సోషల్ మీడియాలో పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో పెళ్లి చేసుకోకుండానే సహజీవనం చేయాలని నిర్ణయించుకున్నారు. బిడ్డను కూడా కన్నారు. దీంతో పెళ్లి చేసుకోవాలని కోరినందుకు సదరు యువతిని ఇంట్లో నుంచి వెళ్తావా లేదా చస్తావా అంటూ వేధించడం ప్రారంభించాడు భాగస్వామి, అతడి కుటుంబ సభ్యులు. వారి వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య చేసుకుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరం బాపునగర్ ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సహజీవనం చేస్తున్న భాగస్వామి, అతని కుటుంబ సభ్యుల వేధింపులు తట్టుకోలేక 24 ఏళ్ల యువతి తన నివాసంలో ఆత్మహత్య చేసుకుంది.
పెళ్లి చేసుకోవాలని కోరినందుకు నిందితులు ఆమెను నిత్యం సూటిపోటి మాటలతో వేధించడమే కాకుండా, ఇల్లు విడిచి వెళ్లాలని లేదా చనిపోవాలని ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై మృతురాలి తల్లి నందాబెన్ రాథోడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాపునగర్ పోలీసులు కేసు నమోదు చేసి, ఆమె భాగస్వామి మయూర్ పర్మార్‌తో పాటు అతని తల్లిదండ్రులు మంజు, ప్రవీణ్, తమ్ముడు విశాల్‌లను అరెస్ట్ చేశారు.
ఇన్స్టాగ్రామ్ పరిచయంతో సహజీవనం..
పోలీసుల ఫిర్యాదు ప్రకారం, నందాబెన్ రాథోడ్ ఐదుగురు కుమార్తెలలో దక్షా పర్మార్ రెండో అమ్మాయి. 2021లో ఇన్స్టాగ్రామ్ ద్వారా దక్షాకు మయూర్‌తో పరిచయం ఏర్పడింది. 2023 జనవరిలో వీరిద్దరూ వివాహం చేసుకోకుండానే సహజీవనం చేయాలని నిర్ణయించుకుని మోర్బీ ప్రాంతానికి మారారు. కుమార్తె నిర్ణయంతో విభేదించిన తల్లి నందాబెన్, అప్పట్లో ఆమెతో సంబంధాలను తెంచుకున్నారు. ఆ తర్వాత 2024 ఏప్రిల్‌లో దక్షా ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది.
ఆరు నెలల తర్వాత తన కుమారుడు ఆనంద్ పుట్టిన విషయాన్ని దక్షా తల్లికి తెలియజేసింది. అప్పటికే దక్షా, మయూర్ అహ్మదాబాద్‌కు తిరిగి వచ్చి బాపునగర్‌లో నివసిస్తున్నారు. క్రమంగా తల్లితో మళ్లీ మాటలు కలిపిన దక్షా, తన భాగస్వామి, కుమారుడితో కలిసి తల్లి ఇంటికి వెళ్లి వస్తుండేది. సహజీవనం కాకుండా పెళ్లి చేసుకోవాలని నందాబెన్ కోరినప్పటికీ, మయూర్ ఏదో ఒక కారణం చెబుతూ వివాహాన్ని వాయిదా వేస్తూ వచ్చాడు.
నిత్యం గొడవలు, సూటిపోటి మాటలు
మయూర్, అతని కుటుంబ సభ్యులు తనను తీవ్రంగా వేధిస్తున్నారని దక్షా పలుమార్లు తన తల్లి వద్ద ఆవేదన వ్యక్తం చేసింది. 2025 మార్చిలో ఒకరోజు తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో మయూర్, అతని తల్లి మంజు, తండ్రి ప్రవీణ్, తమ్ముడు విశాల్ తనను తిట్టి ఇంటి నుంచి బయటకు గెంటేశారంటూ దక్షా తన కుమారుడితో కలిసి తల్లి ఇంటికి వెళ్లింది. కొన్ని రోజుల తర్వాత మయూర్ తల్లిదండ్రులు అక్కడికి వచ్చి దక్షాకు నచ్చజెప్పి తిరిగి తీసుకెళ్లారు. ఆ సమయంలో నందాబెన్ మళ్లీ పెళ్లి ప్రస్తావన తీసుకురాగా, భవిష్యత్తులో జరిగే సామూహిక వివాహాల వేడుకలో పెళ్లి జరిపిస్తామని వారు హామీ ఇచ్చారు.
అయినప్పటికీ వేధింపులు ఆగలేదు. మరోసారి మయూర్ తనను తీవ్రంగా కొట్టాడని దక్షా ఫోన్ చేసి చెప్పడంతో తల్లి ఆమెను ఇంటికి తీసుకొచ్చింది. అయితే, మయూర్ మళ్లీ వచ్చి తీసుకెళ్లడానికి ప్రయత్నించగా, కుమార్తె కాపురం నిలబడాలనే ఉద్దేశంతో నందాబెన్ ఆమెను సర్దిచెప్పి పంపించింది. తనకు దక్షా అంటే ఇష్టం లేదని మయూర్ చెబుతున్నాడని, ఇల్లు వదిలి వెళ్లాలని లేదా చనిపోవాలని అత్తింటి వారు నిత్యం వేధిస్తున్నారని దక్షా తన తల్లికి తెలిపింది.
ఆత్మహత్యకు ముందు చివరి ఫోన్ కాల్
అహ్మదాబాద్ ఏసీపీ ఆర్డీ దేశాయ్ తెలిపిన వివరాల ప్రకారం, నవంబర్ 15వ తేదీ ఉదయం దక్షా మయూర్ ఫోన్ నుంచి తన తల్లికి కాల్ చేసింది. మయూర్, అతని కుటుంబ సభ్యులతో గొడవ జరిగిందని, తనకు ఇష్టం లేదని, చనిపోవాలని, లేదంటే ఇల్లు వదిలి వెళ్లాలని మయూర్ అన్నట్లు తల్లికి చెప్పింది. మరుసటి రోజు తాను స్వయంగా వచ్చి వారితో మాట్లాడతానని, అప్పటివరకు ఓపిక పట్టాలని నందాబెన్ కుమార్తెకు ధైర్యం చెప్పింది.
కానీ, అదే రోజు రాత్రి 9 గంటల సమయంలో మయూర్ ఫోన్ చేసి దక్షా ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె సోదరి ఖుష్బూకు సమాచారం ఇచ్చాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన దక్షా ఇంటికి వెళ్లి చూడగా, ఆమె సీలింగ్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని విగతజీవిగా కనిపించింది. ఘటన జరిగిన సమయంలో దక్షా మరదలు ఇంట్లోనే ఉన్నట్లు ఏసీపీ వెల్లడించారు.
దక్షా, మయూర్ తమ కుమారుడు, మయూర్ కుటుంబ సభ్యులతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారని పోలీసులు తెలిపారు. పెళ్లి చేసుకోవాలని దక్షా పదేపదే కోరినప్పటికీ మయూర్ దాటవేస్తూ వచ్చాడని, ఈ విషయంలో నిత్యం గొడవలు, వేధింపులు జరిగాయని పేర్కొన్నారు. ఈ ఘటనపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 108, 54 కింద కేసు నమోదు చేసి మయూర్, అతని తల్లిదండ్రులు, సోదరుడిని అరెస్ట్ చేశారు. తల్లి మరణంతో రెండున్నరేళ్ల చిన్నారి ఆనంద్ ప్రస్తుతం అమ్మమ్మ నందాబెన్ సంరక్షణలో ఉన్నాడు.
Also read
- చిన్నారి కిడ్నాప్.. 12 గంటల్లోనే ఛేదించి తల్లి ఒడికి చేర్చిన పోలీసులు
- రిమాండ్ ఖైదీ విడుదల కోసం న్యాయమూర్తి సంతకం ఫోర్జరీ
- హైదరాబాద్ యువకుడు మృతి.. తుపాకీ ప్రమాదవశాత్తు పేలింది
- మళ్లీ వచ్చేశారు.. వణికిస్తున్న ముసుగు దొంగలు.. మారణాయుధాలతో కాలనీల్లో సంచారం!
- ఫుడ్ పాయిజన్ కలకలం.. మండీ బిర్యానీ తిని చిన్నారులు సహా 9 మందికి అస్వస్థత!





