తెనాలిలో పోలింగ్ రోజు జరిగిన ఘటన స్థానికంగా ఉద్రిక్తంగా మారింది. పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఓటరు చెంపమీద కొట్టడం.. ఆ వెంటనే ఓటరు ఎమ్మెల్యేపై చెయిచేసుకోవడం.. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే అనుచరులు ఓటరును చితకబాదడం క్షణాల్లో జరిగిపోయాయి. తెనాలిలో జరిగిన ఈ ఘటన ఏపీతోపాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కాగా.. పోలింగ్ కేంద్రంలో ఓటరుపై దాడికి పాల్పడిన ఘటనపై ఈసీ సీరియస్ అయింది.. ఈ ఘటనలో తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడు గొట్టిముక్కల సుధాకర్ ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు తెనాలి పోలీసులు వెల్లడించారు. ఎమ్మెల్యేతోపాటు మరో ఏడుగురు తనపై దాడి చేసినట్లు సుధాకర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
నాదెండ్ల ఫైర్..
ఈ ఘటనపై జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. ఎమ్మెల్యే ప్రవర్తన దారుణమన్నారు. ఓడిపోతానన్న అసహనంతో ఇలా ప్రవర్తిస్తున్నారంటూ మండిపడ్డారు నాదెండ్ల..
ఎమ్మెల్యే ఏమన్నారంటే..
ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సైతం ఈ ఘటనపై వివరణ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీలకు కొమ్ముకాసే వ్యక్తి వచ్చాడంటూ తనపై పరుషపదజాలాన్ని ఉపయోగించాడన్నారు. ఆ వ్యక్తి కూడా తన కులమేనని.. అయితే టీడీపీ, జనసేన కోసం పనిచేస్తూ ఓటర్లను రెచ్చగొట్టడానికి ప్రయత్నించాడన్నారు.
నిమ్మగడ్డ రమేష్ పరామర్శ..
చెంప దెబ్బ బాధితుడు వి.సుధాకర్ ను జిజిహెచ్ లో మాజీ ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ పరామర్శించారు. వైసీపీ ఎమ్మెల్యే శివకుమార్ ఓటు వేయడానికి వచ్చిన సుధాకర్ పై చెయ్యి చేసుకోవడం దారుణమన్నారు. ఎమ్మెల్యే అనుచరులు సుధాకర్ పై తీవ్రంగా దాడి చేసి కొట్టారన్నారు. ఎన్నికలసంఘం తీవ్రంగా స్పoదించడంతో ఎమ్మెల్యే శివకుమార్ ను గృహ నిర్బంధం చేశారని తెలిపారు. ఎమ్మెల్యే పదవిలో ఉండి అహంకార పూరితంగా వ్యవహరించారన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే స్పందించి ప్రజాస్వామ్యాన్ని బ్రతికించారని.. ఎమ్మెల్యే మంది మార్బలంతో ఓటింగ్ చేయడానికి రావడమే దీనికి ప్రధాన కారణం అంటూ ఫైర్ అయ్యారు.
అసలు ఏం జరిగిందంటే..
తెనాలిలోని ఐతానగర్ పోలింగ్ కేంద్రానికి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తన కుటుంబసభ్యులతో కలిసి ఉదయం 11 గంటల సమయంలో ఓటు వేసేందుకు వచ్చారు. క్యూలైన్‌లో రాకుండా.. నేరుగా పోలింగ్ బూత్‌లోకి దర్జాగా వెళ్లిపోయి ఓటు వేశారు. అప్పటికే క్యూలైన్లో సుధాకర్ అనే వ్యక్తి అందరూ క్యూలైన్లో నిలబడి వచ్చి ఓటు వేయాలని చెప్పాడు.. దీంతో ఓటు వేసి వచ్చిన ఎమ్మెల్యేకు ఆయన అనుచరులు సుధాకర్ చేసిన వ్యాఖ్యల గురించి చెప్పడంతో ఆగ్రహానికి గురైన అన్నాబత్తుని శివకుమార్… అతని చెంపపై కొట్టారు. దాంతో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైన సుధాకర్.. తిరిగి అదే వేగంతో ఎమ్మెల్యే శివకుమార్ చెంపపై కొట్టారు. ఈ పరిణామంతో ఒక్కసారిగి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.. ఎమ్మెల్యే అనుచరులు వెంటనే సుధాకర్‌పై దాడిచేసి కొట్టారు. అనంతరం పోలీసులు అందరినీ చెదరగొట్టి అక్కడి నుంచి సుధాకర్ ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై ఈసీ కూడా సీరియస్ అయింది. అన్నాబత్తుని శివకుమార్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
Also read
- అత్తా.. నీ కూతురింక లేదు.. చంపేసిన!
- Andhra Pradesh: 10 నిమిషాల్లో ఇంటికి చేరేవారే.. కానీ అంతలోనే కబలించిన మృత్యువు!
- అయ్యో పాపం.. ఐదేళ్లకే ఆ బాలుడికి ఆయుష్షు తీరిపోయింది..!
- ఎస్బీఐ బ్యాంకుకు కన్నం.. రూ.13 కోట్ల విలువ చేసే బంగారం లూటీ.. లబోదిబోమంటున్న కస్టమర్లు
- స్కూల్‌కి వెళ్లాల్సిన బాలుడు.. బావిలో శవమై తేలాడు.. మిస్టరీగా మారిన మరణం