డబ్బు కోసం బంధాలు,అనుబంధాలను మరిచిపోతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. కేవలం నానమ్మకు వచ్చే ప్రభుత్వ ఆర్థిక సాయంలో వాటా ఇవ్వలేదన్న కోపంతో ఓ మనవడు ఆమెను దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని గోనె సంచుల్లో కుక్కి, రాళ్లు కట్టి డ్యామ్‌లో పడేశాడు. చివరకు పోలీసుల విచారణలో నేరం బయటపడటంతో నిందితుడు కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన కర్ణాటకలోని బెలగావి జిల్లాలో చోటుచేసుకుంది.
బెలగావి జిల్లా హుక్కేరి తాలూకా అరళికట్టి గ్రామానికి చెందిన హమ్మవ్వ బాలప్ప సనాది (78)కు ప్రభుత్వం అమలు చేస్తున్న గృహలక్ష్మి పథకం ద్వారా ప్రతినెలా రూ.2 వేల ఆర్థిక సాయం అందుతోంది. ఈ డబ్బులో తనకు కూడా కొంత ఇవ్వాలని ఆమె మనవడు రామప్ప సనాది (20) కొంతకాలంగా అడుగుతున్నాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. డబ్బులు పంచుకునే విషయంలో వివాదం చాలాకాలంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో నవంబర్ 10న హమ్మవ్వ పష్చాపూర్ వారపు సంతకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయలుదేరింది. ఆమెకు వెండి ఆభరణాలు కొనిస్తానని నమ్మించిన రామప్ప తన ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లాడు. అయితే ఆమెను సంతకు తీసుకెళ్లకుండా సిద్ధేశ్వర కొండ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు.
అక్కడ మరోసారి గృహలక్ష్మి పథకం ద్వారా వస్తున్న డబ్బుల్లో తనకు వాటా ఇవ్వాలని అడిగాడు. అందుకు హమ్మవ్వ నిరాకరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన రామప్ప ఆమెను కిందకు తోసి, చేతులతో గొంతు నులిమి, అనంతరం తాడుతో బిగించి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆ తర్వాత ఆమె వద్ద ఉన్న నగదు, బంగారు గొలుసులను తీసుకున్నాడు. మృతదేహాన్ని గోనె సంచుల్లో పెట్టి, వాటికి రాళ్లు కట్టి సమీపంలోని డ్యామ్‌లో పడేశాడు.
మరోవైపు నవంబర్ 10న ఇంటి నుంచి వెళ్లిన హమ్మవ్వ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. బంధువులు, తెలిసిన ప్రాంతాల్లో వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో నవంబర్ 15న జినారల్ గ్రామం సమీపంలోని డ్యామ్ నీటిలో గోనె సంచుల్లో ఉన్న మృతదేహాన్ని గుర్తించారు.
ఈ ఘటనపై హమ్మవ్వ కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో హమ్మవ్వ చివరిసారిగా మనవడు రామప్పతో కలిసి వెళ్లినట్లు గుర్తించారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా హత్యకు సంబంధించిన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అనంతరం పోలీసులు రామప్పను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ప్రభుత్వం అందించే నెలవారీ ఆర్థిక సాయంలో వాటా కోసం కన్నతల్లిలాంటి నానమ్మనే హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. డబ్బు కోసం కుటుంబ బంధాలను సైతం మరిచి ఇంతటి దారుణానికి పాల్పడటంపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also read
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- నవంబర్ 22న రవి ప్రదోష వ్రతం.. శివుడి అనుగ్రహం కోసం ఈ పూజా విధానం పాటించండి!
- ఇంట్లో శాలిగ్రామాన్ని ఎలా ఉంచుకోవాలి? పూజా నియమాలు, దిశ, మహిళలు పూజించవచ్చా?
- కార్తీక పురాణం 13వ రోజు
- మృత్యువు రూపంలో దూసుకొచ్చిన టిప్పర్.. ఇద్దరు మహిళా ఉపాధ్యాయులు స్పాట్‌డెడ్





