SGSTV NEWS online
Andhra PradeshCrime

పెళ్లి వేడుక నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం.. నలుగురు దుర్మరణం



ఆంధ్రప్రదేశ్ లొ ఘోర రోడ్డు ప్రమాదం
చోటుచేసుకుంది. పెళ్లి వేడుకకు హాజరై తిరిగి వస్తున్న కుటుంబం ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి కల్వర్టును బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, నూతన వధూవరులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ విషాద ఘటన ప్రకాశం జిల్లాలోని ఒంగోలు సమీపంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. తిరుపతి నుంచి బాపట్లకు కారులో ప్రయాణిస్తున్నవారు పెళ్లూరు సమీపానికి చేరుకోగానే వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు తీవ్రంగా దెబ్బతింది. ఈ ఘటనలో డ్రైవర్ ప్రవీణ్ పాటు వెంకట్రావు, సుజాత, సీతామహాలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందారు.

కారులో ప్రయాణిస్తున్న నూతన వధూవరులు శ్రీతేజ, కౌశల్య స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఒంగోలులోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వారికి వైద్య చికిత్స అందిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని తెలుస్తోంది.

అయితే ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దుర్ఘటనపై మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఒకే ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో బాధిత కుటుంబాల్లో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.

Also read

Related posts