గుంటూరులో సంతానం లేదన్న బాధతో ఓ దంపతులు రెండు నెలల శిశువు అపహరణకు కుట్ర పన్నారు. లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి ముగ్గురితో కలిసి తల్లి పక్కన నిద్రిస్తున్న పసికందును ఎత్తుకెళ్లించారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు శిశువును క్షేమంగా రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు. కేసులో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
తల్లి పక్కనే నిద్రపోతున్న రెండు నెలల శిశువును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. బిడ్డ కనిపించకపోవడంతో తల్లడిల్లిన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారం రోజుల క్రితం అపహరణకు గురైతే ఎట్టకేలకు పోలీసులు నిందితులను పట్టుకోగలిగారు. అసలేం జరిగిందంటే.. గుంటూరులోని ఇందిరా ప్రియదర్శిని కాలనీకి చెందిన శ్రీనివాసరావు దంపతులకు పిల్లలు లేరు. దీంతో వారిద్దరూ సంతానం లేదన్న బాధతో కుమిలిపోతున్నారు. ఈ క్రమంలోనే బిడ్డను దత్తత తీసుకునేందుకు ప్రయత్నం చేయకుండా అపహరించాలన్న ప్రణాళిక వేసుకున్నారు. ఇందులో భాగంగానే ఏటూకూరు రోడ్డులోని ఎస్టేట్ సమీపంలో చెత్త కాగితాల షాపు నిర్వహిస్తున్న లక్ష్మయ్య కుటుంబంపై దృష్టి పెట్టారు. లక్ష్మయ్య దంపతులకు ఆరుగురు సంతానం. చివరి బాలుడు ఏడు కొండలు రెండు నెలల వయస్సున్నవాడు. వాడిని అపహరించాలని శ్రీనివాసరావు తనకు తెలిసిన పాండు నాయక్ తో చెప్పాడు. ఇందుకు లక్ష రూపాయలు ఇస్తానని ఒప్పుకున్నాడు. డబ్బులిస్తానని శ్రీనివాసరావు చెప్పడంతో పాండు నాయక్ తన స్నేహితులైన శివ చంద్ర, చందులతో కలిసి శిశువు అపహరణకు ప్లాన్ వేశాడు.
ఎస్టేట్ సమీపంలోని చిత్తు కాగితాల షాపు వద్ద రెక్కీ నిర్వహించారు. అయితే, ఆ సమయంలో లక్ష్మయ్యకు పాండు నాయక్ వాళ్ల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడి నుండి జారుకున్న పాండు నాయక్ అర్ధరాత్రి తర్వాత మరోసారి లక్ష్మయ్య షాపు వద్దకు వచ్చాడు. అందరూ ఆరు బయట ఆదమరిచి నిద్ర పోతున్నారు. తల్లిపక్కనే రెండు నెలల వయస్సున్న ఏడుకొండలున్నట్లు గుర్తించారు. ముఖాలకు మాస్క్ లు తొడుక్కొని కొద్దీ సేపు అక్కడ ఉన్నారు. ఆ తర్వాత గుట్టు చప్పుడు కాకుండా తల్లి నిద్రపోతున్న మంచం వద్దకు వెళ్లి శిశువును తీసుకొని అక్కడ నుండి జారుకున్నారు. అయితే శిశువును అపహరించడాన్ని గుర్తించి కుక్కలు మొరగసాగాయి. అదే సమయంలో అక్కడే నిద్ర పోతున్న లక్ష్మయ్య కుటుంబ సభ్యుల్లో ఒకరికి మెలుకువ వచ్చింది. అతను లేచి కేకలు వేసే సరికి అక్కడ నుండి పాండు నాయక్ టీమ్ పరారైంది. పక్కనే శిశువు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. శిశువు అపహరణ మొత్తం అక్కడే ఉన్న సిసి కెమెరాల్లో రికార్డైంది. పోలీసులు సిసి కెమెరా విజువల్స్ సాయంతో దర్యాప్తు చేపట్టారు.

పాండు నాయక్ శిశువును శ్రీనివాసరావుకు అప్పగించాడు. శ్రీనివాసరావు దంపతులు శిశువును తీసుకొని పల్నాడు జిల్లాలోని ముప్పాళ్ల వెళ్లారు. అక్కడ శిశువుకు అనారోగ్యంగా ఉండటంతో ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. పాండు నాయక్ టీం నగరంలోని ఒక హాస్టల్లో తల దాచుకున్నారు. సిసి కెమెరా విజువల్స్ సాయంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు శ్రీనివాసరావు అపహరణకు ప్రణాళిక వేసినట్లు తెలిసింది. అతన్ని అరెస్ట్ చేయడంతో నిందితుల అసలు విషయం బయటపడింది. శిశువును క్షేమంగా లక్ష్మయ్య దంపతలకు అప్పగించిన పోలీసులు నిందితులను రిమాండ్ కు తరలించారు.
Also read
- నకిలీ డెత్ సర్టిఫికెట్తో ప్రభుత్వ ఉద్యోగం.. రూ.16 లక్షలకు బేరం.. చివరికి ఏమైందంటే?
- అమ్మ లేవడం లేదని తెలియక.. రాత్రంతా తల్లి మృతదేహం పక్కనే ఏడ్చి సొమ్మసిల్లిన మూడేళ్ల చిన్నారి!
- పిల్లలు లేకపోతే ఇదేం పనిరా..! అడ్డంగా బుక్కైన దంపతులు.. అర్థరాత్రి కుక్కలు మొరగడంతో..
- విషాదం.. పదవ తరగతి విద్యార్థి అనుమానాస్పద మృతి?
- గోకుల్ పార్క్ బీచ్లో విషాదం





