SGSTV NEWS online
CrimeTelangana

దేవుడా.. మరుజన్మ ఉంటే.. మధ్య తరగతిలో పుట్టించకు!’



ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో దంపతుల బలవన్మరణం పెంపుడు కుక్కకు విషమిచ్చి.. ఉరేసుకున్న భార్యాభర్తలు

రంగశాయిపేట(వరంగల్), : ‘దేవుడా.. మరుజన్మంటూ ఉంటే బిచ్చగాడిలా అయినా పుట్టించు.. ఈ మధ్యతరగతి బతుకులు మాకొద్దు స్వామీ’ అంటూ సూసైడ్ నోట్ రాసి భార్యాభర్తలు ఉరేసుకున్నారు. అనారోగ్య సమస్యలకు తోడు ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో విసిగివేసారిన దంపతులు బతుకు చాలించిన ఈ ఉదంతం వరంగల్ జిల్లా రంగశాయిపేట పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు, బంధువులు తెలిపిన ప్రకారం… స్థానిక ఎస్బీఐ బ్యాంకు వీధిలో అద్దె ఇంట్లో ఉంటున్న నల్లపోగుల సంజయ్కుమార్(60) ప్రైవేటు డ్రైవర్. ఆయన భార్య శోభ(53) టైలరింగ్ చేస్తూ కుటుంబానికి చేదోడుగా ఉంటోంది. వీరికి ఇద్దరు కుమారులు. ఇద్దరికీ వివాహాలయ్యాయి. ఉపాధి నిమిత్తం ముంబయిలో ఉంటున్నారు.

దంపతులు తమ రెక్కల కష్టం మీదే బతుకీడుస్తున్నారు. వయసు రీత్యా వచ్చే అనారోగ్య సమస్యలు, వైద్య ఖర్చులకు తోడు కుటుంబ పోషణకు చేసిన అప్పులకు నెలనెలా వడ్డీలు చెల్లిస్తున్నారు. అనారోగ్యం కారణంగా సకాలంలో వడ్డీలు చెల్లించకపోవడంతో అప్పులు ఇచ్చినవారు అసభ్యంగా దూషించడం, ‘మీకే తిండికి లేదు.. పెంపుడు కుక్క అవసరమా’ అంటూ అవమానించడంతో మనస్తాపానికి గురైన దంపతులు సోమవారం అర్ధరాత్రి పెంపుడు కుక్కకు విషమిచ్చి చంపారు. అనంతరం ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు.

చక్రవడ్డీలు.. బెదిరింపులు.. అవమానాలు

దంపతులు రాసిన నాలుగు పేజీల సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ‘మాకు సొంత ఇల్లు లేదు. అప్పులు ఇచ్చిన వారికి వారానికి ఓ సారి వాయిదాల పద్ధతిలో వడ్డీ చెల్లిస్తున్నా… చక్రవడ్డీల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారు. గొడవ చేసి పరువు తీస్తామంటూ బెదిరించారు. చేసేదేమీలేక చనిపోతున్నాం. మా అవయవాలను దానం చేయండి. ఏళ్లుగా మాతోపాటు ఉంటున్న శునకానికి మాతోపాటే దహన సంస్కారాలు నిర్వహించండి’ అని అందులో రాశారు. మరుజన్మ ఉంటే మధ్య తరగతిలో పుట్టించకు దేవుడా అని వేడుకున్నారు. చివరి రోజుల్లో తమ కుమారులకు భారం కాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

Also read

Related posts