July 1, 2024
SGSTV NEWS
Telangana

రిసార్టుల్లో మంతనాలు.. ముడుపులతో విదేశీ పర్యటనలు



ఉదయం అంతా చెరువుల పరిశీలనలు.. సాయంత్రం వేళల్లో వాటిని ఎలా ఆక్రమించాలో బిల్డర్లకు సలహాలు.. భారీగా ముట్టిన ముడుపులతో విదేశీ పర్యటనలు..

జల వనరులను ఆక్రమించేందుకు సంపూర్ణ సహకారం నీటిపారుదల శాఖలో అవినీతి తిమింగలాల తెరవెనుక కార్యకలాపాలు

హైదరాబాద్: ఉదయం అంతా చెరువుల పరిశీలనలు.. సాయంత్రం వేళల్లో వాటిని ఎలా ఆక్రమించాలో బిల్డర్లకు సలహాలు.. భారీగా ముట్టిన ముడుపులతో విదేశీ పర్యటనలు.. ఇవీ భవన నిర్మాణానికి నిరభ్యంతర పత్రం ఇచ్చేందుకు రూ.2.50 లక్షల లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన రంగారెడ్డి జిల్లా నీటిపారుదల శాఖ అధికారులు బన్సీలాల్, నిఖేశ్ కుమార్, కార్తీక్ల తెరవెనుక కార్యకలాపాలు. ఏడెనిమిదేళ్లుగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో విధులు నిర్వహిస్తున్న వీరు చెరువులు, జలవనరులకు సమీపంలో వెలుస్తున్న బహుళ అంతస్తుల భవనాలు, భారీ వెంచర్లు, టవర్ల నిర్మాణదారుల్లో కొందరికి సంపూర్ణ సహకారాలందించారు. రంగారెడ్డి జిల్లాలో 1720 చెరువులుండగా… ఇందులో 30 శాతానికి పైగా కబ్జాకు గురయ్యాయి. వీటిని ఆక్రమించుకున్న కొందరు రియల్ వెంచర్ల ప్రతినిధులు వీరికి భారీగా ముడుపులు ముట్టజెప్పారన్న ఆరోపణలున్నాయి. ఈ ఆధారాలను అనిశా అధికారులు సేకరించారు. వీరితో ఎవరెవరు సంప్రదింపులు జరిపారో తెలుసుకునేందుకు ముగ్గురి ఇళ్లలో తనిఖీలు చేపట్టారు 

సాయంత్రం నుంచి అక్రమ కార్యకలాపాలు

కొంగరకలాన్లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో సాగునీటిశాఖ విభాగం నుంచి విధులు నిర్వర్తించాల్సిన ఈఈ బన్సీలాల్ అందుకు భిన్నంగా రెడ్డిల్స్ కార్యాలయంలో పనిచేస్తున్నారు. తన కార్యకలాపాలకు తోడుంటారని నిఖేశ్కుమార్, కార్తీక్లను అక్కడికే రప్పించుకున్నారు. చెరువులు చూడాలంటూ ముగ్గురూ బయటకు వెళ్లి సాయంత్రం ఆరింటికి వచ్చేవారు. అప్పటినుంచి అక్రమ కార్యకలాపాలు మొదలు పెట్టేవారు. రియల్ వెంచర్ల ప్రతినిధులను రప్పించుకునేవారు. లేదంటే ముగ్గురూ కలిసి ఫలానా రిసార్ట్లో కలుద్దామంటూ బిల్డర్లకు సమాచారమందించేవారు. అక్కడ జలవనరులను ఎలా ఆక్రమించుకోవచ్చో వారికి సలహాలిచ్చేవారని తెలిసింది. ముడుపుల సొమ్ము బాగా వస్తుండటంతో ఇటీవలే వీరు వేర్వేరుగా విదేశీ పర్యటనకు వెళ్లొచ్చారు.

నీటిపారుదలశాఖలో ఈఈ బన్సీలాల్, ఏఈ నిఖేశ్ కుమార్పై గతంలోనూ ఆరోపణలున్నాయి. బన్సీలాల్ మహబూబ్నగర్లో ఇంజినీర్ గా పనిచేసిన సమయంలో స్టేషనరీ కోసం రూ.19.86 లక్షలు ప్రభుత్వం నుంచి తీసుకుని కొనుగోలు చేయలేదు. దీనిపై ఉన్నతాధికారులు తాఖీదులు జారీచేశారు. ప్రస్తుతం గండిపేట్ డివిజన్ ఏఈగా విధులు నిర్వహిస్తున్న నిఖేశకుమార్ పంటపొలాలను వ్యవసాయేతర భూములుగా మార్చుకునేందుకు దరఖాస్తు చేసిన వారికి నిరభ్యంతర పత్రాలు ఇచ్చేప్పుడు బఫర్ జోన్ పరిధిలోకి నిర్మాణాలు రావంటూ లేఖలు జారీ చేసేందుకు రూ. లక్షల్లో ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలున్నాయి. ముడుపుల సొమ్ములతో వీరు ఇళ్లస్థలాలు, ఫ్లాట్లు కొన్నట్లు తెలిసింది.

అనిశాకు చిక్కిన ముగ్గురు ఇంజినీర్లు, సర్వేయర్ అరెస్ట్

ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్ రెడొల్స్లోని రంగారెడ్డి జిల్లా నీటిపారుదలశాఖ కార్యాలయంలో దస్త్రం ఆమోదానికి లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన ముగ్గురు ఇంజినీర్లు, సర్వేయర్ను అరెస్ట్ చేశారు. ఓ వ్యక్తి భవన నిర్మాణానికి నిరభ్యంతర పత్రం కోసం  దరఖాస్తు చేసుకోగా.. రూ.2.5 లక్షలు ఇస్తే పని పూర్తిచేస్తామంటూ రంగారెడ్డి జిల్లా ఈఈ బన్సీలాల్, ఏఈలు కార్తీక్, నిఖేశ్ కుమార్ చెప్పడంతో రూ.1.5 లక్షలు చెల్లించారు. మరో రూ. లక్ష ఈఈ కార్యాలయంలో తీసుకుంటుండగా రెడ్యండెడ్గా పట్టుబడ్డారు. బన్సీలాల్ నుంచి రూ.65 వేలు, నిఖేశ్కుమార్ నుంచి రూ.35 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఇదే కేసులో రూ.40 వేలు డిమాండ్ చేసిన గండిపేట తహసీల్దార్ కార్యాలయ సర్వేయర్ గణేశ్ ను గురువారం అర్ధరాత్రి తరువాత అరెస్టు చేశారు.

Also read

Related posts

Share via