SGSTV NEWS online
Spiritual

విష్ణుమూర్తి తులసిని ఎందుకు వివాహం చేసుకున్నారు? తులసి కల్యాణం వెనకున్న కథ

కార్తీక మాసంలో వచ్చే క్షీరాబ్ది ద్వాదశి రోజు ప్రతి ఇంటా తులసి కల్యాణం చేస్తారు. ఈ రోజున తులసి మొక్కను పెళ్లికూతురిలా అలంకరించి, విష్ణుమూర్తి స్వరూపమైన ఉసిరి కొమ్మ లేదా సాలగ్రామ శిలకు ఘనంగా వివాహం జరిపిస్తారు. అసలు శ్రీమహావిష్ణువు తులసిని ఎందుకు వివాహం చేసుకున్నారు. తులసి కల్యాణం వెనక ఉన్న రాక్షస రాజు జలంధరుడి వధ గురించి ఆసక్తికరమైన పురాణ కథ గురించి తెలుసుకుందాం.

కార్తీక మాసంలో వచ్చే శుద్ద ద్వాదశిని క్షీరాబ్ధి ద్వాదశిగా జరుపుకుంటారు. ఈ రోజున ప్రతి ఇంటా భక్తి శ్రద్ధలతో తులసి కల్యాణం నిర్వహిస్తారు. చాతుర్మాస దీక్ష తర్వాత శ్రీమహావిష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొన్న అనంతరం జరిగే తొలి శుభకార్యం ఇదే. ఈ పవిత్రమైన రోజున భక్తులు భక్తిశ్రద్ధలతో తులసి కల్యాణం జరుపుతారు. తులసి మొక్కను ఉసిరి కొమ్మతో వివాహం జరిపిస్తారు. ఈ ఏడాది క్షీరాబ్ధి ద్వాదశి తిథి నవంబర్ 21న వచ్చింది. ఆ రోజు సాయంత్రం తులసి కల్యాణం జరిపేందుకు మంచి సమయం.

తులసి కల్యాణం వెనక ఉన్న పురాణ కథ
పురాణాల ప్రకారం, పూర్వం జలంధరుడు అనే అత్యంత శక్తివంతమైన రాక్షస రాజు ఉండేవాడు. ఇతను పరమశివుని తేజస్సు నుంచి జన్మించాడు. ఒకసారి దేవేంద్రుడు అహంకారంతో పరమశివుడిని అవమానించాడు. ఆ అవమానంతో కోపోద్రిక్తుడైన పరమశివుడు తన మూడో నేత్రాన్ని తెరిచాడు. ఆ నేత్రం నుంచి వెలువడిన అగ్నికణం ప్రళయాగ్నిలా సముద్రంలో పడింది. ఆ సముద్రాగ్ని నుంచి జన్మించినవాడే జలంధరుడు. జలంధరుడు తన అపారమైన బలంతో దేవతలను ఓడించి, స్వర్గలోకాన్ని ఆక్రమించాడు. అతని అరాచకాలను ఆపడం దేవతల వల్ల కాలేదు. జలంధరుడి శక్తికి అసలు కారణం అతని భార్య బృంద తాలూక అచంచలమైన ప్రాతివ్రత్య ధర్మం. బృంద మహా విష్ణువుకు పరమ భక్తురాలు, మహా పతివ్రత. ఆమె పాతివ్రత్యం ఉన్నంత కాలం జలంధరుడిని త్రిమూర్తులు కూడా ఓడించలేరని దేవతలకు అర్థమైంది.

విష్ణుమూర్తి మాయ, బృంద శాపం
జలంధరుడిని ఓడించాలంటే ముందుగా బృంద పాతివ్రత్య భంగం కలగాలని దేవతలంతా కలిసి శ్రీమహావిష్ణువును వేడుకున్నారు. లోకకల్యాణం కోసం శ్రీమహావిష్ణువు కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. జలంధరుడు యుద్దానికి వెళ్లిన సమయంలో విష్ణుమూర్తి.. జలంధరుడి రూపంలో బృంద వద్దకు వెళ్లారు. తన భర్తే యుద్ధంలో గెలిచి తిరిగి వచ్చాడని భావించిన బృంద, ఆయనకు పాదపూజ చేసింది. దీంతో బృంద పాతివ్రత్యం భంగమైంది. యుద్ధంలో పరమశివుడి చేతిలో జలంధరుడు చంపబడ్డాడు. కొద్దిసేపటికే బృంద తన ముందు ఉన్నది తన భర్త జలంధరుడు కాదని, విష్ణుమూర్తి అని తెలుసుకున్నది. విష్ణుమూర్తిపై తీవ్రమైన కోపంతో ఒక శాపం ఇచ్చింది. నీవు రాయిలా కఠినంగా ప్రవర్తించావు కాబట్టి నీవు కూడా ఒక రాయిలా మారిపోతావు అని శపించింది.

బృంద తులసిగా మారడం
తన భక్తురాలైన బృంద భక్తికి, త్యాగానికి శ్రీమహావిష్ణువు చలించిపోయారు. బృంద చితాభస్మం నుంచి ఒక దివ్యమైన, సుగంధభరితమైన మొక్క ఉద్భవించేలా చేశారు. అదే తులసి మొక్క. అప్పుడు శ్రీమహావిష్ణువు బృందకు గొప్ప వరం ప్రసాదించారు. నీ పాతివ్రత్యానికి, నాపై నీకున్న భక్తికి మెచ్చి నిన్ను తులసి రూపంలో శాశ్వతంగా ఉండేలా వరం ఇస్తున్నాను. నీవు ఇచ్చిన శాపం ప్రకారం నేను సాలగ్రామ శిలగా అవతరిస్తాను. కలియుగంలో తులసి దళం లేకుండా నాకు చేసే ఏ పూజను, నైవేద్యాన్ని నేను స్వీకరించను. అంతేకాకుండా ప్రతి ఏటా కార్తీక శుద్ద ద్వాదశి రోజు సాలగ్రామ రూపంలో ఉన్న నన్ను, తులసి రూపంలో ఉన్న నిన్ను భక్తులు వివాహం చేస్తారని అనుగ్రహించారు. ఈ కారణంగానే భక్తులు ప్రతి ఏటా క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి మొక్కను, విష్ణుమూర్తి ప్రతిమతో లేదా సాలగ్రామంతో లేదా ఉసిరి కొమ్మతో కల్యాణం జరుపుతారు. ఇలా జరిపిన వారికి దాంపత్య సౌఖ్యం, సంతాన భాగ్యం, ఐశ్వర్యం, విష్ణు కటాక్షం లభిస్తాయని విశ్వాసం.

Related posts