SGSTV NEWS online
Andhra PradeshCrime

పెళ్లి చేసుకుంటాడనుకుంది.. చివరకు!




వివాహ బంధంతో ఒక్కటవ్వాలని ఇద్దరు కలలు కన్నారు. కలిసి జీవించాలని నిర్ణయించుకుని సహజీవనం ప్రారంభించారు. కానీ పెళ్లి విషయంలో ఇద్దరి మధ్య ఏర్పడిన విభేదాలు చివరకు విషాదానికి దారితీశాయి. యువకుడు వివాహాన్ని వాయిదా వేస్తున్నాడనే మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. పీఎం పాలెం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం దోనుబాయి గ్రామానికి చెందిన సవర త్రివేణి (26) బ్యూటీషియన్‌గా పనిచేస్తోంది. గత ఆరు నెలలుగా విశాఖపట్నంలోని కొమ్మాది టీచర్స్‌ లేఔట్‌లో ఉన్న టీజీఆర్‌ టవర్స్‌లో నివాసం ఉంటోంది. ఆమె తల్లిదండ్రులు గతంలోనే మరణించారు. త్రివేణి రమేష్‌ అనే వ్యక్తితో సహజీవనం చేస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పటికీ, రమేష్‌ పెళ్లి విషయంలో వాయిదా ధోరణి అవలంబిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.

వారం రోజుల క్రితం రమేష్‌ పని నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లాడు. దీంతో అప్పటి నుంచి త్రివేణి ఫ్లాట్‌లో ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాట్సాప్‌ చాట్‌లో పెళ్లి విషయమై వాదనలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే బయలుదేరి తన వద్దకు రాకపోతే చనిపోతానంటూ త్రివేణి రమేష్‌కు సందేశం పంపినట్లు సమాచారం. అయినప్పటికీ అతడు స్పందించకపోవడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైనట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.

సోమవారం అర్ధరాత్రి సమయంలో త్రివేణి తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పీఎం పాలెం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.మృతురాలి సోదరుడు వంశీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పీఎం పాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. వాట్సాప్‌ సంభాషణలు సహా ఘటనకు సంబంధించిన ఇతర వివరాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటన వెనుక ఉన్న పూర్తి పరిస్థితులు దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.

Also read

Related posts