April 16, 2025
SGSTV NEWS
CrimeTelangana

రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని దుర్మరణం

అమ్మా.. సెలవులకు పిన్ని దగ్గరకు వెళ్తున్నా.

రేపు ప్రోగ్రెస్‌కార్డు తీసుకోనుందీ

చెప్పిన పావు గంటకే కాటేసిన మృత్యువు

హైదరాబాద్: అమ్మా.. నేను సెలవులకు పిన్ని వాళ్ల ఇంటికి వెళ్తున్నా.. రేపు స్కూల్‌లో ప్రోగ్రెస్‌ కార్డు ఇస్తారు.. నువ్వు, నాన్న వెళ్లి తీసుకోండి.. అని చెప్పి సోదరుడితో కలిసి బైక్‌పై బయలుదేరిన కొద్దిసేపటికే ఓ బాలికను బస్సు రూపంలో మృత్యువు కాటేసింది. ఈ హృదయవిదారక ఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… ఖమ్మం జిల్లా, భోనకల్లు మండలం, నారాయణపురం గ్రామానికి చెందిన గురవయ్య, తిరుపతమ్మ దంపతులు రహమత్‌నగర్‌లో ఉంటున్నారు. గురవయ్య జూబ్లీహిల్స్‌ చట్నీస్‌ చౌరస్తాలో కొబ్బరి బొండాల వ్యాపారం చేసేవాడు. ఆయన కుమార్తె దుడ్డు శిరీష(15) ఇటీవలే తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది.

బుధవారం నుంచి సెలవులు ఇవ్వడంతో సోదరుడు గోపితో కలిసి మంగళవారం రాత్రి ఫిలింనగర్‌లో ఉంటున్న పిన్ని ఇంటికి బయలుదేరింది. యూసుఫ్‌గూడ మీదుగా వెళుతుండగా రోడ్డుపై ఆగి ఉన్న ఆర్టీసీ బస్సు పక్క నుంచి వెళ్లే క్రమంలో బస్సు వెనుక డోర్‌ శిరీష ముఖానికి తగలడంతో కిందడపడింది. ఆమె తలకు, ముఖానికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందింది. గోపీ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటనతో గురవయ్య కుటుంబంలో విషాదం నెలకొంది.

ఆర్టీసీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. రోడ్డుకు ఒక పక్క బైక్‌ ఆపి ఉందని, మరో పక్క బస్సు ఆగి ఉండగా, ఈ రెండింటి మధ్య నుంచి గోపీ బైక్‌ వెళ్లడంతో ప్రమాదవశాత్తు బస్సు వెనుక డోర్‌ తలకు గీసుకుపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లుగా పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా నిర్ధారించారు. ఒక్కగానొక్క కూతురు కన్నుమూయడంతో గురవయ్య, తిరుపతమ్మ దంపతులు ఠాణా ఆవరణలోనే కుప్పకూలిపోయారు. ప్రోగ్రెస్‌ కార్డు తీసుకోండంటూ చెప్పిన కొద్దిసేపటికే బిడ్డ మరణవార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని తండ్రి బోరున విలపించాడు. జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

Also read

Related posts

Share via