November 22, 2024
SGSTV NEWS
Andhra PradeshPolitical

వాలంటీర్ల వ్యవస్థపై స్పందించిన సీఈసీ.. ఏపీ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు..

సార్వత్రిక ఎన్నికల్లో వాలంటీర్లపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. ఎలాంటి సంక్షేమ పథకాలకు వాలంటీర్ల చేత డబ్బు పంపిణీ చేయించవద్దని ఆదేశాలు జారీ చేసింది. దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన క్రమంలో దేశ వ్యాప్తంగా కోడ్ అమల్లో ఉంది. ఈ కోడ్ ప్రభావం ఏపీలోని సచివాలయ వ్యవస్థలో పనిచేసే వాలంటీర్లపై పడింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా అందజేసేందుకు ఈ వ్యవస్థను రూపొందించారు. ఈ తరుణంలో ఓటర్లపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతారని టీడీపీ నేత వర్ల రామయ్య, నిమ్మగడ్డ రమేష్ ఎన్నికల కమిషన్ వద్ద పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ పిటిషన్ ను స్వీకరించిన ఈ అంశాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపింది.

ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల కమిషన్ వాలంటీర్లపై కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ఉన్నంతవరకు వాలంటీర్లకు ఇచ్చిన మొబైల్ ఫోన్లు ఇతర పరికరాలు స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ రూల్స్ ఈ క్షణం నుంచే అమలు కానున్నట్లు తెలిపింది. అందుకే సంక్షేమ పథకాల అమలుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని సూచించింది. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈసిఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. పెన్షన్ల పంపిణీకి కూడా వాలంటీర్లను ఉపయోగించవద్దని ఆదేశాలు ప్రత్యేకంగా తెలిపింది. అవసరం అనుకుంటే ప్రభుత్వ సిబ్బందిని ఈ సేవలకు వాడుకోవాలని కూడా సూచించింది. దీంతో ఏపీలో జూన్ 4 ఎన్నికల ఫలితాలు విడుదల అయి కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు వాలంటీర్లు ఎలాంటి సేవలు అందించేందుకు వీలు లేదు. వాలంటీర్ల స్థానంలో సచివాలయ సిబ్బందిని పంపిస్తారా లేక ప్రభుత్వం ఎలాంటి ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేస్తుందో అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Also read

Related posts

Share via