ఆన్లైన్ పరిచయం.. చివరకు అతడి కొంప ముంచింది.. గే డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన కేటుగాడు చెప్పిన మాయమాటలు నమ్మి ఓ అమాయక యువకుడు సర్వం కోల్పోయాడు. చేతిలోని సొమ్ముతో పాటు ఊళ్లో అప్పులు చేసి మరీ రూ.18 లక్షలు అప్పగించిన తీరు స్థానికంగా కలకలం రేపింది. జడ్చర్లలో సంచలనం సృష్టించిన ఈ ఘటనలో అసలు ఏం జరిగింది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
గే డేటింగ్ యాప్… ఆన్లైన్ పరిచయం… నమ్మకంగా మొదలైన వ్యవహారం చివరకు భారీ మోసానికి దారితీసింది. జడ్చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువకుడికి డేటింగ్ యాప్ ద్వారా ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. కొంతకాలంగా ఆన్లైన్లో మాట్లాడుకుంటూ యువకుడికి దగ్గరయ్యాడు. అతడి వ్యక్తిగత విషయాలు, బలహీనతలను తెలుసుకుని వాటినే మోసానికి అవకాశంగా మలుచుకున్నాడు. ఆ తర్వాత వివిధ కారణాలు చెబుతూ విడతల వారీగా డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టాడు. మొదట్లో చిన్న చిన్న మొత్తాలతో మొదలైన వసూళ్లు.. క్రమంగా లక్షల్లోకి చేరాయి. నిందితుడి మాటలు నమ్మిన యువకుడు అడిగినప్పుడల్లా డబ్బులు చెల్లిస్తూ వచ్చాడు. ఇటీవల ప్రభుత్వం నుంచి వచ్చిన పరిహారం డబ్బులను సైతం చెల్లించాడు. అవి సరిపోకపోవడంతో గ్రామంలో తెలిసిన వారి వద్ద అప్పులు చేసి మరీ డబ్బులు ఇచ్చాడు. ఇలా మొత్తంగా సుమారు రూ.18 లక్షలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
అప్పులతో చేయడంతో కుటుంబ సభ్యులకు అనుమానం: అయితే యువకుడు భారీగా డబ్బులు అప్పులు చేయడం కుటుంబ సభ్యులకు తెలియడంతో అసలు వ్యవహారం బయటపడింది. బాధితుడి కుటుంబ సభ్యులు జడ్చర్ల పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. యువకుడితో జరిగిన ఆన్లైన్ సంభాషణలు, డబ్బుల లావాదేవీల వివరాలను పరిశీలించారు. ఈ క్రమంలో మోసం వెనుక ఏపీలోని పల్నాడు జిల్లాకు చెందిన వ్యక్తి ఉన్నట్లు గుర్తించి.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ మోసం ఒక్క యువకుడికే పరిమితం కాలేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వందలాది మంది యువకులను లక్ష్యంగా చేసుకుని ఇదే తరహాలో మోసాలకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడి ఆన్లైన్ పరిచయాలు, బ్యాంకు లావాదేవీలపై విచారణ కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో మరికొందరు బాధితులు ఉన్నారా..? మరెంతమంది నుంచి డబ్బులు వసూలు చేశాడు…? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఆన్లైన్ పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది. వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, ఇతర సమాచారాన్ని అపరిచితులతో పంచుకోవడం… వారి ఒత్తిడికి లొంగి డబ్బులు చెల్లించడం వంటి చర్యలతో ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది.
Also read
- గే డేటింగ్ యాప్‌లో పరిచయం.. తియ్యని మాటలతో యువకుడి కొంపముంచిన కేటుగాడు..
- Cyber Fraud: పోలీసు కానిస్టేబుల్‌కే టోకరా.. రూ.29 లక్షలు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు.. సైబర్ క్రైమ్‌లో కేసు నమోదు!
- హైదరాబాద్‌లో తీవ్ర విషాదం.. ఎనిమిదేళ్ల బాలుడు ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి!
- Raptadu Case Update: హేమంత్ కాలు తీసేయాల్సిందే.. రాప్తాడు నిందితుడి ఆరోగ్యంపై బిగ్ అప్డేట్
- వచ్చే నెలలో పెళ్లి.. అంతలోనే వెంటాడిన మృత్యువు.. అసలేం జరిగిందంటే?





