April 4, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

దళిత యువకుడి హత్యకేసులో వైసీపీ మాజీ మంత్రి కుమారుడు
వైసీపీ మాజీ మంత్రి విశ్వ‌రూప్ తో కుమారుడు శ్రీ‌కాంత్‌



అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం అయినవిల్లికి చెందిన దళిత యువకుడు మిస్సింగ్‌ ఆపై అనుమానస్పద మృతి కేసులో వైసీపీ మాజీ మంత్రి పినిపే విశ్వరూప్‌ కుమారుడు పినిపే శ్రీకాంత్‌ పేరు ఏ1 గా చేర్చడంతో ఒక్కసారిగా చర్చనీయాంశం అయ్యింది.. దళిత యువకుడిది హత్యే అని విచారణ ద్వారా నిర్ధారించారు పోలీసులు..మాజీ మంత్రి కుమారుడు పినిపే శ్రీకాంత్‌ ఆదేశాలమేరకే దళిత యువకుడు జనుపల్లి దుర్గాప్రసాద్‌ను హత్య చేశారని పోలీసుల అదుపులో ఉన్న ధర్మేష్‌ అనే యువకుడు పోలీసుల విచారణలో వెల్ల‌డించ‌డంతో మంత్రి కుమారుడు శ్రీకాంత్‌ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.. ఈ కేసు మొత్తం వ్యవహారంలో మరో నలుగురు ఉన్నట్లు పోలీసులు ప్రాధమికంగా నిర్ధారణకొచ్చినట్లు తెలుస్తోంది..

ఎవరీ మృతుడు… అసలేం జరిగింది..

అయినవిల్లి గ్రామానికి చెందిన జనుపల్లి దుర్గాప్రసాద్‌ ఇదే గ్రామంలో వాలంటీర్‌గా పనిచేస్తుండేవాడు.. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.. వైసీపీ మాజీ మంత్రి పినిపే విశ్వరూప్‌కు అనుచరునిగా ఉండే యువకుల్లో దుర్గాప్రసాద్‌ కూడా ఒకడు.. మాజీ మంత్రి కుమారుడు పినిపే శ్రీకాంత్‌ రాజకీయంగా ప్రవేశం చేసి తొలుత పి.గన్నవరం ఎమ్మెల్యే టిక్కెట్టు ఆశించారు. ఈక్రమంలోనే ఆ నియోజకవర్గ పరిధిలో కూడా పర్యటించేవారు.. దీంతో అయినవల్లి గ్రామ వాలంటీర్‌గా ఉన్న దుర్గాప్రసాద్‌ పినిపే శ్రీకాంత్‌ ముఖ్యఅనుచరుల్లో ఒకడుగా మారారు.. ఇదిలా ఉండగా 2022 జూన్‌ 6న దుర్గాప్రసాద్‌ అదృశ్యమయ్యాడు. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెట్టడంపై కోనసీమ వ్యాప్తంగా అల్లర్లు జరగ్గా.. ముఖ్యంగా అమలాపురం కేంద్రంగా తీవ్రమైన అల్లర్లు చోటుచేసుకున్నాయి.. దీంతో మే 24 నుంచి దాదాపు నెల రోజుల పాటు పోలీసులు కర్ఫ్యూ విధించారు. అదే సమయంలో దుర్గాప్రసాద్‌ అదృశ్యం కాగా జూన్‌ 10న ముక్తేశ్వరం`కోటిపల్లి రేవు వద్ద దుర్గాప్రసాద్‌ మృతదేహం లభ్యం అయ్యింది. అప్పటికే మృతుని భార్య ఫిర్యాదు మేరకు మిస్సింగ్‌ కేసు నమోదుకాగా అనుమానస్పద కేసుగా నమోదు చేశారు. అయితే  పోస్ట్‌ మార్టం నివేదికలో మాత్రం మెడ ఎముక విరిగి మృతిచెందినట్లు వెల్లడికాగా ఇది హత్య కేసుగా భావించినప్పటికీ రాజకీయ ఒత్తిళ్ల మధ్య ఆ కేసును పెండిరగ్‌లో ఉంచినట్లు తెలుస్తోంది.. అదే సమయంలో మరో దళత యువకుడి హత్య కూడా జరిగిందని అదికూడా రాజకీయ ఒత్తిళ్ల మేరకు పెండిరగ్‌లో ఉండిపోయినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.. దీనికి అప్పటి వైసీపీ మంత్రి పినిపే విశ్వరూప్‌ మౌఖిక ఆదేశాల మేరకే పోలీసులు నీరుకార్చారని ఆరోపణలు వచ్చాయి..

డీజీపీ ఆదేశాలతో విచారణతో…

అయినవిల్లి మండలానికి చెందిన ఇద్దరు దళత యువకుల హత్య కేసుకు సంబందించి విచారణచేసి దోషులను పట్టుకోవాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ డీజీపీ ద్వారకా తిరుమలరావుకు వినతిపత్రాన్ని సమర్పించారు. దీంతో డీజీపీ ఆదేశాల మేరకు విచారణ అధికారికగా కొత్తపేట డీఎస్పీ గోవిందరావును విచారణ అధికారిగా నియమించిన అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఇందులో భాగంగా మంత్రి కుమారుడు పినిపే శ్రీకాంత్‌ ముఖ్య అనుచరుల్లో ఒకడైన ధర్మేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.. దీంతో డొంక కదిలింది..

విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి..

ఇద్దరు దళిత యువకుల హత్య ఉదంతంలో విచారణ చేపట్టిన పోలీసులు అదుపులోకి తీసుకున్న దర్మేష్‌ను తమదైన శైలిలో విచారణ చేపట్టగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.. మాజీ మంత్రి కుమారుడు పినిపే శ్రీకాంత్‌ ఆదేశాలమేరకే మృతుడు దుర్గాప్రసాద్‌ హత్యకు ఫథక రచన జరిగినట్లు తెలిపినట్లు సమాచారం. ఈమేరకే దుర్గాప్రసాద్‌ను జూన్‌ 5వ తేదీన మహిపాల చెరువు ప్రాంతంలో ఉన్న గ్రాండ్‌పార్కు కల్యాణ మండపం వద్దకు రమ్మని పిలవగా దుర్గాప్రసాద్‌ ఆరోజు రాలేదని, అయితే ఆరో తేదీన దుర్గాప్రసాద్‌ను, ధర్మేష్‌ను కోటిపల్లి వెళ్లాలంటూ  మాజీ మంత్రి విశ్వరూప్‌ కుమారుడు శ్రీకాంత్‌ చెప్పాడని, ఈక్రమంలోనే తాను, మృతుడు దుర్గాప్రసాద్‌లు ఇద్దరూ కోటిపల్లి వెళ్లగా అక్కడ అప్పటికే ఉన్న నలుగురు యువకులకు దుర్గాప్రసాద్‌ను అప్పగించినట్లు ధర్మేష్‌ విచారణలో వెల్ల‌డించిన‌ట్లు తెలిసింది. పోలీసుల విచారణలో వెల్లడైన ప్రకారం ఈకేసులో మొదటి నిందితునిగా మాజీ మంత్రి విశ్వరూప్‌ కుమారుడు పినిపే శ్రీకాంత్‌ను చేర్చారు.

అజ్ఞాతంలోకి మాజీ మంత్రి కుమారుడు..

తన తండ్రి రాజకీయ వారసునిగా ఎంట్రీ ఇచ్చిన పినిపే శ్రీకాంత్‌ ఇప్పుడు దళిత యువకుడి హత్య కేసులో మొదటి నిందితునిగా ఉండడం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.. ఒక దశలో తండ్రి విశ్వరూప్‌కు కాదని తనకే టిక్కెట్టు ఇవ్వాలని పట్టుపట్టిన శ్రీకాంత్‌ అమలాపురం వైసీపీ ఎమ్మెల్యే టిక్కెట్టు దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. చివరకు ఈసారి విశ్వరూప్‌కే టిక్కెట్టు ఇస్తున్నట్లు అధిష్టానం ప్రకటించిన తరువాత ఆయన క్రమక్రమంగా నియోజకవర్గానికి దూరమయ్యారు. ఇదిలా ఉంటే తాజాగా హత్య కేసులో నిందితునిగా పేరు చేర్చడంతో అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పోలీసుల అదపులో ఉన్న ధర్మేష్‌ను కోర్టులో ప్రవేశపెట్టాలంటూ హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటీషన్‌ దాఖలు చేయగా ఈనెల 25న ధర్మేష్‌ను కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. దీంతో నిందితునికి కోర్టు రిమాండ్‌ విధించింది. ప్రధాన నిందుతుడు శ్రీకాంత్‌తోపాటు మరో నలుగురి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది..

Also read

Related posts

Share via