SGSTV NEWS online
CrimeTelangana

మహిళల చేతులు కట్టేసి, నోటికి ప్లాస్టర్ వేసి రూ.3.20 కోట్లు చోరీ



హైదరాబాద్‌: నగరంలోని ఎల్బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో భారీ నగదు దోపిడీ కలకలం రేపింది. మన్సూరాబాద్‌లోని చందేశ్వర్‌ కాలనీ రోడ్‌ నంబర్‌ 2లో ఉన్న ప్లాట్‌ నంబర్‌ 61లో నలుగురు గుర్తుతెలియని ముసుగు దొంగలు ఇంట్లోకి చొరబడి రూ.3.20 కోట్ల నగదును అపహరించారు.

ఈ ఘటన నేడు (శనివారం) మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో చోటుచేసుకుంది. ఇంట్లో ఉన్న సామ మానమ్మ (65), ఆమె కోడలు మౌనిక చేతులను కట్టేసి, వారి నోటికి ప్లాస్టర్‌ వేసిన దుండగులు బెడ్‌రూమ్‌లోని బీరువాను బలవంతంగా పగులగొట్టారు. అనంతరం ఆ బీరువాలో ఉన్న భారీ నగదును తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు.

ఆస్ట్రేలియాలో ఉంటున్న కొమ్మరవెల్లి సంపత్‌ కుమార్‌ రెడ్డి స్థలం కొనుగోలు కోసం తన బావమరిది కుంభం విజయ్‌ కుమార్‌ రెడ్డి ఖాతాకు నగదు పంపించినట్లు సమాచారం. బంధువుల పెళ్లికి వెళ్లాల్సి ఉండటంతో ఈ నెల 22న విజయ్‌ కుమార్‌ రెడ్డి ఆ నగదును మన్సూరాబాద్‌లోని సామ ప్రవీణ్‌ ఇంట్లో భద్రపరిచినట్లు సమాచారం.

సమాచారం అందుకున్న ఎల్బీనగర్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇంట్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తూ నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. దుండగుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.

Also read

Related posts