November 21, 2024
SGSTV NEWS
CrimeTelangana

భవనంపై నుంచి దూకి విద్యార్ధి ఆత్మహత్య

పేట్‌బషీరాబాద్‌, ఏప్రిల్ 15: పరీక్షల ఒత్తిడితో ఓ విద్యార్ధి నిండు జీవితానికి ముగింపు పలికాడు. మరికొన్ని రోజుల్లో జరగనున్న నీట్‌ పరీక్షలో అర్హత సాధించలేనేమోనన్న మనస్తాపంతో విద్యార్థి భవనం ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన తెలంగాణలోని పేట్‌బషీరాబాద్‌లో చోటు చేసుకుంది. ఎస్సై రాంనారాయణ తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అరవింద్‌ జస్వాల్‌, మీన్‌ దంపడులు.. హైదరాబాద్‌లోని జీడిమెట్ల స్ప్రింగ్‌ఫీల్డ్‌ కాలనీ చంద్రోదయ రెసిడెన్సీలో నివాసం ఉంటున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ స్థానికంగా గార్మెంట్స్‌ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వారికి ఇద్దరు సంతానం. కుమారుడు పియూస్‌ జస్వాల్‌ (22), కుమార్తె ఉన్నారు. పియూస్‌ గతంలో రెండుసార్లు నీట్‌ పరీక్ష రాసి అర్హత సాధించలేకపోయాడు. ఈ ఏడాది జరగనున్న నీట్‌ పరీక్ష రాసేందుకు మళ్లీ సిద్ధమవుతున్నాడు. నీట్‌ పరీక్ష మే 5వ తేదీన జరగనుంది.

ఇప్పటికే నీట్‌ పరీక్షకు సన్నద్ధమవుతున్న పీయూష్‌ ఈ సారి కూడా నీట్‌లో అర్హత సాధించలేనేమోనని ఆందోన చెందాడు. ఈ క్రమంలో అతను అధిక ఒత్తిడికి గురైన పీయూస్‌ శనివారం రాత్రి 11 వరకు ఇంట్లో కుటుంబ సభ్యులంతా కలిసి ఐపీఎల్‌ మ్యాచ్‌ చూశాడు. అనంతరం నీట్‌ పరీక్షకు చదవలేకపోతున్నానని, ఆత్మహత్య చేసుకుంటున్నానని కోచింగ్‌ తీసుకుంటున్న తోటి విద్యార్థుల వాట్సప్‌ గ్రూపులో రాత్రి 11.30 గంటల సమయంలో మెసేజ్‌ పెట్టాడు. వారు దాన్ని చూసి వెంటనే పీయూష్‌ తల్లిదండ్రులకు అర్ధరాత్రి 1.35 గంటలకు ఫోన్‌ చేసి అప్రమత్తం చేశారు. అయితే అప్పటికే ఆలస్యం అయ్యింది. తల్లిదండ్రులు బయటకు వచ్చి చూడగా అపార్టుమెంట్‌పై నుంచి దూకి రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించాడు. పరీక్షల ఒత్తిడిని భరించలేకపోతున్నానని, తన నిర్ణయానికి తల్లిదండ్రులకు క్షమాపణలు చెబుతున్నానని పేర్కొంటూ సూసైడ్ నోట్‌ను కూడా రాశాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆదివారం కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

దీనిపై పీయూష్‌ తండ్రి అరవింద్ జైస్వాల్ మాట్లాడుతూ.. ‘పీయూస్‌ నా పెద్ద కుమారుడు. అతను మాతో చాలా సంతోషంగా ఉండేవాడు. ఎప్పుడూ విచారంగా కనిపించలేదు. చాలా తెలివైనవాడు. పీయూష్‌ తన స్వంత ఆసక్తితో నీట్‌ పరీక్షకు ప్రిపేపర్‌ అవుతున్నాడు. మేము చదువుకోమని అతన్ని ఎప్పుడూ ఒత్తిడి చేయలేదు. గతంలో రెండు సార్లు నీట్‌లో విఫలమవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఆ సమయంలో మేము పీయూష్‌కు అండగా నిలిచి ధైర్యాన్ని నింపాం. మామూలు స్థితికి వచ్చాడనే మేమంతా అనుకున్నాం. పీయూస్‌ చనిపోయే రోజు కూడా అందరితో కలిసి సరదాగా డిన్నర్‌ చేశాడు. ఘటర సమయంలో అందరం నిద్ర పోతున్నాం. అర్ధరాత్రి 12.30 గంటలకు పీయూస్‌ ఫ్రెండ్‌ ఫోన్‌ చేసి తాను సూసైడ్‌ చేసుకుంటున్నట్లు మెసేజ్‌ చేశాడని తెలిపాడు. వెంటనే పరుగుపరుగున వెళ్లి చూడగా అప్పటికే అపార్ట్‌మెంట్‌ పై నుంచి దూకి తనువు చాలించాడంటూ’ కన్నీరు మున్నీరుగా విలపించాడు.  కాస్త ముందుగా తెలిసినా నా కొడుకుని కాపాడుకునే వాళ్లం అంటూ రోధించాడు. దీనిపై  పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Also read

Related posts

Share via