బుడమేరు మూడు గండ్ల పూడ్చివేత విజయవంతంగా పూర్తి కావడంతో హర్షం వ్యక్తం చేశారు మంత్రి నిమ్మల. ఇకపై విజయవాడను పూర్వ స్థితికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.


మొత్తంగా.. బుడమేరు గండ్లను పూడ్చివేయడంతో విజయవాడ ఊపిరిపీల్చుకుంటోంది. ఎట్టకేలకు ఫలితం దక్కడంతో బుడమేరు గండ్లు పూడ్చేందుకు శ్రమించిన వారందరిని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. సమిష్టి కృషి వల్లే గండ్ల పూడ్చివేత సాధ్యమైందని కొనియాడారు. బుడమేరు గండి పూడ్చామని.. ప్రస్తుతం విజయవాడకి వచ్చే ఇన్ ఫ్లో తగ్గింది. ఒక పక్క పడుతున్న వర్షం, పై నుంచి వచ్చే వరద అన్నీ ఎప్పటికిప్పుడు సమాచారం తెప్పించుకుని విశ్లేషిస్తున్నాం. వరద వల్ల కలిగిన అడ్డంకులు అన్నీ తొలగిస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.

Related posts

Share via