చిన్నపిల్లాడిలా చాక్లెట్ల కోసం మారాం చేసినట్టు.. బైక్ కోసం రోజూ తల్లిదండ్రులతో గొడవ పడుతున్నాడని స్థానికులు చెబుతున్నారు.
చిన్న చిన్న విషయాలకు యువత నిండు జీవితాలను ఆగం చేసుకుంటున్నారు. చిన్నపాటి మనస్పర్థలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా అనంతపురంలో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడి తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిల్చాడు. బైక్ కొనివ్వలేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని రొద్దం మండలం రాచూరు గ్రామానికి చెందిన శబరి(22) అనే యువకుడు తనకు బైక్ కావాలని గత కొద్ది రోజులుగా తల్లిదండ్రులను అడుగుతున్నాడు. వ్యవసాయం చేసుకుంటూ అరకొర ఆదాయంతో జీవనం సాగిస్తున్న తల్లిదండ్రులు కొడుకు కోరికను సున్నితంగా తిరస్కరించారు. తల్లిదండ్రులు కొడుకు శబరికి బైక్ కొనివ్వలేమని ఎంతో నచ్చచెప్పారు.
అయితే, గత కొద్ది రోజులుగా యువకుడు శబరి బైక్ కొనివ్వాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకొచ్చాడు. ఉన్న పళంగా బైక్ కొనివ్వమంటే అంత ఆర్థిక స్తోమత లేదని, బైక్ కొనివ్వలేమని కొడుకుకు తేల్చి చెప్పారు. దీంతో బైక్ కొనివ్వలేదన్న మనస్థాపంతో… క్షణికావేశంలో ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో శబరి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతనిని గమనించిన స్థానికులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.
చిన్నపిల్లాడిలా చాక్లెట్ల కోసం మారాం చేసినట్టు.. బైక్ కోసం రోజూ తల్లిదండ్రులతో గొడవ పడుతున్నాడని స్థానికులు చెబుతున్నారు. చదువు సరిగా అబ్బక.. సెంట్రింగ్ పని చేస్తున్న కొడుకు శబరి.. ఒక బైక్ కొనివ్వలేదని ఆత్మహత్య చేసుకోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Also read
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ముఖ్యమంత్రి చంద్రబాబు జలవిజన్ కు ఎన్నో ప్రశంసలు
- చాక్లెట్ ఆశచూపి బాలుడి కిడ్నాప్
- రేపే వివాహం.. ఇంతలోనే కాల్వలో గల్లంతు
- అమానుషం.. అర్ధరాత్రి కదులుతున్న ఆటో నుంచి రోడ్డుపై ఏదో విసిరేశారు! దగ్గరకెళ్లి చూడగా..





